నత్తనడకన ‘భగీరథ’ పనులు

ABN , First Publish Date - 2020-09-24T06:54:31+05:30 IST

తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన మిషన్‌ భగీరథ పనులు మండలంలో నత్తనడకన కొనసాగుతున్నాయి

నత్తనడకన ‘భగీరథ’ పనులు

పురోగతి లేని నీటి ట్యాంకు పనులు

నిర్లక్ష్యంగా పడవేసిన నల్లాలు 

గిరిజన గూడాల్లో నేటికి కలుషిత నీరే దిక్కు 


కాసిపేట, సెప్టెంబరు 23: తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన మిషన్‌ భగీరథ పనులు మండలంలో నత్తనడకన కొనసాగుతున్నాయి. ఏళ్లు గడుస్తున్నా పనుల్లో పురోగతి లేక గ్రామీణ ప్రాంతాల ప్రజలకు స్వచ్ఛమైన నీరు అందడం లేదు. దీంతో కలుషిత నీటితోనే కాలం వెళ్లదీస్తున్నారు. మండలంలోని ముత్యంపల్లి, రొట్టెపల్లిలో నిర్మించిన సంపులు అలంకార ప్రాయంగానే మారాయి. ఓవర్‌ హెడ్‌ ట్యాంకుల నిర్మాణ పనులు ఇంకా కొనసాగుతున్నాయి. నిర్ధేశించిన గడువు ముగిసి రెండేండ్లు గడుస్తున్నా మిషన్‌ భగీరథ నీరు అందించడంలో స్పష్టత లేకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. 


సంపుల నిర్మాణం..

2016లో మొదలైన మిషన్‌ భగీరథ పథకంలో భాగంగా ముత్యంపల్లి, రొట్టెపల్లిలో ఒక్కోసంపు 5లక్షల లీటర్ల నీటి సామర్థ్యంతో నిర్మించారు. ఓవర్‌ హెడ్‌ ట్యాంకుల నిర్మాణంపై అధికారుల అలసత్వం, కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం కారణంగా పనులు నత్తనడకన సాగుతున్నాయి. మిషన్‌ భగీరథ నీటితోనైనా స్వచ్ఛమైన నీరందుతుందని భావించిన గిరిజన గ్రామాల ప్రజలకు నిరాశే మిగిలింది. మండలంలోని సోనాపూర్‌, బుగ్గగూడెం, కొండాపూర్‌ పంచాయతీల్లో ఫ్లోరైడ్‌ నీరు తాగి ప్రజలు రోగాల బారిన పడుతున్నారు. మిషన్‌ భగీరథ నీరు వస్తే ఇబ్బందులు అనుకున్న ప్రజలు రోగాలతోనే పోరాటం చేయాల్సి వస్తోంది. కాగా మిషన్‌ భగీరథ ట్యాంకుల కోసం పాత మిని ట్యాంకులకే కలర్స్‌ వేసి కొత్త రంగులతో మురిపిస్తున్నారు.  అందులో కొన్ని శిథిలావస్థలో ఉన్న విషయాన్ని అధికారులు గుర్తించకపోవడంతో స్ధానికులు భయాందోళనలకు గురవుతు న్నారు.  ఇప్పటికైనా సంబంధిత  అధికారులు స్పందించి మిషన్‌ భగీరథ నీటిని వెంటనే గ్రామీణ ప్రాంతాలకు అంది మండల ప్రజలు కోరుతున్నారు.


ప్రజాధనం వృథా..అప్పని స్వరూప, కోనూరు సర్పంచ్‌

తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన మిషన్‌ భగీరథ పనుల వల్ల కోట్లరూపాయల ప్రజాధానం వృథా అవుతోంది. గ్రామంలోని ఏ ఇంటికి మిషన్‌ భగీరథ నీరు రావడం లేదు. కానీ సంతకాలు మాత్రం నీరు వచ్చినట్లు అధికారులు సంతకాలు తీసుకుంటున్నారు. ఇళ్లలోకి వచ్చే పైపులైన్‌లను రోడ్లపై పడేశారు. కొన్ని పైపులు పగిలిపోయాయి. అధికారులు స్పందించి వెంటనే మిషన్‌ భగీరథ నీటిని అందించాలి. 


పనులు పూర్తి చేస్తున్నాం..వినయ్‌, ఆర్‌డబ్య్లూఎస్‌ ఏఈ 

మండలంలోని అన్ని పంచాయతీల్లో మిషన్‌ భగీరథ పనులు పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నాం. గ్రామాల్లో అంతర్గత పైపులైన్‌లను ఏర్పాటు చేస్తున్నాం. కొన్ని ప్రాంతాల్లో వర్షాలు పడుతుండడంతో పనులు ఆలస్యంగా కొనసాగుతుతున్నాయి. సకాలంలో పనులను పూర్తి చేసి గ్రామాలకు సురక్షిత తాగునీటిని అందిస్తాం. 

Updated Date - 2020-09-24T06:54:31+05:30 IST