వచ్చే ఏడాది నుంచి ఐదేళ్లపాటు జరిగే ఐపీఎల్ ప్రసార హక్కుల కోసం భారీ పోటీ నెలకొంది. టెలివిజన్ ప్రసార హక్కులతోపాటు, ఆన్లైన్ స్ట్రీమింగ్ హక్కులను వేర్వేరుగా విక్రయించేందుకు బీసీసీఐ సిద్ధమైంది. ఈ ప్రసార హక్కుల కోసం ముఖేష్ అంబానీకి చెందిన రిలయన్స్తోపాటు, జెఫ్ బెజోస్‌కు చెందిన అమెజాన్ పోటీ పడనున్నాయి. అమెజాన్, రిలయన్స్ సంస్థలు ఈ పోటీని ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి. వీటితోపాటు డిస్నీ ప్లస్ హాట్‌స్టార్, జీ నెట్వర్క్ కూడా వేలంలో పోటీ పడే అవకాశాలున్నాయి. ఫేస్బుక్, యూట్యూబ్ కూడా పోటీలో పాల్గొనే అంశాన్ని పరిశీలిస్తున్నాయి. 2023-27 వరకు ఐపీఎల్ ప్రసార హక్కులను వేలం ద్వారా కేటాయించాలని బీసీసీఐ నిర్ణయించింది. ఇప్పటికే దీనికి సంబంధించి టెండర్ల ప్రక్రియను బీసీసీఐ ప్రారంభించింది.
వచ్చే జూన్ 12న జరిగే ఇ-వేలం ద్వారా హక్కులను విక్రయించనున్నట్లు బీసీసీఐ సెక్రటరీ జై షా తెలిపారు. కనీసం 7 బిలియన్ డాలర్లు ప్రసార హక్కుల ద్వారా వస్తాయని అంచనా. ఈ హక్కుల కోసం ప్రధానంగా రిలయన్స్, అమెజాన్‌ల మధ్యే పోటీ ఉండే అవకాశం ఉంది. ప్రస్తుతం ఐపీఎల్ మ్యాచ్‌లు డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో ప్రసారమవుతున్న సంగతి తెలిసిందే. అమెజాన్‌కు సంబంధించిన ప్రైమ్ వీడియోలో ఇప్పటికే కొన్ని అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్‌లు ప్రసారమయ్యాయి. రిలయన్స్‌కు సంబంధించిన ఓటీటీ ప్లాట్‌ఫామ్ జియో సినిమాలో క్రికెట్ మ్యాచ్‌లను ఆన్లైన్ స్ట్రీమింగ్ చేయాలని ఆ సంస్థ భావిస్తోంది.