భగత్‌సింగ్ ఉరి గాంధీపై నింద

ABN , First Publish Date - 2022-03-23T06:09:32+05:30 IST

సత్యం, అహింసలకు గాంధీజీ కట్టుబడి ఉంటే, సర్దార్‌ భగత్‌సింగ్‌ తాను ప్రగాఢంగా విశ్వసించిన సిద్ధాంతానికి కట్టుబడి ఉన్నారని, అందువలన ఇరువురూ సుప్రసిద్ధులుగా సమాన ప్రఖ్యాతి పొందారని భారత జాతీయ కాంగ్రెస్ చరిత్రకారుడు డాక్టర్ భోగరాజు...

భగత్‌సింగ్ ఉరి గాంధీపై నింద

సత్యం, అహింసలకు గాంధీజీ కట్టుబడి ఉంటే, సర్దార్‌ భగత్‌సింగ్‌ తాను ప్రగాఢంగా విశ్వసించిన సిద్ధాంతానికి కట్టుబడి ఉన్నారని, అందువలన ఇరువురూ సుప్రసిద్ధులుగా సమాన ప్రఖ్యాతి పొందారని భారత జాతీయ కాంగ్రెస్ చరిత్రకారుడు డాక్టర్ భోగరాజు పట్టాభి సీతారామయ్య పేర్కొన్నారు. ‘తన అహింసా సిద్ధాంతాన్ని వ్యతిరేకించిన విప్లవకారుల నుంచి గుర్తింపు పొందడానికి గాంధీజీ అనుకూలంగా లేరని స్పష్టమయింది. అయితే భగత్‌సింగ్, ఆయన సహచరులను ఉరితీయాలనేది ఆయన అభిమతం కాదు. వారికి విధించిన మరణదండనను, యావజ్జీవ శిక్షగా మార్చేందుకు తాను చొరవ తీసుకోలేదని ప్రజలు నమ్మటం, ఆయనకు వేదన కలిగించిందని’ ప్రముఖ పాత్రికేయుడు కుల్దీప్ నయ్యర్ తన ‘వితౌట్‌ ఫియర్‌: ది లైఫ్ అండ్ ట్రయల్ ఆఫ్ భగత్‌సింగ్’లో అన్నారు.


1931 ఫిబ్రవరి 18 నుంచి మార్చి 5వ తేది వరకు వైస్రాయ్‌ లార్డ్‌ ఇర్విన్‌తో గాంధీజీ చర్చల ఫలితంగా గాంధీ – ఇర్విన్‌ ఒప్పందం ఖరారైంది. ఆ ఒప్పందంతో సంబంధం లేని అంశం అయినా గాంధీజీ వైస్రాయ్‌ను ఒప్పించి, భగత్‌సింగ్‌కు ఉరిశిక్ష తప్పించగలరని యావద్భారతీయులు ఆశించారు. భగత్‌సింగ్‌, రాజ్‌గురు, సుఖదేవ్‌లను గాంధీజీ తన పలుకుబడితో కాపాడగలరని కాంగ్రెస్ నాయకశ్రేణి విశ్వసించింది. గాంధీ గట్టిగా పట్టుబట్టి ఆ జాతీయ యువ యోధులకు ఉరి తప్పించగలరని వేయి కళ్లతో ఎదురుచూసారు. కోట్లాది భారతీయులు ఏదైతే జరగకూడదనుకున్నారో 1931 మార్చి 23న అదే సంభవించింది. బ్రిటిష్‌ ప్రభుత్వం ఆ యువ కిశోరాలకు ఉరిశిక్ష అమలుపరిచింది. భారతీయులు దిగ్భ్రాంతి చెందారు. విషాదభరితులయ్యారు. గాంధీజీ నాయకత్వం నిస్సహాయంగా విప్లవ యోధుల ఉరితీతకు కారణమయిందనే నిరసన భావన సర్వత్రా వ్యాపించింది. మహాత్ముడు కళంకం, నింద భరించక తప్పలేదు.


విప్లవ యోధుల దేశభక్తి త్యాగనిరతి, ధైర్యసాహసాలను, ఉన్నత లక్ష్యాలను గాంధీజీ ప్రశంసించారే తప్ప ఎన్నడూ సాయుధ పోరాటాన్ని సమర్థించలేదు. వెన్ను తట్టి ప్రోత్సహించలేదు. మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు రగిలించిన సాయుధ పోరాట సమరాగ్ని రోజులలో (1923 డిసెంబరు) కాకినాడలో భారత జాతీయ కాంగ్రెస్‌ మహాసభలు జరిగాయి. కాంగ్రెస్‌ నాయకులు అహింసా సిద్ధాంత భీష్మ పాషండులుగా గాంధేయ సిద్ధాంతాన్ని పట్టుకు వేళ్లాడారు తప్ప శ్రీరామరాజుకు కనీస ప్రోత్సాహం అందించలేదు. 1931 మార్చి 23న అఖిల భారత జాతీయ కాంగ్రెస్‌ కరాచీ సమావేశ వేదికపై ఉన్న నాయకులకు, లాహోర్ జైలులో భగత్‌సింగ్, రాజ్‌గురు, సుఖదేవ్‌లను ఉరితీశారన్న వార్త అందింది. అందరూ ఖిన్నులయ్యారు. గాంధీజీ అహింసాత్మక పోరాటాన్ని తట్టుకోవచ్చు గానీ, భగత్‌సింగ్‌ పోరాటం తమను తుదిముట్టించే విప్లవాగ్ని అని, దాన్ని చల్లార్చటం అసాధ్యమని బ్రిటిష్ వలసపాలకులు అర్థం చేసుకున్నారని, అందుకే ఆ ముగ్గురు యువ యోధులకు ఉరిశిక్ష అమలు చేశారని జర్నలిస్ట్ కుల్దీప్ నయ్యర్ విశ్లేషించారు. 


‘దేశభక్తులకు అత్యంత ఉన్నతమైన అవార్డు, మాతృభూమి కోసం స్వచ్ఛందంగా మరణించడం. నేను ఈ అవార్డు పొందడానికి గర్విస్తున్నాను. బ్రిటీష్‌ ప్రభుత్వం నన్ను చంపినా నా అభిప్రాయాలను చంపలేదు. వాళ్లు నా శరీరాన్ని అణగదొక్కినా నా ఆత్మశక్తిని అణచలేరు. ఈ దేశం నుంచి పారిపోయే వరకు, శాపంలా నా ఆలోచనలు వారిని వెంటాడుతూనే ఉంటాయి. నన్ను బంధించి సజీవంగా ఉంచటం కంటే నేను మృతుడిని కావటం వారికి మరింత ప్రమాదం అవుతుంది. నన్ను ఉరి తీసిన తరువాత విప్లవ భావ సుగంధం మాతృభూమి అంతా వ్యాపించి యువత విప్లవ సంకల్ప శక్తి అయి బ్రిటీష్‌ సామ్రాజ్యవాదులను తరిమిగొడుతుంది. ఇది నా దృఢ విశ్వాసం. ఉరికంబంపై మరణం ‘బ్యూటిఫుల్‌ డెత్‌’గా భావిస్తున్నాను. అటువంటి మరణాన్ని స్వచ్ఛంధంగా ఆహ్వానిస్తున్నానని’ ఒక సహచరుడికి రాసిన లేఖలో సర్దార్ భగత్‌సింగ్ పేర్కొన్నారు. అమర్‌ షహీద్‌గా సర్దార్ భగత్‌సింగ్ చిరస్మరణీయులు. బ్రిటీష్‌ పోలీస్‌ అధికారి సాండర్స్‌ హత్య కేసులో 1928 డిసెంబర్‌ 17న, అనార్కలి బజార్ పోలీస్‌ స్టేషన్‌లో దాఖలయిన ఉర్దూ ఎఫ్‌ఐఆర్‌లో అసలు భగత్‌సింగ్‌ పేరు లేదనే, చారిత్రక వాస్తవాన్ని లాహోర్‌లోని ‘భగత్‌సింగ్ స్మారక సంస్థ’ అధ్యక్షుడు ఇంతియాజ్ రషీద్ ఖురేషి ఇటీవల వెలుగులోకి తేవడం ఒక విశేషం.

జయసూర్య

సీనియర్‌ జర్నలిస్ట్‌

Updated Date - 2022-03-23T06:09:32+05:30 IST