దాహం తీర్చని భగీరథ!

ABN , First Publish Date - 2022-05-12T06:26:02+05:30 IST

రాష్ట్రంలో మిషన్‌ భగీరథ పథకం ద్వారా నీళ్ల గోస తీర్చామని, నల్లాల దగ్గర బిందెలతో జనం గొడవలు పెట్టుకునే పరిస్థితి లేదని, ప్రజలకు నీటి గోస తప్పిందని చెప్పిన సీఎం కేసీఆర్‌ మాటలు నీటి మూటలుగా మారాయి. జిల్లాలో వాస్తవ పరిస్థితులు అందు కు భిన్నంగా ఉన్నాయి.

దాహం తీర్చని భగీరథ!
జిల్లా కేంద్రంలోని డైట్‌ కళాశాల సమీపంలో కనెక్షన్‌ ఇచ్చిన నీటి సరఫరా కాని భగీరథ పైపులైన్‌

జిల్లాలో అస్తవ్యస్తంగా మిషన్‌ భగీరథ పథకం నిర్వహణ తీరు

లీకేజీలు, నిర్వహణ లోపాలతో ప్రజలకు అందని తాగునీరు

పట్టణాల్లో నీటి ట్యాంకర్ల కోసం తప్పని ఎదురుచూపులు

మండు వేసవిలో గుక్కెడు నీటి కోసం జనం తండ్లాట!!

మారుమూల గ్రామాల్లోనూ నీటి గోస

ఇదే అదనుగా ఆర్‌వో వాటర్‌ ప్లాంట్‌ నిర్వాహకుల నీటి వ్యాపారం

అందిన కాడికి దండుకుంటున్న వైనం

అయినా పట్టించుకోని అధికారులు

జిల్లావ్యాప్తంగా 1,231 ఆవాసాలకు గాను 1,227 ఆవాసాల్లో పూర్తయిన      మిషన్‌ భగీరథ పనులు

ఆదిలాబాద్‌ టౌన్‌, మే 11: రాష్ట్రంలో మిషన్‌ భగీరథ పథకం ద్వారా నీళ్ల గోస తీర్చామని, నల్లాల దగ్గర బిందెలతో జనం గొడవలు పెట్టుకునే పరిస్థితి లేదని, ప్రజలకు నీటి గోస తప్పిందని చెప్పిన సీఎం కేసీఆర్‌ మాటలు నీటి మూటలుగా మారాయి. జిల్లాలో వాస్తవ పరిస్థితులు అందు కు భిన్నంగా ఉన్నాయి. తండాల నుంచి టౌన్‌ దాకా ఎన్నో చోట్ల మిషన్‌ భగీరథ నీళ్లు అందని పరిస్థితి నెలకొంది. ఒక పక్క దాహం తీరక పట్టణాల్లో జనం అల్లాడుతుండగా.. మరో పక్క పల్లెల్లో మండుటెండల్లో కిలోమీటర్ల దూరం ఖాళీ బిందెల తో వ్యవసాయ బావుల వద్దకు వెళ్తున్న తీరు పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతుంది. పట్టణంలోనైతే ట్యాంకర్లు, తాగు నీటి క్యాన్లే దిక్కవుతున్నాయి. మరికొన్ని కాలనీల్లో వారం, పది రోజులకోసారి కూడా భగీరథ నీళ్లు అందలేని పరిస్థితి నెలకొంది. ఆదిలాబాద్‌ పట్టణంలోని సంజయ్‌నగర్‌, హమాలీవాడ, కేఆర్‌కే కాలనీ, తిలక్‌నగర్‌, చిల్కూరి లక్ష్మినగర్‌, భగత్‌సింగ్‌నగర్‌, రిక్షా కాలనీ, టీచర్స్‌ కాలనీ, శాంతినగర్‌, బొక్కలగూడ, కుమ్మరి వాడ, కోలిపుర, తిర్పెల్లి వంటి అనేక వార్డులతో పాటు జిల్లాలోని ఇచ్చోడ మండల కేంద్రంతో పాటు మండలంలోని మల్యాల్‌, కామగిరి, బోరిగామ, కోకస్‌మన్నూర్‌, ముఖ్ర(బి), మం డల కేంద్రంలోని విద్యానగర్‌ కాలనీతో పాటు సిరికొండ మండలం, బజార్‌హత్నూర్‌, బోథ్‌, నేరడిగొండ, తాంసి, జైనథ్‌, ఆదిలాబాద్‌ రూర ల్‌, ఆదిలాబాద్‌ పట్టణం, తలమడుగు, భీంపూర్‌, బేల వంటి అనేక మండలాల్లో తాగునీటి సమస్యను ప్రజలు ఎదుర్కొంటున్నారు. తాగునీళ్ల కోసం జనం అనేక తిప్పలు పడుతున్నారు. ప్రభుత్వం చెప్పిన గడువుదాటి నాలుగేళ్లయినా.. మిషన్‌ భగీరథ నీళ్లు మాత్రం జిల్లాలో ఎక్కడా పూర్తి స్థాయిలో ప్రజలకు సరఫరా కావడం లేదు. ఫోర్స్‌ లేకుండా, ట్యాంకులకు సరఫరా లేక లీకేజీల వల్ల చివరిదాక వెళ్లలేని పరిస్థితి నెలకొంది.  అసలే ఎండాకాలం.. జిల్లాలోని మారుమూల గ్రామాల్లో బోర్లు, బావులు అడుగంటాయి. దీంతో జనానాకి తాగునీటి కష్టాలు తప్పడం లేదు.

వారానికోసారి నీటి తిప్పలు

రాష్ట్ర ప్రభుత్వం మిషన్‌ భగీరథ ద్వారా ప్రజలకు తాగునీటి సౌకర్యం కల్పించడంతో పాటు మినరల్‌ వాటర్‌ సరఫరా చేస్తామని చెప్పినా.. ఆ దిశగా చర్యలు మాత్రం చేపట్టడంలో పూర్తిగా విఫలమైంది. దీంతో జిల్లాలో రెండు సెగ్మెంట్లకు ఎస్‌ఆర్‌ఎస్‌పీ, కొమరంభీం ప్రాజెక్టు నుంచి భగీరథ నీరు సరఫరా చేస్తోంది. జిల్లాలో 1,231 ఆవాసాలకు గాను 1,227 ఆవాసాల్లో మిషన్‌ భగీరథ పథకం పనులను అధికారులు పూర్తి చేశారు. అయితే ఇందులో ఎస్‌ఆర్‌ఎస్‌పీ సెగ్మెంట్‌ ద్వారా 740, ఒక ఆదిలాబాద్‌ మున్సిపాలిటీ, కొమరంభీం సెగ్మెంట్‌ ద్వారా 487 ఆవాసాలకు నీరు అందిస్తున్నారు. అయితే ఇందులో జిల్లా వ్యాప్తంగా  18 మండలాలకు గానూ 10 మండలాలకు పూర్తిస్థాయిలో నీరు అందని పరిస్థితి నెలకొంది. జిల్లాలోని ఆసిఫాబాద్‌, ఖానాపూర్‌, ఆదిలాబాద్‌ నియోజకవర్గ పరిధిలోని నార్నూర్‌, గాదిగూడ, ఉట్నూర్‌, ఇంద్రవెల్లి ప్రాంతాల్లో ఇప్పటికీ ప్రజలకు మిషన్‌ భగీరథ నీరు అందడం లేదు. ఇదిలా ఉంటే చాలా చోట్ల పైపులైన్‌ లీకేజీ సమస్యలు వెక్కిరిస్తున్నాయి. ఏజెన్సీలో పైపులైన్‌ వేసినప్పటికీ అన్నిచోట్ల తాగునీరు అందని పరస్థితి నెలకంది. అలాగే, జిల్లాలోని ఆయా గ్రామాలతో ఆటు జిల్లాకేంద్రంలోని 49 వార్డుల్లో పూర్తిస్థాయిలో ప్రజలకు మిషన్‌ భగీరథ ద్వారా తాగు నీరు అందడం లేదు. అంతేకాకుండా ఇచ్చోడలో విద్యానగర్‌ కాలనీ లో ఏడాది క్రితం పైపులు వేసినప్పటికీ.. నేటికీ తాగునీటి సరఫరా కరువైంది.  

వాటర్‌ క్యాన్‌ కొనుక్కోవాల్సిందే..

జిల్లాలోని ఆయా మండలాల ప్రజలు తాగునీటి కోసం ఇప్పటికీ వాటర్‌ క్యాన్‌లనే ఆశ్రయించాల్సి వస్తుంది. పలుచోట్ల ఇంకా తాగునీటి పైపులైన్లు తరచూ లీకేజీ కావడంతో నీరు కలుషితం అవుతోంది. దీంతో వారాలు, నెలల తరబడి మరమ్మతులు చేపట్టకపోవడంతో రంగుమారిన నీళ్లు సరఫరా అవుతున్నాయి. దీంతో ప్రజలు గ్రామాల్లో అయితే 20లీటర్ల వాటర్‌ క్యాన్‌కు రూ.20, పట్టణాల్లో అయితే రూ.10 పెట్టి కొనుక్కొని నీటి తాగుతున్నారు. జిల్లాలోని బోథ్‌, ఆదిలాబాద్‌ నియోజకవర్గాల్లో వాటర్‌ సప్లయ్‌ చేసే మెయిన్‌ పైపులైన్లకు లీకేజీలు, మరమ్మతులు ఏర్పడుతున్నాయి. దీంతో జిల్లాలోని 18 మండలాలకు గాను 12 మండలాలకు సరైన తాగునీరు మిషన్‌ భగీరథ ద్వారా అందడం లేదు. పైగా  బురద నీరు సంపులోకి చేరుతున్నా.. అలాగే నీటిని సరఫరా చేస్తున్నారు. ఈ నీరు తాగలేకనే ప్రజలు ఆర్‌ఓ ప్లాంట్ల నుంచి క్యాన్‌ వాటర్‌ తెచ్చుకుంటున్నారు. 

అందినకాడికి దండుకుంటున్నారు..

ఇదే అదునుగా వాటర్‌ ప్లాంట్ల యజమానులు అందిన కాడికి దండుకుంటున్నారు. ఇష్టారీతిన ధరలు పెంచుతూ సామాన్యుల జేబులకు చిల్లులు పెడుతున్నారు. జిల్లాలోని సుమారు మూడు లక్షకు పైగా జనాభా, పట్టణంలోని లక్షకు పైగా ప్రజలు ప్రైవేట్‌ వాటర్‌ ప్లాంట్ల నుంచి తాగునీటి క్యాన్లను తెచ్చుకుంటున్నారు. దీంతో పట్టణంలో 150కి పైగా ప్రైవేట్‌ వాటర్‌ ప్లాంట్లు, మినరల్‌ వాటర్‌ క్యాన్లు సప్లయి చేసే ప్లాట్లు ఇబ్బడిముబ్బడిగా ఏర్పడ్డాయి. నీటి వ్యాపారం పేరిట సామన్య ప్రజల నుంచి వేల రూపాయలు వెనకేసుకుంటున్నారు. ప్రస్తుతం జిల్లాలో వాటర్‌ ప్లాంట్ల వ్యాపారం జోరుగా సాగుతోంది. గ్రామాల్లో అయితే రెండు నుంచి ఐదు వరకు, మున్సిపాలిటీ పరిధిల్లో పది నుంచి 50 వరకు వాటర్‌ ప్లాంట్లు కొనసాగుతున్నాయి. మారుమూల పంచాయతీల పరిధిలో నెలకొల్పిన ప్లాంట్లు వీటికి అదనం. జిల్లాలోని మేజర్‌ గ్రామ పంచాయతీలైన మావల మండలంతో పాటు తలమడుగు, బోథ్‌, ఇచ్చోడ, బజార్‌హత్నూర్‌, బేల, తాంసి, నేరడిగొండ వంటి మండలాల్లో అనేక వాటర్‌ ప్లాంట్లు ఇబ్బడిముబ్బడిగా ఉన్నాయి. అత్యంత వెనుకబడిన ఏజెన్సీ ప్రాంతాల్లోనూ ఈ ఆర్‌ఓ ప్లాంట్ల వ్యాపారం కొనసాగడం గమనార్హం.

పూర్తిస్థాయిలో అందని తాగునీరు

జిల్లాలో 1,231 ఆవాసాలలో ప్రజలరే మిషన్‌ భగీరథ తాగునీరు పూర్తిస్థాయి లో సరఫరా కావడం లేదు. దీంతో ఆర్‌వో ప్లాంట్లను ఆశ్రయించాల్సిన పరిస్థితి నెలకొంది. ప్రస్తుం లీకేజీల ద్వారా కలుషిత నీరు సరఫరా కావడంతో జనం మిషన్‌ భగీరథ వాటర్‌ తాగలేని పరిస్థితి ఉంది. జిల్లా కేంద్రంలో కలెక్టర్‌ కార్యాలయం ఎదుట, జిల్లా పరిషత్‌, విద్యానగర్‌, భుక్తాపూర్‌, ద్వారకనగర్‌, అంబేడ్కర్‌చౌక్‌, శివాజీచౌక్‌ ఇలా అనేక కాలనీల్లో మెయిన్‌ పైపులైన్ల నుంచి కనెక్షన్లు ఇచ్చిన క్రమంలో పెద్దఎత్తున లీకేజీల ద్వారా నీరు వృథాగా పోతోంది. పైగా పాత ట్యాంకుల ద్వారా కలుషిత నీరే సరఫరా అవుతోంది. 

నిండుగా అధికారుల నిర్లక్ష్యం

అధికారుల నిర్లక్ష్యం తోడవడంతో జిల్లా కేంద్రంలోని డైట్‌ కళాశాల మైదానం లో సంవత్సరం క్రితం మిషన్‌ భగీరథ పైపులైన్‌కు కనెక్షన్‌ ఇచ్చినా నేటికీ వినాయక్‌చౌక్‌ ప్రాంతం వైపు పైపులైన్‌ వేసి ఉన్నా.. తాగునీరు సరఫరా కావడం లేదని స్థానిక ప్రజలు ఆరోపిస్తున్నారు. మిషన్‌ భగీరథ పథకానికి వేల కోట్లు వెచ్చించినా.. జిల్లాలో తాగునీటి సమస్యల ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా మారింది. ఇప్పటికైనా జిల్లా యంత్రాంగం స్పందించి   మిషన్‌ భగీరథ పైపులైన్‌లను పూర్తి చేయాలని, కలుషితం లేని తాగునీటిని సరఫరా చేయాలని అంటున్నారు. కాగా, ఈ విషయమై సంబంధిత మిషన్‌ భగీరథ అధికారులను ఫోన్‌ ద్వారా సప్రందించగా అందుబాటులో లేకపోవడం గమనార్హం.

పైప్‌లైన్ల ద్వారా వచ్చే బురదనీరు తాగలేక పోతున్నాం

: పతిహార రమేష్‌, బాధితుడు భీంసారి 

రాష్ట్ర ప్రభుత్వం గత నాలుగేళ్ల క్రితం మిషన్‌ భగీరథ పథకాన్ని ప్రారంభించింది. దీని ద్వారా ప్రజలకు తాగునీటి సమస్యను దూరం చేస్తామని, మినరల్‌ వాటర్‌ సరఫరా చేస్తామని హామీ ఇచ్చింది. కాని నేటికీ ఆదిలాబాద్‌లో ఏ ఒక్కరికీ కూడా పూర్తిస్థాయిలో కలుషితం లేని తాగునీరు అందిన దాఖలాలు లేవు. పైప్‌లైన్ల ద్వారా వస్తున్న బురదనీటిని తాగలేకపోతున్నాం. వేల కోట్లు ఖర్చు పెట్టిన రాష్ట్ర ప్రభుత్వం, కనీసం ఈ వేసవిలోనైనా ప్రజలకు తాగునీటి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోవాలి. 

Read more