అక్క దేవతలకు భక్తనీరాజనం

ABN , First Publish Date - 2021-04-13T06:35:17+05:30 IST

పట్టణ శివారులో వెలసిన అక్క మాంబ ఆలయం భక్తులపాలిట కొంగుబంగారంగా వెలుగొందుతోంది. ఈ ఆలయం చార్రితక, పురాణ ఇతిహాసాన్ని పుణికిపుచ్చుకుంది.

అక్క దేవతలకు భక్తనీరాజనం
ప్రత్యేక అలంకరణలో అక్కమాంబ దేవతలు

రేపు అక్కమాంబ తిరుణాల


కళ్యాణదుర్గం, ఏప్రిల్‌  12: పట్టణ శివారులో వెలసిన అక్క మాంబ ఆలయం భక్తులపాలిట కొంగుబంగారంగా వెలుగొందుతోంది. ఈ ఆలయం చార్రితక, పురాణ ఇతిహాసాన్ని పుణికిపుచ్చుకుంది. కొండకు అనుకుని కింది భాగంలో వెలసిన అక్కమాంబ దేవతల ఆలయానికి 400 ఏళ్ల చరిత్ర వున్నట్లు తెలుస్తోంది. ఆలయ విశిష్టత, అక్క దేవతల మహిమలపై స్థానికంగా పలు పురాణ గాథలు ప్రచారంలో ఉన్నాయి. ఏడుగురు దేవకన్యలు ఈశ్వరుని జఠాజూటం నుంచి జన్మించారని చెబుతారు. తల్లిదండ్రులైన పార్వతీపరమేశ్వరుల అనుమతి మేరకు వారు లోక పర్యటనకు పయనమవుతారు. దివి నుంచి భూలోకం వచ్చిన దేవకన్యలైన అక్క దేవతలు దేశాటన చేస్తూ ప్రజల కష్టాలను తీర్చుతూ సాగుతారు. ఓరోజు కళ్యాణదుర్గానికి సమీపాన ఉన్న పాలవాయి గ్రామం వద్దకు చేరుకుంటారు.  అక్కడ ఈశ్వరుని కంఠాభరణమైన సప్తఫణీంద్ర నాగేంద్రుడు తారసపడతాడు. దీంతో ఆ కన్యలు ఆగ్రహించగా, తాను కూడా మీ వెంట ఉంటూ మీ కష్టసుఖాల్లో పాలుపంచుకుంటానని చెబుతూ దారికి అడ్డంగా నిలిచినట్లు పురాణ కథలు చెబుతున్నాయి. అతడి పూర్వ వృత్తాంతాన్ని దివ్య దృష్టితో తెలుసుకున్న అక్కమ్మ దేవతలు వారి వెంట నాగేంద్రుడిని కూడా తీసుకువస్తారు. మాకన్నా ముందు నీకు పూజాపునస్కారాలు లభిస్తాయని వరాన్ని ప్రసాదించి తాము నివసించాలనుకున్న అక్కమాంబ కొండ దిగువ వద్దకు చేర్చారు. కొండ దిగువ భాగాన ఉన్న గర్భగుడిలో శివలింగం, దేవాలయ ప్రాకారాలపై చెక్కిన సర్పం ప్రతిమలను బట్టి ఇక్కడ వెలసిన అక్కమ్మ దేవతలు శివపార్వతుల అంశల వలన జన్మించిన దేవతలుగా భక్తులు నమ్ముతారు.


శైవులు, వైష్ణవులు అన్న తేడా లేకుండా అందరూ అక్క దేవతలను కొలుస్తారు. అక్క దేవతలు జంతు బలులు కోరరని, సాత్విక భావాలు కలిగిన దేవతలుగా కొలుస్తారు. అక్కమ్మ దేవతలను భక్తిశ్రద్ధలతో కొలిస్తే సంతాన ప్రాప్తి కలుగుతుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. అందులో భాగంగా ప్రతి సోమవారం కొండపైన ఉన్న దొణలో సంతానం లేనివారు గంగపూజ నిర్వహించి తమకు సంతానం ప్రసాదించాలని అక్క దేవతలను వేడుకుంటారు. కొండ దిగువన ఉన్న ఆలయంలో నిత్యం విశేష పూజలు కొనసాగుతాయి. 


కాగా పట్టణానికి తూర్పు వైపున ఉన్న అక్కమ్మ కొండను స్థానిక కవులు, కళాకారులు కవితాత్మకంగా వర్ణిస్తుంటారు. వరుసలోని ఓ కొండను నిండు పౌర్ణమి రోజున అల్లంత దూరం నుండి తిలకిస్తే.. స్నానమాచరించి కురులను ఆరబోసుకుని వెల్లకిలా పడుకున్న స్త్రీ మూర్తిగా అభివర్ణిస్తారు. నుదుటి మీద బొట్టు, నిటారుగా మొనదేలినట్లుగా ఉన్న ముక్కు, ఆకట్టుకునే అవయవ సౌష్టవం పండువెన్నెలలో కనువిందు చేస్తున్నట్లు భావవ్యక్తీకరణ మైమరిపిస్తుంది. ఆ కొండనే అక్కమ్మ కొండగా ప్రసిద్ధిగాంచింది. కొండకు పడమర వైపు పట్టణానికి ఆనుకుని ఉన్న మరో కొండ ఏనుగు తొండం ఆకారంలో ఉంటూ భక్తులకు తరింపచేస్తుండడం మరో విశేషం. ప్రకృతి సహజసిద్ధంగా అపురూపమైన దృశ్యంగా ఉండే ఈ కొండలను దేవాదుల కొండ, అక్కమాంబ కొండలుగా ప్రసిద్ధి చెంది ఎన్నో విశిష్టతలు, మహిమలతో అలరారుతున్నాయి.


అక్కమాంబ తిరణాలకు ప్రత్యేక ఏర్పాట్లు

ఉగాది పండుగ పర్వదినాన్ని పురస్కరించుకుని ఈ ఆలయంలో అక్కమాంబ తిరనాళ్లు ఏటా వైభవంగా కొనసాగుతాయి. బుధవారం జరిగే వేడుకకు జిల్లావాసులతో పాటు కర్ణాటక ప్రాంతం నుంచి కూడా భక్తజనం విశేషంగా తరలివస్తారు. పక్షం రోజుల నుంచి పూజారులు, భక్తులు, ఆలయ కమిటీ సభ్యులు ఆలయాన్ని అంగరంగ వైభవంగా ముస్తాబుచేశారు. భక్తులు అక్కమవార్లను దర్శించుకునేందుకు అన్ని ఏర్పాటు చేస్తున్నారు. తాగునీరు, భోజన సౌకర్యాలతో పాటు భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రత్యేక చర్యలు చేపట్టారు. భక్తులు బోనాలు మోస్తూ అమ్మవారికి సమర్పించి మొక్కులు తీర్చుకోవడం  ఆనవాయితీ.  కోలాహలంగా సాగే అక్కమాంబ జాతరకు ఆలయంతో సర్వాంగసుందరంగా ముస్తాబైంది. 



Updated Date - 2021-04-13T06:35:17+05:30 IST