Bhadradri: భద్రాద్రి రామాలయంపై వరద ప్రభావం

ABN , First Publish Date - 2022-07-16T03:15:48+05:30 IST

భద్రాచలంలో గోదావరి నీటి మట్టం 70 అడుగులు దాటి రికార్డుస్థాయిలో ప్రవహిస్తున్న క్రమంలో అధికార యంత్రాంగం తీసుకున్న

Bhadradri: భద్రాద్రి రామాలయంపై వరద ప్రభావం

భద్రాచలం: భద్రాచలంలో గోదావరి నీటి మట్టం 70 అడుగులు దాటి రికార్డుస్థాయిలో ప్రవహిస్తున్న క్రమంలో అధికార యంత్రాంగం తీసుకున్న ముందస్తు చర్యల్లో భాగంగా వారధిపై రాకపోకలను నియంత్రించింది. దీంతో దక్షిణ అయోధ్యగా విరాజిల్లుతున్న భద్రాచలం రామాలయంపై వరద ప్రభావం స్పష్టంగా పడింది. శుక్రవార భద్రాద్రి రామయ్యకు నిర్వ హించిన నిత్యకల్యాణంలో కేవలం ఒక్కరు మాత్రమే పాల్గొనడంతో అంతరాలయంలోనే స్వామి వారికి కల్యాణం నిర్వహించారు. కాగా రామాలయాన్ని దర్శించుకున్న భక్తుల సంఖ్య సైతం వందలోపే ఉంది. 13న రూ.78 వేలు, 14న రూ.55 వేల ఆదాయం సమకూరినట్లు దేవస్థానం వర్గాలు పేర్కొంటున్నాయి. వాస్తవానికి ఇటీవల కాలంలో భద్రాద్రి రామాలయానికి భారీగా భక్తుల రాక ఉంటుండటంతో ఆదాయం సమకూరుతోంది. సుమారుగా ఆరు నుంచి ఎనిమిది లక్షల రూపాయలు సాధారణ రోజుల్లో వస్తున్న క్రమంలో మూడు రోజులుగా రోజుకు రూ.80 వేలలోపే ఉండటం గమనార్హం. వరద వల్ల భద్రాచలంలో పలు హోటళ్లను స్వచ్చందంగా నిర్వాహకులు మూసివేశారు. పని చేసేందుకు సిబ్బంది రాకపోవడం, కూరగా యలు లభించకపోవడంతో సమస్య తలెత్తుతోందని హోటల్‌ వ్యాపారి కల్కి పుల్లారావు ఆంధ్రజ్యోతితో పేర్కొన్నారు. భద్రాచలం రామాలయం పడమర మెట్ల వైపు భారీగా డ్రెయిన్‌, బ్యాక్‌ వాటర్‌ రావడంతో సుమారు 50 దుకాణాలు నీట మునిగాయి. అలాగే ఇతర దుకాణ దారులు సైతం మరింతగా వరద వచ్చే అవకాశం ఉందని హెచ్చరికలు రావడంతో పునరావాస కేంద్రాలకు తరలివెళ్లారు. 

Updated Date - 2022-07-16T03:15:48+05:30 IST