భద్రాద్రి రాముడికి రూపాయీ దక్కలేదు!

ABN , First Publish Date - 2020-10-24T08:43:57+05:30 IST

భద్రాద్రి రాముడు తెలంగాణ దేవుడన్నారు.. యాదాద్రి తరహాలో తీర్చిదిద్దుతామన్నారు. దీంతో భద్రాద్రి

భద్రాద్రి రాముడికి రూపాయీ దక్కలేదు!

ఆలయ అభివృద్ధిపై చిత్తశుద్ధి ఏదీ? 

 ప్రత్యేక రాష్ట్రం వచ్చిన ఆరేళ్లలో రెండు సార్లు బడ్జెట్‌లో కేటాయింపులు

అందులో పైసా మంజూరు కాలేదు

ప్రభుత్వం తీరుపై రామభక్తుల ఆక్షేపణ


భద్రాచలం, అక్టోబరు 23: భద్రాద్రి రాముడు తెలంగాణ దేవుడన్నారు.. యాదాద్రి తరహాలో తీర్చిదిద్దుతామన్నారు. దీంతో భద్రాద్రి ఆలయాభివృద్ధి శరవేగంగా సాగుతుందని అందరూ ఆశించారు. అందుకు తగ్గట్లే రెండు దఫాలు రాష్ట్ర బడ్జెట్‌లో భద్రాద్రి ఆలయాభివృద్ధి కోసం నిధులు కేటాయించారు. అయితే, కేటాయించిన నిధుల మంజూరుపై నేటికీ స్పష్టత లేదు. రాష్ట్రం ఆవిర్భవించి ఆరు సంవత్సరాలైనా భద్రాద్రి రామాలయ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కనీసం రూపాయి కూడా విడుదల చేయకపోవడంపై ప్రధాన రాజకీయ పార్టీల నేతలు, భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. భద్రాద్రి ఆలయ అభివృద్ధిపై ప్రభుత్వానికి అసలు చిత్తశుద్ధి ఉందా? అనే అనుమానాలు స్థానికుల్లో వ్యక్తమవుతున్నాయి. 


సీఎం నోట ఆలయాభివృద్ధి మాట

రాష్ట్ర ముఖ్యమంత్రిగా 2015లో తొలిసారి భద్రాద్రి రామయ్య కల్యాణానికి వచ్చిన సమయంలో కేసీఆర్‌ భద్రాద్రి ఆలయాభివృద్ధిపై ప్రకటన చేశారు. రాష్ట్ర బడ్జెట్‌లో రూ.100 కోట్లు ఆలయాభివృద్ధికి కేటాయించారు. ఎలాంటి నిధులు మంజూరు చేయలేదు. పలుమార్లు ఆలయాభివృద్ధికి కసరత్తు మాత్రం చేపట్టారు. అప్పటి రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, చినజీయర్‌ స్వామి, ఆర్కిటెక్ట్‌ ఆనంద్‌సాయి పలుమార్లు ఆలయ పరిసరాలను పరిశీలించి మాస్టర్‌ ప్లాన్‌ను రూపొందించి, సీఎం కేసీఆర్‌ ఆమోదం కోసం నివేదించారు. 2017 అక్టోబరులో భద్రాద్రి ఆలయ అభివృద్ధి పనుల రూపశిల్పిగా ఆనంద్‌సాయిని నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆ తర్వాత ఎలాంటి కదలిక లేకపోవడం గమనార్హం. 2018-19 రాష్ట్ర వార్షిక బడ్జెట్లో మళ్లీ ఆలయాభివృద్ధికి రూ.50 కోట్లు కేటాయిస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. ఈ కేటాయింపు జరిగి ఏడాదిన్నర దాటినా నేటికీ నిధుల మంజూరు లేకపోవడం రామ భక్తులను కలిచివేస్తోంది. 




వెంటనే నిధులివ్వాలి 

భద్రాద్రి ఆలయాభివృద్ధికి నిధులు కేటాయిస్తూ రెండుసార్లు బడ్జెట్‌లో ప్రభుత్వమే స్వయంగా పేర్కొన్నా అది ఆచరణ రూపం దాల్చకపోవడం శోచనీయం. యాదాద్రి మాదిరిగా భద్రాద్రిని అభివృద్ధి చేస్తామని ప్రకటనలు గుప్పించి, బడ్జెట్‌లో కేటాయింపులు చేసి ఒక్కపైసా ఇవ్వకుండా రిక్తహస్తం చూపడం దారుణం. ప్రభుత్వం ఇకనైనా భద్రాద్రి వాసులు, రామభక్తుల మనోగతాన్ని గుర్తించి నిధులు మంజూరు చేయాలి. 

పొదెం వీరయ్య, భద్రాచలం ఎమ్మెల్యే

Updated Date - 2020-10-24T08:43:57+05:30 IST