Abn logo
Jun 11 2021 @ 00:16AM

భగ్గుమన్న బడుగులు..!

బుగ్గవంక నిర్వాసితులకు న్యాయం చేయాలంటూ కలెక్టరేట్‌ ఎదుట బైఠాయించిన బాధితులు, అఖిలపక్ష నేతలు

ఆధునికీకణ పేరుతో కూల్చేస్తున్న పేదల గూళ్లు

పట్టా, ఇల్లు మంజూరు చేసి పొమ్మన్నారు

కరోనా కాలంలో ఎక్కడ తలదాచుకోవాలి

అడ్డుగా ఉన్న ప్రైవేటు భవనాల జోలికి వెళ్లరు

గళమెత్తిన బుగ్గవంక బాధితులు

కలెక్టరేట్‌ ముట్టడికి యత్నం.. అడ్డుకున్న పోలీసులు


వారంతా పేదలు.. ముప్పైనలభై ఏళ్లగా బుగ్గవంక ఒడ్డున నివాసాలు ఏర్పాటు చేసుకొని జీవనం సాగిస్తున్నారు. ఇప్పుడు ఆధునికీకరణ పేరుతో వారి ఇళ్లు కూలేస్తున్నారు. ఎక్కడికెళ్లాలయ్యా..! అంటే ఇంటి పట్టా, పక్కా ఇల్లు మంజూరు చేశాం వెళ్లిపోండి..! అంటున్నారు. కడపు మండిన బడుగులు జీవులు భగ్గుమన్నారు. న్యాయం చేయాలని గళమెత్తారు. కలెక్టరేట్‌ ముట్టడికి యత్నించారు. పోలీసులు అడ్డుకొని తోసేశారు. ఓ ప్రజాప్రతినిధి సినిమా థియేటర్‌తో పాటు 172 ప్రైవేటు భవనాలు కూడా కూల్చేయాల్సి ఉంది. భూ సేకరణ చట్టం ప్రకారం పరిహారం ఇచ్చాకే వాటిని తొలగిస్తామని అధికారులు అంటున్నారు. బడుగుజీవులకు మాత్రం ప్రత్యామ్నాయం చూసుకునేంత వరకు ఏ అవకాశం ఇవ్వలేదు. ఇది ప్రభుత్వ స్థలం.. తొలగిస్తాం అన్నట్లు కూల్చేయడం విమర్శలకు తావిస్తోంది. అధికారుల తీరుపై బాధితులకు న్యాయం చేయాలంటూ అఖిలపక్ష పార్టీలు ఆధ్వర్యంలో గురువారం కలెక్టరేట్‌ వద్ద ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా బుగ్గవంక ఆధునికీకరణ తాజా పరిస్థితిపై ప్రత్యేక కథనం. 


(కడప-ఆంధ్రజ్యోతి): కడప నగరం నడిబొడ్డున బుగ్గవంక ప్రవహిస్తుంది. ఏటా వరద ముప్పు పొంచి ఉంది. 2001లో భారీ వరదలకు రూ.కోట్ల ఆస్తి నష్టం.. 30 మందికిపైగా మృత్యువాత పడ్డారని ఇంజనీర్లు తెలిపారు. 2004-05లో నాటి ప్రభుత్వం రూ.96 కోట్లతో బుగ్గవంక ఆధునికీకరణ చేపట్టింది. రాజకీయ నేతల ఒత్తిళ్లు, అడ్డంకులతో నాడు అసంపూర్తిగా పనులు ఆగిపోయాయి. 8 కి.మీలు ప్రొటెక్షన్‌ వాల్స్‌ (రక్షణ గోడలు) నిర్మాణానికి గానూ 6.8 కి.మీలు నిర్మించారు. బడాబాబులు, రాజకీయ నేతల భవనాలు జోలికి వెళ్లకుండా మధ్యలో ఆపేశారు. ఫలితంగా రూ.12 కోట్ల నిధులున్నా 15 ఏళ్లుగా ఆధునికీకరణ పనులు చేపట్టలేదు. గత ఏడాది నవంబరు నెలలో నివార్‌ తుఫాన్‌ వల్ల భారీ వర్షాలకు బుగ్గవంక ఉప్పొంగడంతో పలు కాలనీలు ముంపునకు గురయ్యాయి. దీంతో అసంపూర్తిగా వదిలేసిన రక్షణ గోడ, వంక రెండు వైపుల 40 అడుగుల వెడల్పుతో రోడ్డు నిర్మాణానికి ప్రతిపాదనలు పంపారు. బ్యాలెన్స్‌ నిధులు రూ.12 కోట్లతో పనులు చేపట్టాలంటూ ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలతో పనులు చేపట్టారు. బుగ్గవంక ఆధునికీకరణకు ఎవరూ వ్యతిరేకం కాదు. అయితే.. ఎన్నో ఏళ్లుగా అక్కడే ఉంటున్న పేదలకు నివాస సౌకర్యం కల్పించకుండా.. కట్టడాలకు కనీస పరిహారం ఇవ్వకుండా కూల్చివేత చేపట్టడం విమర్శలకు తావిస్తోంది.


పెద్దలకు ఓ న్యాయం.. పేదలకు మరో న్యాయమా..?

బుగ్గవంక ఆధునికీకరణ పనులను ఇరిగేషన్‌ అధికారులు పర్యవేక్షిస్తున్నారు. అసంపూర్తి 1.2 కి.మీల ప్రొటెక్షన్‌ వాల్స్‌, రైల్వే బ్రిడ్జి నుంచి అల్మాస్‌ పేట వరకు వంక ఇరువైపుల 40 అడుగుల వెడల్పుతో తారు రోడ్డు నిర్మాణం.. తదితర పనులు, భూ సేకరణ (ఎల్‌ఏ) కోసం రూ.50 కోట్ల నిధులు కావాలని ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. అక్రమ కట్టడాలుగా రెవిన్యూ, ఇరిగేషన్‌ అధికారులు గుర్తించిన 144 నిరుపేదల ఇళ్లతో పాటుగా నాగరాజుపేట, రవీంద్రనగర్‌ వంటి కాలనీలలో 172 ప్రైవేటు భవనాలు తొలగించాల్సి ఉంది. ఈ ప్రైవేటు భవనాల్లో ఓ ప్రజాప్రతినిధికి చెందిన సినిమా థియేటర్‌ కూడా ఉంది. రక్షణ గోడ నుంచి 40 అడుగుల రోడ్డు వేయాలంటే ఆ సినిమా థియేటర్‌కు 15-20 అడుగుల వరకు కూల్చేయాల్సి వస్తుందని రెవిన్యూ అధికారులు పేర్కొంటున్నారు. భూ సేకరణ (ఎల్‌ఏ) చట్టం కింద పరిహారం చెల్లించిన తరువాతే ప్రైవేటు భవనాలు కూల్చేస్తామని అంటున్నారు. అప్పటిదాకా వాటి జోలికి వెళ్లమంటున్నారు. ప్రభుత్వం నుంచి నిధులు కూడా రాలేదు. అంటే ఇప్పట్లో వాటిని కూల్చివేసే పరిస్థితి లేదు.


కరోనా సమయంలో ఎక్కడ తలదాచుకోవాలి..?

ఎల్‌ఏ పేరుతో బడాబాబులు, రాజకీయ నేతలకు వెసులుబాటు కల్పించిన అధికారులు పేదలకు మాత్రం ఓ అవకాశం ఇవ్వలేదు. అక్రమకట్టడాలుగా చెప్పే పేదలకు పక్కా ఇల్లు ప్రభుత్వమే కట్టించి ఇచ్చాక ఖాళీ చేయించి ఉంటే కొంతైనా ఊరట కలిగేది. ప్రభుత్వ స్థలంలో అక్రమంగా కట్టుకున్నారంటూ కనీస పరిహారం కూడా ఇవ్వకుండా.. పట్టా, ఇల్లు మంజూరు చేశాం..! మీ బాధలు మీరు పడండని నివాసాలు ఉన్న ఇళ్లను కూల్చేశారు. కరోనా సమయంలో బంధువులు కూడా చేరదీయడం లేదు.. ఇల్లు అద్దెకు దొరకడం లేదు.. ఇల్లు దొరికినా బతకడమే భారమై ఇంటి అద్దె కట్టలేని స్థితిలో ఉన్నామంటూ రోడ్డున పడ్డ బాధితులు గోడుగోడు మంటున్నారు. పెద్దలకు ఓ న్యాయం.. పేదలకు మరో న్యాయమా..? అంటూ ప్రశ్నిస్తున్నారు.


న్యాయం జరిగేనా..?

ఇళ్లు కోల్పోయిన బుగ్గవంక నిర్వాసితులకు కనీస పరిహారం ఇవ్వాలని, పట్టాతో పాటు ప్రభుత్వమే ఇల్లు కట్టించి ఇవ్వాలని, మానవతాదృక్పథంతో ఆదుకోవాని కోరుతూ టీడీపీ, సీపీఐ, సీపీఎం, కాంగ్రెస్‌ తదితర అఖిలపక్ష నేతల అండతో గురువారం కలెక్టరేట్‌ వద్ద ఆందోళనకు దిగారు. మూడు నాలుగు దశాబ్దాలుగా నివాసం ఉన్న ఇల్లు కూల్చేయడంతో కడుపు మండిన పేదజీవులు కలెక్టరేట్‌ ముట్టడికి యత్నించారు. పోలీసులు అడ్డుకొని తోసేశారు. పేదల ఆక్రందన ప్రభుత్వ పెద్దలు, జిల్లా యంత్రాంగానికి వినిపిస్తుందా..? వారికి న్యాయం జరుగుతుందా..? వేచి చూడాల్సిందే.


ప్రైవేటు భవనాలు ఎల్‌ఏ కింద తీసుకుంటాం

- శివరామిరెడ్డి, తహశీల్దారు, కడప

బుగ్గవంక ఆధునికీకరణలో భాగంగా రక్షణ గోడ, 40 అడుగుల రోడ్డు నిర్మాణానికి నాగరాజుపేట, రవీంద్రనగర్‌ తదితర కాలనీల్లో 172 ప్రైవేటు భవనాలు భూ సేకరణ (ఎల్‌ఏ) చట్టం కింద సేకరించాల్సి ఉంది. అందులో ఓ ఎమ్మెల్యేకి చెందిన సినిమా థియేటర్‌ 15-20 అడుగుల వరకు భూ సేకరణ చేయాల్సి ఉంది. ప్రభుత్వానికి రూ.50 కోట్లతో ప్రతిపాదన పంపాం. నిఽధులు రాగానే ఎల్‌ఏ కింద పరిహారం చెల్లించి ప్రైవేటు భవనాలు సేకరించి కూల్చేవేసే పనులు చేపడతాం. ప్రభుత్వం స్థలం అక్రమించుకొని నిర్మించుకున్న అక్రమ కట్టడాలను తొలివిడతలో కూలుస్తున్నాం. బాధతులకు ఇంటి పట్టాతో పాటుగా పక్కా ఇల్లు కూడా మంజూరు చేశాం.

 

కలెక్టరేట్‌లోనికి వెళ్లనివ్వకుండా బుగ్గవంక నిర్వాసితులను అడ్డుకుంటున్న పోలీసులు