గుక్కెడు నీళ్లూ కరువు

ABN , First Publish Date - 2022-05-18T05:14:51+05:30 IST

రాష్ట్రంలో తాగునీటి కోసం ఎవరూ ఇబ్బంది పడొద్దన్న

గుక్కెడు నీళ్లూ కరువు
వాచ్యాతండాలో గ్రామపంచాయతీ ట్యాంకర్‌ వద్ద బారులు

  • ఆరు నెలలుగా భగీరథ నీళ్లు రాక తండ్లాట 
  • ట్యాంకర్లతో నీటి సరఫరా
  • ఎమ్మెల్యే విన్నవించినా స్పందించని వైనం
  • పట్టించుకోని అధికారులు


చౌదరిగూడ, మే 17: రాష్ట్రంలో తాగునీటి కోసం ఎవరూ ఇబ్బంది పడొద్దన్న ఉద్దేశంతో సీఎం కేసీఆర్‌ ప్రతిష్టాత్మకంగా మిషన్‌ భగీరథ పథకాన్ని ప్రారంభించారు. ఈ పథకం ద్వారా ప్రతి పల్లెకూ నీరందించేందుకు ఇంటింటికి నల్లా కనెక్షన్‌ ఇచ్చారు. కానీ అధికారుల నిర్లక్ష్యం కారణంగా మారుమూల ప్రాంతాలకు భగీరథ నీళ్లు అందడం లేదు. నేటికీ కొన్ని గ్రామాల్లో ప్రతి ఇంటికీ సరిగ్గా నల్లా కనెక్షన్లు ఇవ్వలేదు. రికార్డుల్లో మాత్రం వంద శాతం కనెక్షన్లు ఇచ్చినట్లుగా చూపిస్తున్నారు.


పరిస్థితి ఇలా..

చౌదరిగూడ మండల పరిధిలోని వాచ్యాతండా, దేవులతండా, సుబ్యాతండాలకు ఆరు నెలలుగా నీటి కోసం అల్లాడుతున్నారు. భగీరథ నీరు రాక అవస్థలు పడుతున్నారు. సర్పంచులు చొరవచూపి పంచాయతీ నీటి ట్యాంకర్‌ ద్వారా వ్యవసాయ బోర్ల నుంచి నీటిని తీసుకొచ్చి తండావాసులకు సరఫరా చేస్తున్నారు. ట్యాంకర్ల ద్వారా సరఫరా చేసే నీరు సరిపోక వారానికొకసారి స్నానం చేస్తున్నామని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తండాలో నెలకొన్న నీటి సమస్యను స్థానిక ఎమ్మెల్యే అంజయ్యయాదవ్‌ దృష్టికి తీసుకుపోయారు. ఆయన అధికారులకు ఫోన్‌చేసి నీటి సమస్యను వెంటనే పరిష్కరించాలని చెప్పినా.. ఇప్పటివరకు ఎవరూ పట్టించుకోలేదని ప్రజలు చెబుతున్నారు. అలాగే గోవులబండతండా, కాస్లాబాద్‌ గ్రామాల్లో నెలకోసారి భగీరథ నీరు వస్తాయని చెబుతున్నారు. ఆయా గ్రామాల సర్పంచులు అధికారులకు చెప్పినా పట్టించుకోకపోవడంతో ఆ గ్రామాల్లోని బోర్లలో సింగిల్‌ ఫేస్‌ మోటర్‌తో ప్రజల దాహార్తిని తీరుస్తున్నారు. మండల భగీరథ సూపర్‌వైజర్‌ మాత్రం తండాలకు నీరు అందిస్తున్నట్లు సర్పంచులతో సంతకాలు పెట్టించుకుని వెళ్తున్నారు. నీళ్లు అందించనిదే ఎందుకు సంతకాలు పెట్టాలని కొందరు సర్పంచులు నిలదీస్తే.. ప్రజాప్రతినిధుల ద్వారా బెదిరింపులకు పాల్పడుతున్నారని చెబుతున్నారు. 


వారానికొకసారి స్నానం చేస్తున్నాం

 ఆరు నెలల నుంచి మా తండాకు భగీరథ నీరు రావడం లేదు. నీళ్లు లేక వారానికి ఒకసారి స్నానం చేస్తున్నాము. మూడు రోజులకొకసారి ట్యాంకర్‌తో నీళ్ళు అందిస్తారు. వాటినే మూడు రోజులు వాడుకోవాలి. నీటి కోసం చాలా ఇబ్బందిగా ఉంది. మా సమస్యను తీర్చండి. నీళ్లు లేక కనీసం చిన్నపిల్లలకు రోజూ స్నానం చేయించలేకపోతున్నాం. 

- కె.నీలమ్మ, వాచ్యాతండా


నీళ్లకు చాలా ఇబ్బందిగా ఉంది

 మా తండాలో నీళ్ళకు చాలా ఇబ్బంది ఉంది. మా ఆడోళ్లు ట్యాంకరు వద్ద నీటి కోసం రోజూ గొడవ పడుతున్నారు. నీటి సమస్య గురించి ఎవరికి చెప్పినా పట్టించుకోవడం లేదు. వ్యవసాయ బోర్ల దగ్గర నుంచి నీళ్ళు తెచ్చుకుంటున్నాం. ఇప్పటికైనా అధికారులు పట్టించుకొని భగీరథ నీళ్ళు వచ్చేటట్లు చూడాలి.

- కిషన్‌నాయక్‌, మల్కపహాడ్‌తండా



Updated Date - 2022-05-18T05:14:51+05:30 IST