భావ సమాధి స్థితి నుంచే భక్తులను కరుణించే వేలుపుగా హనుమంతుడు పూజలందుకుంటున్న చోటది. ఆంజనేయుడు యోగ... నిద్రా భంగిమలో కనిపించే అరుదైన అతి కొద్ది ఆలయాల్లో ఒకటి. అదే భక్తులకు అభయాన్నీ, భద్రతనూ ప్రసాదించే ఖుల్దాబాద్ భద్రమారుతి మందిరం.
హనుమంతుడు శయన భంగిమలో కనిపించే ఆలయాలు దేశంలో ప్రధానంగా మూడే కనిపిస్తాయి. వాటిలో రెండు మధ్యప్రదేశ్‌లోని జామ్ సావలీలో, ఉత్తరప్రదేశ్‌లోని అలహాబాద్‌లో ఉన్నాయి. మూడవదైన ఖుల్దాబాద్ భద్రమారుతి ఆలయం... మహారాష్ట్రలోని ఔరంగాబాద్‌కు దగ్గరలో... సుప్రసిద్ధమైన ఎల్లోరా గుహలకు కేవలం నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉంది.
ఈ ఆలయ చరిత్రను గమనిస్తే... రామాయణ కాలంలో... లక్ష్మణుణ్ణి సజీవుడిగా చేయడం కోసం సంజీవని పర్వతాన్ని వెతుకుతూ అలసిపోయిన హనుమంతుడు ఈ ప్రాంతంలో విశ్రమించాడనీ, అందుకే ఈ ఆలయంలో విగ్రహం శయన భంగిమలో ఉంటుందనీ ఒక కథ ఉంది. మరో కథ ప్రకారం, భద్రమారుతి ఆలయం త్రేతాయుగం నుంచి ఉంది. పూర్వం ఖుల్దాబాద్‌ను భద్రావతిగా పిలిచేవారు. ఈ ప్రాంతాన్ని పాలించే రాజు భద్రసేనుడు శ్రీరాముడికి పరమ భక్తుడు. ఎల్లప్పుడూ రామనామాన్ని జపించేవాడు, శ్రీరామ గీతాలను పాడుతూ ఉండేవాడు.
ఒకరోజు అలా ఆయన పాడుతూ ఉంటే... అటుగా పయనిస్తున్న హనుమంతుడు విన్నాడు. ఆయన తన్మయత్వంతో నృత్యం చేసి, భావ సమాధిలోకి వెళ్లిపోయాడు. గానాన్ని పూర్తి చేసిన భద్రసేనుడికి శయనించి ఉన్న ఆంజనేయుడు కనిపించాడు. భద్రసేనుడి ప్రార్థన మేరకు ఆ ప్రదేశంలోనే శాశ్వతంగా ఉంటానని హనుమంతుడు వరమిచ్చాడు. ఆనాటి నుంచి భద్ర మారుతిగా భక్తులను ఆయన అనుగ్రహిస్తున్నాడని స్థల పురాణం వివరిస్తోంది.
మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు దండయాత్ర చేసి, భద్రావతి పేరును ఖుల్దాబాద్గా మార్చాడనీ, ఆ కాలంలోనే ఈ ఆలయం పూర్తిగా ధ్వంసమైందనీ స్థానిక చరిత్ర చెబుతోంది. చాలాఏళ్ళ తరువాత... 1966లో భద్ర మారుతి విగ్రహం తవ్వకాలలో బయటపడింది. నారాయణగిరి మహరాజ్ అనే ఆధ్యాత్మిక గురువు ఆధ్వర్యంలో ఆలయ పునర్నిర్మాణం జరిగింది.
ఈ ఆలయంలో హనుమజ్జయంతి, శ్రీరామనవమి ఉత్సవాలను వైభవంగా నిర్వహిస్తారు. మంగళ, శనివారాల్లో పెద్ద సంఖ్యలో భక్తులు స్వామిని దర్శించుకుంటారు. ప్రత్యేకించి శ్రావణ శనివారాలను అత్యంత పవిత్రంగా భావిస్తారు. ఈ స్వామిని పూజిస్తే అవివాహితులకు వివాహం జరుగుతుందని, అస్థిరమైన జీవితానికి భద్రత కలుగుతుందని, దీర్ఘకాలికమైన చిక్కులన్నీ తొలగిపోతాయని భక్తుల నమ్మిక.