పట్టాభిషక్తుడైన భద్రాద్రి రామయ్య

ABN , First Publish Date - 2020-04-04T10:22:06+05:30 IST

భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్రస్వామి వారి పట్టాభిషేకం శుక్రవారం వైభవంగా జరిగింది. కిరీటధారణతో

పట్టాభిషక్తుడైన భద్రాద్రి రామయ్య

పట్టువస్త్రాలు సమర్పించిన ప్రభుత్వ గౌరవ సలహాదారు కేవీ రమణాచారి


భద్రాచలం, ఏప్రిల్‌ 3 : భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్రస్వామి వారి పట్టాభిషేకం శుక్రవారం వైభవంగా జరిగింది.  కిరీటధారణతో పట్టాభిషేక ఘట్టం ముగిసిన తరువాత 500 నదీ జలాలు, నాలుగు సముద్ర జలాలను ఆవాహన చేసిన కలశ జలంతో రామయ్యకు ప్రోక్షణ గావించారు. ఈ అపురూప దృశ్యాన్ని ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించిన భక్తజనం పులకించింది. శ్రీరామనవమిని పురస్కరించుకొని గురువారం సీతారాముల కల్యాణం కన్నుల పండువగా జరగ్గా.. పుష్యమి నక్షత్ర పర్వదినాన కల్యాణ రామునికి పట్టాభిషేక ఘట్టాన్ని నిర్వహించారు. నూతన దంపతులైన సీతారామచంద్రస్వాముల వారిని పట్టాభిషేక వేడుకకు మండపానికి వేద పండితుల వేద పఠనం, మంగళ వాయిద్యాల నడుమ తోడ్కొని వచ్చారు. ఆరాధనతో ప్రారంభమైన ఈ  వేడుకలో విశ్వక్సేన పూజ, పుణ్యహావచనం నిర్వహించారు. అనంతరం త్రయమండప ఆరాధన నిర్వహించారు. అనంతరం పట్టాభిషేక ఘట్టంలో భాగంగా భద్రాద్రి రామయ్యకు విశిష్టతను వివరిస్తూ ఒక్కో ఆభరణాన్ని అర్చకస్వాములు సమర్పించారు.


శ్రీరామ బంగారు పాదుకలు, రాజదండం, రాజ ముద్రిక, భక్తరామదాసు చేయించిన పచ్చల పతకం శ్రీరామునికి, చింతాకు పతకం సీతమ్మకు, శ్రీరామమాడ లక్ష్మణస్వామికి సమర్పించారు. ఆ తరువాత చామరం, బంగారు చత్రం, దుష్ట శిక్షణ కోసం రాజఖడ్గాన్ని రామయ్యకు సమర్పించారు. అనంతరం పట్టాభిషేక ఘట్టంలో ప్రధానలాంఛనమైన  సామ్రాట్‌ కిరీటాన్ని రామయ్యకు ధరింపజేశారు. అనంతరం దేవేంద్రుడు కానుకగా పంపినట్లుగా చెప్పే ముత్యాల హారాన్ని రామచంద్రమూర్తికి, ఆ తరువాత సీతమ్మ తల్లికి చివరగా రామభక్తి సామ్రాజ్యానికి రారాజైన హనుమంతునికి సమర్పించి ప్రోక్షణ గావించారు. మెడలో వేయగా అది రామయ్య నుంచి సీతమ్మకు, సీతమ్మ నుంచి భక్తుడైన హనుమంతుడికి సమర్పించారు.


వేదఆశీర్వచనం, అష్టోత్తర శతహారతి(108 ఒత్తులతో) భద్రాచల శ్రీరామచంద్ర మహాప్రభువుకు సమర్పించడంతో పట్టాభిషేకం సుసంపన్నమైంది. ఇదిలా ఉండగా ప్రతీ ఏటా రాష్ట్ర ప్రభుత్వం తరపున గవర్నర్‌ సమర్పించే పట్టువస్త్రాలను ఈ సారి వారి ప్రతినిధిగా రాష్ట్ర ప్రభుత్వ గౌరవ సలహాదారు కేవీ రమణాచారి అందజేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, భద్రాద్రి దేవస్థానం ఈవో జి.నర్సింహులు, ఏఈవో శ్రావణ్‌కుమార్‌, డీఈ వి.రవీంద్రనాధ్‌, భద్రాచలం సీఐ వినోద్‌, తహసీల్దార్‌ శేషగిరిరావు, దేవస్థానం స్థానాచార్యులు కేఈ స్థలశాయి, ప్రధాన అర్చకులు పొడిచేటి సీతారామానుజాచార్యులు, అమరవాది విజయరాఘవన్‌, ఉప ప్రధాన అర్చకులు కోటి శ్రీమన్నారాయణాచార్యులు పాల్గొన్నారు. 


కరోనా నేపథ్యంలో నిరాడంబరంగా వేడుక... 

ప్రతీ ఏడాది కల్యాణం జరిగిన మరుసటి రోజు మిథిలా స్టేడియంలోనే పట్టాభిషేక వేడుకను నిర్వహించడం ఆనవాయితీ. ఈ కార్యక్రమానికి వేలల్లో భక్తులు హాజరవుతుంటారు. కానీ ఈ ఏడాది కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో లాక్‌డౌన్‌ అమల్లో ఉండటంతో భక్తులను అనుమతించలేదు. అధికారులు, అర్చకులు, దేవస్థాన సిబ్బంది మొత్తం కలిపి సుమారు 50మంది లోపే ఈ వేడుకను నిర్వహించారు. 

Updated Date - 2020-04-04T10:22:06+05:30 IST