మీ యూట్యూబ్‌ అకౌంట్‌ ఎంత భద్రం?

ABN , First Publish Date - 2020-06-20T05:30:00+05:30 IST

మీకు యూట్యూబ్‌ అకౌంట్‌ ఉందా? మీ అకౌంట్‌కు సబ్‌స్క్రయిబర్ల సంఖ్య కూడా ఎక్కువే ఉందా? అయితే జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే హ్యాకర్ల కన్ను మీ యూట్యూబ్‌ అకౌంట్‌పై పడవచ్చు. ఈ మధ్యకాలంలో యూట్యూబ్‌ అకౌంట్లను హ్యాక్‌ చేస్తూ డబ్బులు డిమాండ్‌ చేస్తున్న సంఘటనలు ఎక్కువయ్యాయి...

మీ యూట్యూబ్‌ అకౌంట్‌ ఎంత భద్రం?

మీకు యూట్యూబ్‌ అకౌంట్‌ ఉందా? మీ అకౌంట్‌కు సబ్‌స్క్రయిబర్ల సంఖ్య కూడా ఎక్కువే ఉందా? అయితే జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే హ్యాకర్ల కన్ను మీ యూట్యూబ్‌ అకౌంట్‌పై  పడవచ్చు. ఈ మధ్యకాలంలో యూట్యూబ్‌ అకౌంట్లను హ్యాక్‌ చేస్తూ డబ్బులు డిమాండ్‌ చేస్తున్న సంఘటనలు ఎక్కువయ్యాయి. ఈ నేపథ్యంలో యూట్యూబ్‌ అకౌంట్‌ను  కాపాడుకునేందుకు ఇలా చేయండి!


ఒక యూట్యూబ్‌ అకౌంట్‌ మొదలుపెట్టి, మంచి కంటెంట్‌ ఇస్తూ పోతే కొద్ది కాలంలోనే అది పాపులర్‌ అయి కాసుల వర్షం కురిపించడం ఖాయం. డిసెంబర్‌ 2019 గణాంకాల ప్రకారం మనదేశంలో   265 మిలియన్ల మందికి సొంత యూట్యూబ్‌ అకౌంట్‌ ఉందని అంచనా! అన్నిరకాల అంశాలకు సంబంధించి వివిధ భాషల్లో ప్రస్తుతం యూట్యూబ్‌ అకౌంట్లు అందుబాటులో ఉన్నాయి. అయితే కష్టపడి తమ ఛానల్‌ను విజయవంతం చేసుకున్న యూట్యూబ్‌ క్రియేటర్లకు తాజాగా ఒక పెద్ద ప్రమాదం వెన్నులో వణుకు తెప్పిస్తోంది. గత కొంతకాలంగా దేశవ్యాప్తంగా ఎన్నో పాపులర్‌ యూట్యూబ్‌ అకౌంట్లు హ్యాక్‌ అయ్యాయి. హ్యాకర్లు తమ అకౌంట్‌ను ఎక్కడ టార్గెట్‌ చేస్తారోనని యూట్యూబ్‌ క్రియేటర్లు ఆందోళన చెందుతున్నారు.




డార్క్‌వెబ్‌లో వేలం

హ్యాకర్లు ఎక్కువ మంది సబ్‌స్క్రయిబర్లు ఉన్న యూట్యూబ్‌ అకౌంట్లను ముందుగా టార్గెట్‌ చేస్తారు. వివిధ పద్ధతుల ద్వారా ఆ అకౌంట్‌ని హ్యాక్‌ చేయడానికి ప్రయత్నించి విజయవంతమవుతారు. అలా పూర్తిగా తమ నియంత్రణలోకి తీసుకున్న యూట్యూబ్‌ అకౌంట్‌ని డార్క్‌వెబ్‌లో వేలానికి పెడతారు. ఎవరైతే ఎక్కువ మొత్తం చెల్లించి దానిని సొంతం చేసుకుంటారో వారి చేతుల్లోకి ఆ అకౌంట్‌ నిర్వహణ పూర్తిగా వెళ్ళిపోతుంది. వేలంలో పాల్గొని అకౌంట్‌ సొంతం చేసుకున్న వ్యక్తి, ఒరిజినల్‌ యూట్యూబ్‌ క్రియేటర్‌ని సంప్రదించి, ‘నీ అకౌంట్‌ కావాలంటే ఫలానా మొత్తాన్ని బిట్‌కాయిన్‌ రూపంలో చెల్లించాలి’ అని డిమాండ్‌ చేస్తాడు. భారీ మొత్తంలో డబ్బు చెల్లించే ఆర్థిక స్తోమత లేని కొంతమంది తమ అకౌంట్‌ మీద పూర్తిగా ఆశలు వదిలేసుకుంటారు. మరికొందరు అడిగిన మొత్తాన్ని చెల్లిస్తారు. కొన్నిసార్లు పేమెంట్‌ చేసిన తర్వాత కూడా మళ్లీమళ్లీ డబ్బుల కోసం బ్లాక్‌ మెయిల్‌ చేస్తుంటారు. ఈ తరహా మోసాలు ఈ మధ్య బాగా ఎక్కువయ్యాయని ప్రముఖ సెక్యూరిటీ సంస్థ ఇన్‌సైట్స్‌ అభిప్రాయపడుతోంది. ఇటీవల హైదరాబాద్‌కి చెందిన ఓ ఫుడ్డీ యూట్యూబ్‌ అకౌంట్‌ ఇదే విధంగా హ్యాక్‌ అయింది. 


హ్యాక్‌ చేస్తారిలా..!

యూట్యూబ్‌ అకౌంట్‌ను హ్యాక్‌ చెయ్యడానికి హ్యాకర్లు అనేక రకాల పద్ధతులు అవలంభిస్తారు. అన్నిటికన్నా సులభమైనది.. ఫిషింగ్‌ ఎటాక్‌! యూట్యూబ్‌ సంస్థ పంపించినట్లు ఒక ఫిషింగ్‌ మెయిల్‌ని తాము టార్గెట్‌ చేసి ఛానెల్‌ క్రియేటర్‌కి పంపిస్తారు. నిజంగానే యూట్యూబ్‌ పంపించిందని భావించి వారు దాన్ని క్లిక్‌ చేసి, తమ యూజర్‌నేమ్‌, పాస్‌వర్డ్‌ ఎంటర్‌ చేస్తారు. దాంతో ఆ అకౌంట్‌ పూర్తిగా హ్యాకర్‌ చేతిలోకి వెళ్లిపోతుంది. అయితే యూజర్లలో అధిక శాతం మందికి రెండంచెల అథంటికేషన్‌ అమర్చుకోవాలన్న కనీస స్పృహ లేకపోవడం హ్యాకర్ల పాలిట వరంగా మారుతోంది.


2 స్టెప్‌ అథంటికేషన్‌ సెట్‌ చేసి ఉన్న అకౌంట్లని కూడా సెషన్‌ మొత్తాన్ని హైజాక్‌ చేసే కొన్ని పద్ధతుల ద్వారా హ్యాకర్లు దొంగిలిస్తున్నారు. ఫిషింగ్‌ తర్వాత ‘క్రాస్‌సైట్‌ స్ర్కిప్టింగ్‌’ అనే పద్ధతి ద్వారా యూజర్లు పైరేటెడ్‌, పోర్న్‌సైట్లని సందర్శించినప్పుడు, ఒక ప్రమాదకరమైన కోడ్‌ని జొప్పించి, అప్పటికే బ్రౌజర్‌లో లాగిన్‌ అయిన కుకీలను దొంగిలించి అకౌంట్లని సొంతం చేసుకుంటారు. అందుకే యూట్యూబ్‌ అకౌంట్‌ కలిగినవారు పోర్న్‌ సైట్లు చూడడం, పైరేటెడ్‌ సాఫ్ట్‌వేర్‌ డౌన్‌లోడ్‌ చేసుకోవడం వంటి ప్రలోభాలకు దూరంగా ఉండడం మంచిది.


డబ్బు ఆశ చూపి!

ఇటీవల మరికొన్ని రకాల సోషల్‌ ఇంజనీరింగ్‌ పద్ధతుల ద్వారా యూట్యూబ్‌ అకౌంట్లని హ్యాక్‌ చేస్తున్నారు. ‘మేము ఫలానా డిజిటల్‌ అడ్వర్‌టైజింగ్‌ సంస్థ నుంచి మెసేజ్‌ చేస్తున్నాం. మీ ఛానల్‌ మాకు బాగా నచ్చింది. మీ ఛానెల్‌లో మేము సూచించిన ప్రకటనలు వేస్తే మీకు 500 డాలర్ల వరకూ చెల్లిస్తాం’ అంటూ మీకు మెయిల్‌ వస్తుంది. ఇలాంటి మోసాల పట్ల అవగాహన లేని చాలామంది రెండో ఆలోచన లేకుండా ఓకే చెప్పేస్తారు. వారు చెప్పిన ప్రకారం వారికి తమ అకౌంట్‌ నిర్వహణకు అనుమతిస్తారు. అంతే, యూట్యూబ్‌ అకౌంట్‌ పూర్తిగా హ్యాకర్ల ఆధీనంలోకి వెళ్లిపోతుంది. ఇలాంటి మోసాలు ఇటీవల బాగా ఎక్కువ అయ్యాయి కాబట్టి అదనంగా డబ్బు వస్తుందని ఆశపడి అకౌంట్లని పోగొట్టుకోకండి.


మీరు మీ ప్రతిభ, సృజనాత్మకతతో నిర్వహిస్తున్న యూట్యూబ్‌ ఛానల్‌ హ్యాక్‌ అయితే చెప్పలేనంత బాధగా ఉంటుంది. కాబట్టి, సాధ్యమైనంత వరకు అన్ని భద్రతా జాగ్రత్తలు తీసుకుని మీ అకౌంట్‌ సురక్షితంగా ఉంచుకోండి.


ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?

మోనిటైజేషన్‌ ఎనేబుల్‌ చెయ్యని చిన్నచిన్న అకౌంట్లను హ్యాకర్లు అసలు పట్టించుకోరు. ఎప్పుడైతే మీకు మోనిటైజేషన్‌ ఎనేబుల్‌ అవుతుందో, అలాగే భారీ సంఖ్యలో చందాదారులు ఉంటారో హ్యాకర్ల కన్ను నిరంతరం మీ మీద ఉంటుంది. కాబట్టి మీ యూట్యూబ్‌ అకౌంట్‌ లాగిన్‌ అయి ఉన్న కంప్యూటర్‌లో వీలైనంతవరకు వైరస్‌లు, ట్రోజాన్‌, కీలాగర్లు లాంటివి లేకుండా చూసుకోండి. పెయిడ్‌ ఇంటర్నెట్‌ సెక్యూరిటీ సూట్‌ వాడండి. అలాగే ప్రమాదకరమైన సైట్ల జోలికి ఎట్టి పరిస్థితుల్లో వెళ్లవద్దు. ఇంటర్నెట్‌లో ఏమైనా అప్లికేషన్స్‌ మీ జీమెయిల్‌, యూట్యూబ్‌ అకౌంట్లకి యాక్సెస్‌ కల్పించమని కోరితే అప్రమత్తంగా ఉండండి. మీ మెయిల్‌కి యూట్యూబ్‌, గూగుల్‌ నుంచి వచ్చినట్లు కనిపించే మెయిల్స్‌ అన్నింటినీ గుడ్డిగా నమ్మకండి. ‘బ్రాండ్‌ ప్రమోట్‌ చేసి పెట్టండి, మీకు డబ్బులు ఇస్తాం’ అని ఎవరైనా మీకు మెయిల్‌ పెడితే ఆచితూచి వ్యవహరించండి. అలాగే మీ సబ్‌స్క్రయిబర్లతో కేవలం యూట్యూబ్‌ ద్వారానే కాకుండా ఫేస్‌బుక్‌, ట్విట్టర్‌ వంటి ఇతర సోషల్‌ మీడియా వేదికల ద్వారా కూడా కనెక్ట్‌ అయి ఉండేవిధంగా ఏర్పాటు చేసుకోండి. ఒకవేళ ఏ కారణం చేతైనా మీ యూట్యూబ్‌ అకౌంట్‌ హ్యాక్‌ అయితే మీ సబ్‌స్క్రయిబర్ల దృష్టికి తీసుకు వెళ్లడానికి ఆయా సామాజిక మాధ్యమాలు ఉపయోగపడతాయి. కావాలంటే కొత్త ఛానల్‌ మొదలు పెట్టి వారిని మళ్లీ సబ్‌స్క్రయిబ్‌ చేయమని సులభంగా కోరవచ్చు. 


-నల్లమోతు శ్రీధర్‌
fb.com/nallamothu sridhar

Updated Date - 2020-06-20T05:30:00+05:30 IST