Abn logo
Sep 27 2021 @ 00:17AM

‘బండ్‌’ భళా

భద్రకాళి బండ్‌ దృశ్యాలు

నేటి నుంచి సందర్శనకు భద్రకాళి బండ్‌ సిద్ధం
రూ. 29కోట్లతో అబ్బురపరిచేలా నిర్మాణం
మూడు విభాగాలు.. ఏడు జోన్లుగా విభజన
రాతి కట్టడాలు.. స్వాగత తోరణాలు.. విద్యుత్‌ కాంతులు..
వాకర్స్‌కు రబ్బరైజ్డ్‌ సింథటిక్‌ ట్రాక్‌.. ఓపెన్‌ జిమ్‌..
బండ్‌ చుట్టూ గుభాళించనున్న ఆధ్మాత్మిక పరిమళాలు


హనుమకొండ సిటీ

వరంగల్‌ భద్రకాళి బండ్‌ సందర్శనకు సిద్ధమైంది. నాలుగున్నరేళ్లుగా ఊరిస్తూ వస్తున్న బండ్‌ ఎట్టకేలకు సందర్శనకు రెఢీ అంటోంది. రూ.29కోట్లతో ’అమృత్‌’ ప్రాజెక్టు ద్వారా నిర్మాణమైన భద్రకాళి బండ్‌ సందర్శకులకు ఆహ్వానం పలుకుతోంది. అద్భుతమైన శిల్ప సంపదతో కూడిన 8 తోరణాలు, 1.1 కిలోమీటర్ల మేర రాతి ఫ్లోరింగ్‌, విద్యుత్‌ దీపాల కాంతులు, కొలనాడ్‌లు, 120స్టోన్‌ లైటింగ్‌ పోస్టులు, కనువిందు చేసే వాటర్‌ ఫౌంటెన్‌లు, గ్రీనరీ, అందమైన పూలవనంలాంటి  ఎన్నో హంగులతో భద్రకాళి బండ్‌ సందర్శకులకు కనువిందు చేయనుంది.  

మూడు విభాగాలు.. ఏడు జోన్లు..
భద్రకాళి బండ్‌ ప్రస్తుత 1.1 కిలోమీటర్‌  పరిధిలో నిర్మాణమైంది. మొత్తంగా మూడు విభాగాలు. ఏడు జోన్లుగా బండ్‌ నిర్మాణ ప్రణాళికలు ఉన్నాయి. మూడు విభాగాల్లో ప్రామినాడ్‌ ఒకటి. ఈ విభాగంలో రిలాక్సేషన్‌, ఓపెన్‌ జిమ్‌, ప్లేయింగ్‌ ఎక్వి్‌పమెంట్స్‌, ఫౌంటెన్స్‌, సిట్టింగ్‌ స్పేసెస్‌ తదితరమైనవి ఉన్నాయి. సిట్టింగ్‌ స్పేసెస్‌ కూర్చొని భద్రకాళి అందాలను తిలకించడం ఓ గొప్ప అనుభూతిని కలిగిస్తుంది. రెండో విభాగంలో రబ్బరైజ్డ్‌ వాకింగ్‌ ట్రాక్‌ను నిర్మించారు. బండ్‌ మూడో విభాగంలో టాయ్‌ ట్రెయిన్‌ ఏర్పాటు చేయాలని ‘కుడా’ తలచింది. కానీ ఇప్పటికైతే నెరవేరలేదు. ఇక  ఈ-సైకిల్స్‌, బ్యాటరీ ఆపరేటెడ్‌ వెహికిల్స్‌ కూడా అందుబాటులోకి రాలేదు. అయితే క్రమంగా సమకూరుతాయని అధికారులు చెబుతున్నారు. రెండోదశ నిర్మాణాన్ని స్మార్ట్‌ప్రాజెక్టు ద్వారా రూ.65కోట్లతో చేపట్టారు. పనులు జరుగుతున్నాయి. రెండోదశలో 2.9 కిలోమీటర్ల మేర బండ్‌ విస్తరణ జరగనుంది.

ఆధ్యాత్మిక పరిమళాలు
భద్రకాళి బండ్‌ చుట్టూరా ఆధ్యాత్మిక పరిమళాలు వెదజల్లనున్నాయి. బండ్‌ మధ్యలో నుంచి చూస్తే అమ్మవారి దేవాలయం కనిపిస్తుంది. ఎడమ వైపునకు తిరిగితే పద్మాక్షి దేవాలయం, సిద్దేశ్వర దేవాలయం, జైన దేవాలయం దర్శనమిస్తాయి. ఈ నాలుగు దేవాలయాలను 8 కిలోమీటర్ల పరిఽధిలో భక్తులు దర్శించుకోవచ్చు. బండ్‌ నుంచి ఈ దేవాలయాలకు కాలి నడకన చేరవచ్చు. హనుమకొండ పద్మాక్షి దేవాలయం నుంచి బండ్‌కు చేరుకునే మార్గం వివాదంలో ఉంది. ఈ కారణంగా ఈ దిశగా బండ్‌ నిర్మాణం జరగలేదు. కొలిక్కివచ్చి పూర్తయితే పద్మాక్షి దేవాలయం నుంచే భద్రకాళి బండ్‌కు మరో మార్గం నిర్మాణమవుతుంది.

రబ్బరైజ్‌డ్‌ వాకింగ్‌ ట్రాక్‌
భద్రకాళి బండ్‌ ప్రత్యేకతలలో ప్రత్యేకం సింథటిక్‌ రబ్బరైజ్‌డ్‌ వాకింగ్‌ ట్రాక్‌ ముఖ్యమైనది. 1.1 కిలోమీటర్‌ పొడవునా ట్రాక్‌ను ఏర్పాటు చేశారు. వాకర్స్‌కు ముఖ్యంగా వృద్ధులు సైతం సౌకర్యంగా వాకింగ్‌ చేయవచ్చు. ఓపెన్‌ జిమ్‌లో వ్యాయమాలు చేయవచ్చు. చల్లని వాతావరణంలో, దేవాలయాల సన్నిధిలో, భద్రకళి జలదృశ్యాలను ఆస్వాదిస్తూ వాకింగ్‌ చేయడం వాకర్స్‌కు ఎంతో మధురానుభూతిని కలిగించే విషయమే.

అసంపూర్తి పనులు

భద్రకాళి బండ్‌ పనులు అసంపూర్ణంగానే ఉన్నాయి. ‘కుడా’ ముందుగా చెప్పిన విధంగా బండ్‌ సంపూర్ణ దృశ్య ఆవిష్కరణ మాత్రం ఇంకా జరగలేదు. పర్యాటకులకు ఇది ఒకింత నిరాశ కలిగించే అంశమే. ప్రవేశ మార్గం ఇంకా నిర్మాణ దశలోనే ఉంది. పూర్తయ్యేసరికి మరి కొన్నినెలల సమయం పడుతుంది. ఇప్పటికే పూర్తిచేయాల్సిన అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించారు. బండ్‌ సందర్శన సంబరాలకు వర్షం పడితే ఆటంకమే. కొద్దిపాటి వర్షం పడితే ప్రవేశ మార్గం చిత్తడవుతుంది. ఇక బండ్‌ లోపల పనులు కూడా ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి.  భద్రకాళి బండ్‌ నుంచి పద్మాక్షి దేవాలయానికి చేరేందుకు సస్పెన్షన్‌ బ్రిడ్జి నిర్మించాలన్న ప్రణాళికలు ఆచరణకు నోచుకోలేదు. రెండు సస్పెన్షన్‌ బ్రిడ్జిలను నిర్మించే ప్రణాళిక ఉన్నట్లు మూడేళ్ల కిందటే ‘కుడా’ ప్రకటించినా ఆ సంగతి మరిచింది. బ్రిడ్జి నిర్మిస్తే బండ్‌కు మరింత ప్రత్యేకత లభిస్తుంది.  అలాగే టాయ్‌ ట్రెయిన్‌, ఈ-సైకిల్స్‌, బ్యాటరీ వెహికిల్స్‌, కల్చరల్‌ జోన్‌.. ఇలా ఎన్నో ప్రత్యేకతలతో బండ్‌ను నిర్మిస్తామని చెప్పిన ‘కుడా’ మాటలు సంపూర్ణం కాలేదు. ఇప్పటికీ 70 శాతం పనులే పూర్తయ్యాయి. బండ్‌ ప్రవేశమార్గమే ఇంకా నిర్మాణంలో ఉండడం, జంక్షన్లు పూర్తికాకపోవడం వంటి అసంపూర్ణ పనుల మధ్యనే భద్రకాళి బండ్‌ సందర్శనకు ముస్తాబైంది. భద్రకాళి బండ్‌ పనులు, ఇతర ప్రాజెక్టులు నెలకొల్పేందుకు మరో 6నెలల సమయం పట్టక తప్పదనే అంచనాలు ఉన్నాయి.

సకల హంగులు సమకూర్చుతాం
- మర్రి యాదవరెడ్డి, ‘కుడా’ చైర్మన్‌,

భద్రకాళి బండ్‌కు సకల హంగులు సమకూర్చుతాం. ఒక్క దాని వెంట మరో ప్రాజెక్టు నిర్మాణం జరుగుతోంది. టాయ్‌ ట్రెయిన్‌ వంటివి వస్తాయి. బ్యాటరీ వెహికిల్స్‌ కూడా అందుబాటులోకి వస్తాయి. ఫుడ్‌ కోర్టులు ఉంటాయి. వరంగల్‌ నగరానికి భద్రకాళి బండ్‌ మరో కీర్తి కిరీటం. దేశ, ప్రపంచ దేశాల పర్యటకులను ఎంతో ఆకర్షిస్తుందనడంలో సందేహం లేదు. వరంగల్‌ను టూరిస్ట్‌ హబ్‌గా మార్చాలనే సీఎం కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌ల చిత్తశుద్ధికి సాక్షీభూతంగా బండ్‌ ఆవిష్కృతమైంది.

సింథటిక్‌ వాకింగ్‌ ట్రాక్‌


ప్లేయింగ్‌ జోన్‌


ప్లేయింగ్‌ జోన్‌ఇంకా కొనసాగుతున్న ప్రవేశ మార్గం నిర్మాణ పనులు