గిరిజనుల గొంతు తడపని మిషన్‌ భగీరథ

ABN , First Publish Date - 2021-05-06T04:11:55+05:30 IST

గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి పటిష్ఠ చర్యలు తీసు కుంటున్నట్లు ప్రభుత్వం చెబుతున్నా నేటికీ కొన్నిగ్రామాల్లో పరిస్థితి దయనీ యంగానే ఉంది.

గిరిజనుల గొంతు తడపని మిషన్‌ భగీరథ

- తాగునీటి కోసం గిరిజనుల పాట్లు

- పట్టించుకోని అధికారులు 

- మండల సమావేశాల్లో హామిలకే పరిమితమవుతున్న అధికారులు

కెరమెరి/తిర్యాణి, మే 5: గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి పటిష్ఠ చర్యలు తీసు కుంటున్నట్లు ప్రభుత్వం చెబుతున్నా నేటికీ కొన్నిగ్రామాల్లో పరిస్థితి దయనీ యంగానే ఉంది. కెరమెరి, తిర్యాణి మండలాల్లో పలు గ్రామాల్లో వేసవికి మొదలే తాగునీటి కష్టాలు మొదలయ్యాయి. దీంతో పది కిలోమీటర్ల దూరంలో ఎత్తున కొండలపై ఉన్న కెరమెరి మండలంలోని పర్సువాడతో పాటు తిర్యాణి మండలంలోని గోపెర, గోవేన, తొక్కిగూడ, పంగిడి మాదార, మోర్రిగూడ, గీసిగూడ, కెరెగూడ, గుడిపేట్‌ తదితర గ్రామాల్లో రోజురోజుకు పెరుగుతున్న ఎండలకు తాగునీటి కష్టాలు మొదలయ్యాయి. అధికారుల అలసత్వం, పాలకుల పట్టింపులేని తనం కారణంగా నేటికీ ఆ గ్రామాల ప్రజలు తాగునీటి కోసం అష్టకష్టాలు పడుతున్నారు. ప్రభుత్వాలు మారినా పాలకులు మారినా తమ కష్టాలు మాత్రం తీరడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

కెరమెరి మండలంలో..

మండలంలోని కేలి(బి) గ్రామ పంచాయతీ పరిధిలోని పర్సువాడ గ్రామంలో 20 కుటుంబాలు ఉండగా పిల్లా పాపలతో కలిపి సుమారు 200మంది నివసిస్తున్నారు. ఈ గ్రామానికి చేరుకోవాలంటే ఎత్తైన మూడు గుట్టలు ఎక్కాల్సిందే. గ్రామం ఏర్పడి దాదాపు 50ఏళ్లు దాటినా కనీస సౌకర్యాలు లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. గ్రామంలోని ప్రజలు వ్యవసాయంపైనే ఆధారపడి జీవిస్తున్నారు. పూర్తిగా వర్షాధారిత పంటలు పండిస్తూ జీవనం కొనసాగిస్తున్నారు. గతంలో 30పైగా కుటుంబాలతో కళకళలాడుతుండేది. మౌలిక సదుపాయాలు ముఖ్యంగా వేసవిలో తాగునీటి కష్టాలు పడలేక పలు కుటుంబాలు ఇతరప్రాంతాలకు వలస పోయాయి. గత్యంతరం లేక మిగితా కుటుంబాలు సమస్యల నడుమ సహవాసం చేస్తూ జీవనం కొనసాగిస్తున్నాయి. 

పురాతన బావి నీరే ఆధారం..

50ఏళ్ల క్రితం గ్రామంలో ప్రజలు తవ్వుకున్న పురాతన బావి నీరే తాగునీటికి ఆధారం. వర్షాకాలం మొదలు జనవరి వరకు బావిలో నీరు సంవృద్ధిగా ఉంటుంది. వేసవి ప్రారంభం అయిందంటే బావిలో నీరు అడుగంటి పోతుంది. ఉష్ణోగ్రతలు పెరుగుతున్న కొద్ది నీరు పూర్తిగా అడుగంటి పోతుంది. అప్పటి నుంచి గ్రామస్థులకు అవస్థలు మొదలవుతాయి. బిందెడు నీటి కోసం బావి దగ్గర బారులు తీరాల్సి వస్తుందని గ్రామస్థులు పేర్కొంటున్నారు. ఉదయం 4నుంచి తాగునీటి కోసం పడిగాపులు కాస్తారు. బిందెడు నీటి కోసం గంటల తరబడి వేచి చూడాల్సిన పరిస్థితి ఉంటోందని గ్రామస్థులు వాపోతున్నారు. గ్రామంలో పెళ్లిళ్లు, శుభకార్యాలకు తాగునీటి కోసం పడరాని పట్లు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

మిషన్‌ భగీరథ నీళ్లు ఎప్పుడొస్తాయో..

కేలి(బి) నుంచి పర్సువాడకు గతేడాది పైపులైన్‌ నిర్మించారు. ఇంటింటికి నల్లాలు సైతం బిగించారు. గ్రామంలో ఓ మూలన మంచినీటి ట్యాంక్‌ నిర్మించారు. పనులు పూర్తై ఏడాది గడస్తున్నా నేటికీ మంచినీటి ట్యాంకుకు కనెక్షన్‌ ఇవ్వకపోవడంతో మిషన్‌ భగీరథ నీళ్లకు గ్రామస్థులు నోచుకోవడం లేదు. మూడు నెలలకోసారి జరిగే మండల సర్వసభ్య సమావేశంలో మారుమూల గ్రామాలకు తాగునీటిని అంది స్తామని అధికారులు కాగితాలపై లెక్కలు చూపుతూ చేతులు దులుపుకుంటున్నారే తప్ప నీటిని మాత్రం అందించిన దాఖలాలు లేవు. గతనెలలో సైతం ఆర్‌డబ్ల్యూఎస్‌ అధికారులు ఏప్రిల్‌ రెండో వారంలో అన్ని గ్రామాలకు తాగునీటిని అందిస్తామని హామీ ఇచ్చారు. అయినా నేటికీ ఆ దిశగా చర్యలు చేపట్టలేదు. తాగునీటిని అందించే విషయంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని గ్రామస్థులు వాపోతున్నారు. 

తిర్యాణి మండలంలో..

తిర్యాణి మండలంలోని గోవేన, గోపేర, తొక్కిగూడ, పంగిడి మాదర, మొర్రిగూడ, గీసిగూడ, కేరెగూడ, గుడిపేట్‌ తదితర గిరిజన గ్రామాల్లో రోజురోజుకు పెరుగుతున్న ఎండలకు తాగునీటి కష్టాలు మొదలయ్యాయి. వేసవిలో ఆయా గ్రామాల్లో ప్రత్యేక అధికారులు పర్యటించాల్సి ఉంది. కానీ అలా జరగడం లేదు. సంబంధిత అధికారులు వారి గోడును పట్టించుకోవడం లేదని ఆరోపణలు ఉన్నాయి. అధికారులకు ఎన్ని సార్లు చెప్పినా ఫలితం లేదని ఆయా గ్రామాల గిరిజనులు వాపోతున్నారు. ఇటీవల ఎండలు పెరుగుతుండడంతో భూగర్భ జలాలు అడుగంటి పోతున్నాయి. దీనికితోడు మూగజీవాలకు తాగడానికి గుక్కెడు నీళ్లు దొరకడం లేదు. కోసుల దూరంలో ఉన్న చిన్నచిన్న మడగులు, చెలిమెలు దాహార్తిని తీరుస్తున్నాయి. ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన మిషన్‌ భగీరథ నీళ్లు ఆయా గ్రామాలలో అందడం లేదు. ఎప్పుడు వస్తుందో ఎప్పుడు ఇస్తారో అధికారులకే తెలియాలి. మండల సమావేశాలలో తాగునీటి ఇబ్బందులు పరిష్కరిస్తామని అధికారులు, ప్రజాప్రతినిధులు చెప్పడమే తప్ప దాహార్తిని తీర్చే నాథుడు కరువయ్యాడని గిరిజనులు అంటున్నారు. సమస్యలను పరిష్కరించి దాహార్తిని తీర్చాలని గిరిజనులు కోరుతున్నారు. 


తాగునీటికి శాశ్వత పరిష్కారం చూపాలి..

- దరావత్‌ శానుబాయి, పర్సవాడ, కెరమెరి

ఏళ్లుగా తాగునీటికి ఇబ్బందులు పడుతున్నాం. దశాబ్దాలుగా బావినీరే తాగుతున్నాం. స్వచ్ఛమైన తాగునీటిని ఎరుగని మేము వేసవిలో తాగునీటికి ఇబ్బందులు పడుతున్నాం. వేసవిలో మూడు నెలలు బావిలో నీరు పూర్తిగా అడుగంటి పోతుంది. దీంతో కిలోమీటర్‌ దూరం నుంచి నీళ్లు తెచ్చుకుంటున్నాం. మంచినీటి సమస్యను పరిష్కరించేందుకు అధికారులు శాశ్వత చర్యలు చేపట్టాలి.

మంచినీళ్లకు తక్లీబ్‌ అవుతోంది..

- సిడాం బాలు, గోపెర, తిర్యాణి

మా ఊర్లలో మంచినీటికి తక్లీబ్‌ అవుతోంది. 16కుటుంబాలు నివాసం ఉంటున్నాం. ఎండకాలం తాగునీటికి ఇబ్బందులు పడుతున్నాం. బావినీరు తాగు తున్నాం. అసలే కరోనా టైం తాగునీరు అందేలా చూడాలి. మిషన్‌ భగీరథ ట్యాంకు నిర్మించి సంవత్సరం అయితంది. ఇప్పటికీ నీళ్లు అందుతలేవు. ఆఫీసర్లు, లీడర్లకు తెలిపినా పట్టించుకోవడం లేదు. 

Updated Date - 2021-05-06T04:11:55+05:30 IST