ఆశ్రితులను మించి

ABN , First Publish Date - 2022-06-23T07:01:57+05:30 IST

శ్రీలంకలో నిరసనలకు ఏ మాత్రం భయపడని అదానీ గ్రూప్ అక్కడ ఎనర్జీ రంగంలో మరింత వడిగా అడుగులువేయదల్చుకున్నదంటూ...

ఆశ్రితులను మించి

శ్రీలంకలో నిరసనలకు ఏ మాత్రం భయపడని అదానీ గ్రూప్ అక్కడ ఎనర్జీ రంగంలో మరింత వడిగా అడుగులువేయదల్చుకున్నదంటూ అంతర్జాతీయ ఇంధన రంగం పరిణామాలను విశ్లేషించే వెబ్ సైట్ ఒకటి వ్యాఖ్యానించింది. పునర్వినియోగ ఇంధనరంగంలో అదానీ గ్రూపు లంకలో ఎన్ని ప్రాజెక్టులను చేపట్టదల్చుకున్నదో వివరిస్తూ, చైనా చేతిలోనుంచి మూడు ప్రాజెక్టులను భారత్ తన్నుకుపోగలిగిందని కూడా వ్యాఖ్యానించింది. భారతీయ పారిశ్రామికవేత్తలు ఇతరదేశాల్లో భారీ ప్రాజెక్టులను చేపడుతున్నారనీ, కాంట్రాక్టులు పొందుతున్నారనీ విన్నప్పుడు సంతోషంగా ఉంటుంది. కానీ, అందుకు ఎదుటివారి నిస్సహాయస్థితి, మన దౌత్య ఒత్తిడి తోడైనాయని తెలిసినప్పుడు ఎంతో ఆశ్చర్యం, రవ్వంత ఆవేదన కలుగుతాయి. 


సిలోన్ విద్యుత్ బోర్డు మాజీ చైర్మన్ ఫెర్డినాండో ఇటీవల చేసిన వ్యాఖ్యలను మిగతా ప్రపంచం కూడా విన్నది. సదరు ఫెర్డినాండో చిన్నస్థాయి అధికారి ఏమీ కాదు. ఒక ప్రాజెక్టును టెండర్లు పిలవకుండా నేరుగా అదానీకి ఇచ్చేయమనీ, ఈ వ్యవహారాన్ని కడవరకూ కచ్చితంగా సాగేవిధంగా నీవే పర్యవేక్షించాలని దేశాధ్యక్షుడు గోటబయ రాజపక్స ఆదేశించారని ఫెర్డినాండో చెప్పారు. ఇలా టెండర్లు పిలవకుండా అదానీ గ్రూపుకు ప్రాజెక్టును నేరుగా అప్పగించేయడానికి నరేంద్రమోదీ ఒత్తిడి కారణమని రాజపక్స తనతో చెప్పారని పార్లమెంటరీ ప్యానెల్ బహిరంగ విచారణలోనూ సదరు అధికారి తేల్చేశారు. అధ్యక్షుడినుంచి నేరుగా ఆదేశాలు అందుకున్న తరువాత సదరు అధికారి ఆ దిశగా తీసుకున్న ప్రతీచర్యనూ లంక మీడియా వివరించింది. ఈ ఆరోపణలను రాజపక్స ఖండించడం, వెనువెంటనే ఫెర్డినాండో కూడా వాటిని ఉపసంహరించుకోవడం జరిగిపోయాయి. ఆ తరువాత ఆయన బహిరంగ క్షమాపణలు కూడా చెప్పి, చివరకు రాజీనామా కూడా చేసేశారు. అదానీ గ్రూపు ఓ చిన్నపాటి ట్వీట్ చేసింది కానీ అది ఈ పరిణామాలకు వివరణేమీ కాదు. నరేంద్రమోదీ నోరువిప్పాలని విపక్షాలు ఎప్పటిలాగానే ఇప్పుడూ అన్నాయి కానీ, అది జరిగేదేమీ కాదు. బీజేపీ కూడా ఈ విషయంలో ఓ అడుగుముందుకు వేస్తే మరింత బురదలో కూరుకుపోవడం ఖాయమని భయపడినట్టు కనిపిస్తోంది. 


ఇలాంటి విషయాల్లో నిజానిజాలు ఏమిటో నిర్థారించడం కష్టం. సదరు అధికారికి పనిగట్టుకొని మరీ ఈ వివాదం రేపవలసిన, కష్టకాలంలో ఉన్న దేశాన్ని మరిన్ని ఇబ్బందుల్లోకీ, దౌత్యసంకటాల్లోకి నెట్టవలసిన అగత్యం ఎందుకు ఉంటుంది? అని అనుకోవడం వినా చేయగలిగేదేమీ ఉండదు. ఆర్థికకష్టాల్లో ఉన్న లంకకు సాయం చేయడం వెనుక భారతదేశం తన దీర్ఘకాలిక రక్షణ వ్యూహాలనూ, భౌగోళిక ప్రయోజనాలను లెక్కబెట్టుకుంటోందన్న విమర్శ ఇటీవల లంకలో హెచ్చుగానే ఉన్నది. కానీ, 630 బిలియన్ డాలర్ల రిజర్వులున్న భారతదేశం తన పొరుగుదేశానికి ఒక బిలియన్ డాలర్ సాయం చేయడానికీ, కాస్తంత చమురు దానం చేయడానికి వివిధ ప్రాజెక్టుల కాంట్రాక్టులతో ముడిపెట్డడం సమంజసం కాదంటూ మొన్న మార్చిలో అక్కడి సండే టైమ్స్ సంపాదకీయం రాసింది. భారతదేశ సాయాన్ని అనుమానించడాన్ని అటుంచితే, పోర్టు టెర్మినల్ ఒప్పందం తరువాత అదానీ గ్రూప్ వరుస పవర్ ప్రాజెక్టులను సంపాదించుకున్నదన్న వార్తతో పాటుగానే ఈ విమర్శలు వెలువడటం విశేషం. ఇక, మోదీ గౌతమ్ అదానీ ఎదుగుదల వెనుక మోదీ అండదండలున్నాయన్న విపక్షాల విమర్శలు అంటుంచితే, అదానీ మాత్రం అద్భుతమైన వేగంతో ఎదిగిపోతున్నారు. అంబానీతో తొలిస్థానం కోసం ఇంత వేగంగా పోటీపడగలగడం విచిత్రమేమరి. గతంలో తనకు ఏమాత్రం నైపుణ్యం, అవగాహన లేని రంగాల్లోకి కూడా ఇప్పుడు ఆయన విస్తరిస్తున్నారు. ఓడరేవులు, విమానాశ్రయాలు ఆయన చేతుల్లోకి పోతున్నాయి. ప్రభుత్వరంగంలో ఉన్నవాటిని ప్రైవేటీకరణలో భాగంగా చవుకగా పొందడం ఇప్పుడు ఎలాగూ జరుగుతున్నదే, కానీ, ప్రైవేటు రంగంలోనివీ, వేరొకరిచేతుల్లోనో ఉన్నవీ ఈయన వశం కావడం మరో విచిత్రం. ఐటీ, ఈడీ బెదిరింపుల మధ్య కారుచవుకగా ఈ బదలాయింపులు జరిగిపోతున్నాయని కూడా గిట్టనివారు అంటూంటారు. ఆశ్రిత పెట్టుబడిదారీతనంలో మనదేశం ప్రథమస్థానాల్లో ఉన్నదని మొన్న మార్చిలో వెలువడిన అంతర్జాతీయ సర్వే ఒకటి తేల్చింది. పాలకులు తమకు అనుకూలమైన పెట్టుబడిదారులకు లబ్ధిచేకూర్చే విధంగా నియమనిబంధనలు మార్చడం అందులో భాగం. కానీ, ఏకంగా టెండర్లు, పోటీలు లేకుండా అస్మదీయులకు ప్రాజెక్టులు కట్టబెట్టడాన్ని ఏ విధంగా నిర్వచించాలో తెలియదు.

Updated Date - 2022-06-23T07:01:57+05:30 IST