కాగజ్‌నగర్‌లో కంపుకొడుతున్న ‘భగీరథ’ నీరు

ABN , First Publish Date - 2022-01-24T04:33:35+05:30 IST

కాగజ్‌నగర్‌ మున్సిపాలిటీలో సరఫరా అవుతున్న మిషన్‌ భగీరథ నీరు కంపుకొడుతున్నాయి. ఇలాంటి నీటిని తాగడం వలన వ్యాధులకు గురయ్యే ప్రమాదం ఉందని ప్రజలు ఆందోళన చెందుతున్నారు.

కాగజ్‌నగర్‌లో కంపుకొడుతున్న ‘భగీరథ’ నీరు

-తాగునీటి సరఫరాలో దుర్వాసన

-నీటి స్వచ్ఛతపై అనుమానాలు, సరఫరాలో ఇబ్బందులు 

-వ్యాధుల పాలవుతున్న పట్టణవాసులు 

కాగజ్‌నగర్‌ టౌన్‌, జనవరి 23: కాగజ్‌నగర్‌ మున్సిపాలిటీలో సరఫరా అవుతున్న మిషన్‌ భగీరథ నీరు కంపుకొడుతున్నాయి. ఇలాంటి నీటిని తాగడం వలన వ్యాధులకు గురయ్యే ప్రమాదం ఉందని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. మిషన్‌ భగీరథ ద్వారా సరఫరా అయ్యే నీటిలో నాణ్యతా ప్రమాణాలు లేకపోవడమేనని చర్చించుకుంటున్నారు. పట్టణానికి సరఫరా అయ్యే మంచినీరు ఆసిఫాబాద్‌ సమీపంలోని అడ ప్రాజెక్ట్‌ నుంచి వస్తుంటాయి. పంపుహౌజ్‌ సమీపంలోని క్లోరినేషన్‌ ప్రక్రియ చేపట్టి నీటిని సరఫరా చేయాలి. అలాగే అధికారులు నీటి నాణ్యతను పరీక్షించాలి. అయితే కొంత కాలంగా ఈ ప్రక్రియ చేస్తున్నారా? లేదా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. భగీరథ నీటికి రక్షణ లేకపోవడం వలన పట్టణవాసులు మినరల్‌ వాటర్‌ క్యాన్లను కొనుగోలు చేసుకొంటున్నారు. రెండు రోజుల క్రితం మంచినీటి సరఫరా పూర్తిగా నిలిచిపోయింది. తర్వాత రోజున సరఫరా నీరంతా కంపు వాసనకొట్టాయి. కొందరు ఈ నీటిని బట్టలు ఉతికేందుకు, ఇతర అవసరాలకు మాత్రమే వినియోగిస్తున్నారు. తాగేందుకు ఏమాత్రం వీలు లేకుండా ఉంటున్నాయని పేర్కొంటున్నారు. భగీరథ నీటితో ప్రజలకు చర్మ వ్యాధులు, దురద, అతిసారం, ఇతరత్ర వ్యాధులు వచ్చే అవకాశాలుండడంతో ఎక్కువ మంది ఈ నీటిని వినియోగించడం లేదు. నీటి సరఫరాలో పలుచోట్ల లీకేజీలు కూడా కలుషితం కావడానికి కారణంగా పేర్కొంటున్నారు. 

జిల్లా వ్యాప్తంగా సరఫరా..

అడ ప్రాజెక్టుకు సంబంధించిన మంచినీటిని జిల్లాలోని ప్రధాన మండలాలకు కూడా సరఫరా చేస్తున్నారు. కాగజ్‌నగర్‌ మీదుగా సిర్పూర్‌ (టి) డివిజన్‌లోని కౌటాలా, చింతల మానెపల్లి, బెజ్జూరు, దహెగాం తదితర మండలాలకు ఈ మంచినీటిని సరఫరా చేస్తుంటారు.  ఇందులో భాగంగా కాగజ్‌నగర్‌లోని త్రిశూల్‌ పహాడ్‌పై గల వాటర్‌ ట్యాంకు నుంచి పట్టణంలోని రెండు ఓవర్‌ హెడ్‌ ట్యాంకులోకి నీటిని విడుదల చేస్తారు. జిల్లా వ్యాప్తంగా ప్రజలకు తాగునీటిని అందించే ఈ నీటిని క్లోరినేషన్‌ చేయాల్సి ఉంటుంది. ప్రధానంగా అడ ప్రాజెక్టు పట్టణానికి దూరంగా ఉండడం అక్కడ మంచినీటి శుద్ధిపై ఎలాంటి ప్రక్రియ చేపడుతున్నారనే విషయంపై అనుమానాలున్నాయి. నీరు శుద్ధి కాకపోవడంతోనే తరుచూ నీచు వాసన, కంపు కొడుతున్నాయని ప్రజలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా నీటి నాణ్యత ప్రమాణాలు పాటించేలా ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. 

నీటి శాంపిల్స్‌ పరీక్షలు జరుపుతున్నారా?

నీటి నాణ్యతను పరీక్షించేందుకు ఏ మేరకు పరీక్షలు జరుపుతున్నారు. ఎక్కడ పరీక్షలు చేస్తారు. అలాగే నీటిలో మినరల్స్‌, పొటాషియం, ఐరన్‌, ఫ్లోరైడ్‌తో పాటు బ్యాక్టీరియా ఉందా అని తెలుసుకోవడానికి ఎన్ని రకాల పరీక్షలు చేస్తున్నారనేది సందేహాత్మకంగా మారింది. ఇప్పటికైనా క్లోరినేషన్‌ ప్రక్రియను సక్రమంగా అమలు చేయాలని పట్టణ వాసులు కోరుతున్నారు. 

వ్యాధులు వస్తున్నాయి

-షబ్బీర్‌ హుస్సేన్‌, మాజీ కౌన్సెలర్‌, కాగజ్‌నగర్‌

ఇటీవల మంచినీరు దుర్వాసన వస్తోంది. ఒక్కోసారి తాగునీటిలో మురికి నీరు వస్తోంది. ఈ నీటి వాడకం వలన వ్యాధులు ప్రబలుతున్నాయి. ప్రజలు దురద, జ్వరం, ఇతర వ్యాధుల బారిన పడుతున్నారు. కేవలం బట్టలు ఉతికేందుకు తప్ప ఈ నీటిని వాడడం లేదు. మంచినీటి కోసం మినరల్‌ వాటర్‌ డబ్బాలనే వినియోగించాల్సిన దుస్థితి నెలకొంది. 

క్లోరినేషన్‌ చేపడుతున్నాం

-నాగేశ్వర్‌రావు, డీఈఈ మిషన్‌ భగీరథ, ఆసిఫాబాద్‌ 

మిషన్‌ భగరథ నీటి సరఫరాలో జాగ్రత్తలు పాటిస్తున్నాం. సరఫరా చేసే ముందు పంప్‌ హౌజ్‌లో ఫిల్టర్‌ బెడ్స్‌లో శుద్ధి పూర్తి అయ్యాక మరొక సారి శుద్ధి చేసి సరఫరా చేస్తున్నాం. నీటిని క్లోరినేషన్‌ చేస్తున్నాం. అడ ప్రాజెక్టు నుంచి గుండి, అంకుసాపూర్‌ మీదుగా ఓవర్‌ హెడ్‌ ట్యాంకులోకి వచ్చిన నీటిలో కాగజ్‌నగర్‌ మున్సిపల్‌ సిబ్బంది క్లోరినేషన్‌ చేసుకోవాలి. ప్రతీ 15రోజులకోసారి డెడ్‌ స్టోరేజీలో ట్యాంకును పూర్తి స్థాయిలో శుభ్రం చేసుకోవాల్సి ఉంటుంది. ట్యాంకు క్లీనింగ్‌ చేయడం లేదు. దీంతో ట్యాంకు అడుగున మడ్డి, ఇతర మలినాలు పేరుకుపోతాయి. డివిజన్‌లోని అన్ని గ్రామాల పంచాయితీ స్థాయిల్లో కూడా ఇదే తరహాలో నీటిలో బ్లీచింగ్‌ పౌడర్‌ కలుపుకొని సరఫరా చేస్తారు. గుండి, అంకుసాపూర్‌ మీదుగా నీటిని కాగజ్‌నగర్‌ ఓవర్‌ హెడ్‌కు సరఫరా చేస్తాం. దాని తర్వాత మున్సిపల్‌ అధికారులు ప్రక్రియ చేయాల్సి ఉంటుంది. 

ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నాం

- సీవీఎన్‌ రాజు, మున్సిపల్‌ కమిషనర్‌, కాగజ్‌నగర్‌ 

కాగజ్‌నగర్‌ పట్ణణ మంచినీటి సరఫరాలో ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా చర్యలు తీసుకుంటున్నాం. ప్రతీరోజు పర్యవేక్షణ జరుపుతున్నాం. అలాగే లీకేజీలుంటే ఎప్పటికప్పుడు చర్యలు తీసుకొని పట్టణ వాసులకు అసౌకర్యం కలుగకుండా చూస్తున్నాం. వర్షాకాలంలో మంచినీటి ట్యాంకులను శుభ్రం చేసేందుకు జాగ్రత్తలు తీసుకుంటున్నాం. ఎప్పటికప్పుడు క్లోరినేషన్‌ చేపట్టి ఎటువంటి ఇబ్బందులు రాకుండా చూస్తాం. మిషన్‌ భగీరథ, పెద్దవాగులో నీరు కలుషిత నీరు ఉన్నా లేదా దుర్వాసన వచ్చినా సరఫరా అయ్యే ముందు వెంటనే ల్యాబ్‌ పరీక్షలు జరిపిస్తాం.

Updated Date - 2022-01-24T04:33:35+05:30 IST