భైంసా ప్రశాంతం

ABN , First Publish Date - 2021-03-09T05:56:30+05:30 IST

ఆదివారం రాత్రి జిల్లాలోని భైంసా పట్టణకేంద్రంలో జరిగిన ఇరువర్గాల ఘర్షణపై పోలీసు యంత్రాం గం అప్రమత్తమయ్యింది.

భైంసా ప్రశాంతం
నిర్మానుష్యంగా మారిన ప్రధానరోడ్డు మార్గం

పట్టణంలో పోలీసుల పకడ్బందీ చర్యలు

భారీ బందోబస్తు .. అదుపులోకి వచ్చిన అల్లర్లు

డ్రోన్‌ కెమెరాలతో గల్లీల్లో నిఘా 

తాత్కాలికంగా నెట్‌వర్క్‌ సేవల నిలుపుదల 

పోలీసుల అదుపులో పలువురు అనుమానితులు

భైంసాలోనే ఉన్నతాధికారుల మకాం

ఘటనపై  కేంద్ర హోం శాఖ మంత్రి  ఆరా 

నిర్మల్‌, మార్చి 8 (ఆంధ్రజ్యోతి)/భైంసా  : ఆదివారం రాత్రి జిల్లాలోని భైంసా పట్టణకేంద్రంలో జరిగిన ఇరువర్గాల ఘర్షణపై పోలీసు యంత్రాం గం అప్రమత్తమయ్యింది. సంఘటన జరిగిన రెండు, మూడు గంటల్లోనే పరిస్థితిని చక్కదిద్దేందుకు పోలీసు తీసుకున్న చర్యలు ఫలితాన్నిచ్చాయి. దీని కారణంగా రాత్రి నుంచే భైంసా పట్టణంలో పరిస్థితులన్ని సద్దుమణిగాయి. కొంతమంది కారణంగా శాంతిభద్రతలకు విఘాతం ఏర్పడుతున్న భావనతో పోలీసులు అటు వైపు నిఘా సారించారు. పోలీసు ఉన్నతాధికారులంతా భైంసాకు చేరుకొని ఎప్పటికప్పుడు పరిస్థితులను సమీక్షిస్తున్నారు. సంఘటన జరిగిన వీధులను దిగ్భంధించి బందోబస్తు చర్యలు ఉధృతం చేశారు. అలాగే పట్టణంలోకి కొత్త వ్యక్తుల సంచారంపై దృష్టి కేంద్రీకరించడమే కాకుండా డ్రోన్‌ కెమెరాలతో అన్ని వీధులపై నిఘా పెట్టారు. ఇదిలా ఉండగా సంఘటనపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా సోమవారం స్వయంగా ఆరా తీయడం ప్రాధాన్యతను సంతరించుకుంది. భైంసాలో జరిగిన అల్లర్లపై ఎంపీ సోయం బాపురావు కేంద్ర హోం శాఖ సహాయమంత్రి కిషన్‌రెడ్డి అలాగే హోం శాఖ మంత్రి అమిత్‌ షాకు ఫిర్యాదు చేయడంతో హోంశాఖ వర్గాలు సైతం ఈ దిశగా అప్రమత్తమయ్యాయి. సోమవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎక్కడ కూడా ఎలాంటి ఆవాంఛనీయ సంఘటనలు జరగలేదు. పోలీసు బలగాలన్ని భైంసా పట్టణాన్ని తమ గుప్పిట్లోకి తీసుకొని గస్తీకాశాయి. సంఘటనకు బాధ్యులైన వారందరినీ ఆదుపులోకి తీసుకొని పోలీసులు విచారణ మొదలుపెట్టారు. అత్యంత సమస్యాత్మక ప్రాంతంగా పేరున్న భైంసాలో ఇలా ఇరువర్గాల మధ్యఘర్షణలు జరగడం ఇది మూడోసారి కావడం గమనార్హం. స్వల్ప వివాదాలు పరిస్థితి తీవ్రతకు కారణమవుతుండడమే కాకుండా ఇరువర్గాల మధ్య ఘర్షణలకు తావిస్తున్నాయి. అయితే పోలీసులు మాత్రం ఓ సంఘటన జరిగిన తరువాత మరో సంఘటన జరగకుండా కట్టుదిట్టంగా బందోబస్తు చర్యలు తీసుకుంటుండడంతో ఉద్రిక్తతల నివారణకు దోహదపడుతోందంటున్నారు. ఇదిలా ఉండగా రాజకీయ కేంద్రంగానూ పేరున్న నిర్మల్‌ జిల్లాకు చాలా రోజుల నుంచి రెగ్యులర్‌ ఎస్పీ లేకపోవడం కూడా కొంత లోటుగా కనిపిస్తుందంటున్నారు. ఎస్పీగా పని చేసిన శశిధర్‌రాజు పదవీ విరమణ చేసిన నాటి నుంచి ఆదిలాబాద్‌ జిల్లా ఎస్పీ విష్ణు ఎస్‌. వారియర్‌ ఇన్‌చార్జీగా వ్యవహరిస్తున్నారు. దీని కారణంగా కూడా పోలీసుశాఖలో కొంత సమన్వయం కొరవడుతోందన్న అభిప్రాయాలున్నాయి. 

ప్రస్తుతం అంతా ప్రశాంతం

ఆదివారం రాత్రి ఇరువర్గాల మఽధ్య ఘర్షణలు చోటు చేసుకున్నప్పటికీ అర్థరాత్రి నుంచి సోమవారం రాత్రి వరకు ఎక్కడ కూడా ఈ ఘర్షణల ప్రభావం కనిపించలేదు. పోలీసులు పకడ్భందీ చర్యలు తీసుకోవడం, డేగ కళ్ళలో నిఘాను విసృతం చేసి సమస్యాత్మక ప్రాంతాలను తమ గుప్పిట్లోకి తీసుకోవడంతో పరిస్థితి ప్రశాంతంగా మారింది. జిల్లా ఇంచార్జీ ఎస్పీ విష్ణు ఎస్‌. వారియర్‌తో పాటు రామగుండం సిపి సత్యనారాయణ లతో పాటు తదితర ఉన్నతాధికారులు భైంసాకు చేరుకొని పరిస్ధితులను సమీక్షించారు. ఘర్షణలు జరిగిన గల్లీల్లోనే కాకుండా భైంసా పట్టణంలోని మిగతా అన్ని వార్డుల్లో పకడ్భందీ చర్యలు చేపట్టారు. అలాగే డ్రోన్‌ కెమెరాలతో నిఘా సారించి ఎప్పటికప్పుడు పరిస్థితులను సమీక్షించారు. ఇప్ప టికే ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను సైతం స్టేషన్‌లకు అనుసంధానం చేసి పరిస్థితులను కట్టుదిట్ట చేయడంలో పోలీసులు నిమగ్నమయ్యారు. సంఘటన జరిగిన కొద్ది సేపట్లోనే పోలీసులు అక్కడికి చేరుకొని అల్లరి మూకలను చెదరగొట్టడమే కాకుండా బాధ్యులను ఆదుపులోకి తీసుకోవడం, క్షతగాత్రులను వైద్యం కోసం ఆసుపత్రులకు తరలించడం లాంటి వ్యవహారాలన్నింటిని పోలీసులు వేగంగా చేపట్టారు. దీంతో మరోసారి ఘర్షణలు గాని వివాదాలు గాని తలెత్తకుండా పోలీసులు నిరోధించగలిగారంటున్నారు. 

అమిత్‌ షా ఆరాపై ఉత్కంఠ

ఇదిలా ఉండగా సున్నిత ప్రాంతంగా హోంశాఖ జాబితాలో ఉన్న భైంసాలో మరోసారి ఇరువర్గాల మధ్య ఘర్షణలు చోటు చేసుకోవడాన్ని రాష్ట్ర, కేంద్ర హోం శాఖలు సీరియస్‌గా పరిగణిస్తున్నాయి. ముఖ్యంగా కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌ షా ఆదివారం రాత్రి జరిగిన సంఘటనపై ఆరా తీయడమే కాకుండా పోలీసులు తీసుకున్న చర్యలపై వివరాలు సేకరించడం ప్రాధాన్యతను సంతరించుకుంటోంది. అమిత్‌ షాతో పాటు కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి కూడా సంఘటనపై సీరియస్‌గా స్పందించారు. ఎప్పటికప్పుడు పరిస్థితులను ఆయన తెలుసుకుంటూ ఇక్కడి వివరాలను సేకరించారు. తరుచుగా భైంసాలో జరుగుతున్న అల్లర్ల కారణంగా ఓ వర్గానికి చెందిన వారు భయబ్రాంతులకు గురవుతున్నారన్న ఫిర్యాదులపై అమిత్‌ షా ఆరా తీసినట్లు సమాచారం. ఎంపీ సోయం బాపురావు ఘటనలో తీవ్రగాయాల పాలైన వారందరినీ పరామర్శించడమే కాకుండా దీనిపై కేంద్ర హోంమంత్రికి ఫిర్యాదు కూడా చేశారు. 

సోషల్‌ మీడియా కథనాల వైరల్‌కు కట్టడి

భైంసా ఘర్షణల కథనాలను సోషల్‌ మీడియా ద్వారా వైరల్‌ కాకుండా పోలీసు శాఖ కట్టుదిట్టమైన చర్యలు చేపట్టింది. ముఖ్యంగా ఆదివారం రాత్రి నుంచే సెల్‌ఫోన్‌ నెట్‌వర్క్‌ను స్థంభింపజేసింది. దీంతో సోషల్‌ మీడియా అయిన వాట్సాఫ్‌, ఫేస్‌బుక్‌, ట్విట్టర్‌, టెలిగ్రామ్‌ లాంటి వాటిని భైంసాలో పని చేయలేదు. గతంలో కూడా భైంసాలో జరిగిన అల్లర్లు సోషల్‌ మీడియా ద్వారా వైరల్‌ అయ్యి ఘర్షణల విస్తరణకు తోడ్పడ్డ సంగతి తెలిసిందే. దీని కారణంగా పోలీసులు ముందుగానే అప్రమత్తమై నెట్‌వర్క్‌ సేవలను నిలిపివేయడంతో ఘర్షణల కథనాలు వైరల్‌ కాకుండా ఆగిపోయాయి. 

Updated Date - 2021-03-09T05:56:30+05:30 IST