జీవితం.. భద్రం

ABN , First Publish Date - 2022-08-13T05:03:40+05:30 IST

పెళ్లంటే.. నూరేళ్ల పంట అన్నారు పెద్దలు. వధూవరులకు సంబంధించి అటు ఏడు తరాలు.. ఇటు ఏడు తరాలు చూసి పెళ్లి సంబంధాలు ఖరారు చేసుకోవాలని పూర్వీకులు చెప్పేవారు. కానీ ప్రస్తుత ఆధునిక పోకడలో ఆన్‌లైన్‌ పెళ్లి సంబంధాలు అధికమవుతున్నాయి. మ్యారేజ్‌బ్యూరో మ్యాట్రీమనీలో పేర్లు నమోదు చేసుకుని.. సంబంధాలు కుదుర్చుకుంటున్నారు. ఈక్రమంలో కొంతమంది ప్రబుద్ధులు మోసాలకు పాల్పడుతున్నారు.

జీవితం.. భద్రం

ఆన్‌లైన్‌ మ్యారేజ్‌ బ్యూరోల సంబంధాలపై అప్రమత్తం

తప్పుడు సమాచారంతో పెళ్లిళ్లు చేసుకుంటున్న ప్రబుద్ధులు
(నరసన్నపేట)

పెళ్లంటే.. నూరేళ్ల పంట అన్నారు పెద్దలు. వధూవరులకు సంబంధించి అటు ఏడు తరాలు.. ఇటు ఏడు తరాలు చూసి పెళ్లి సంబంధాలు ఖరారు చేసుకోవాలని పూర్వీకులు చెప్పేవారు. కానీ ప్రస్తుత ఆధునిక పోకడలో ఆన్‌లైన్‌ పెళ్లి సంబంధాలు అధికమవుతున్నాయి. మ్యారేజ్‌బ్యూరో మ్యాట్రీమనీలో పేర్లు నమోదు చేసుకుని.. సంబంధాలు కుదుర్చుకుంటున్నారు. ఈక్రమంలో కొంతమంది ప్రబుద్ధులు మోసాలకు పాల్పడుతున్నారు. విదేశాల్లో ఉద్యోగమని నమ్మించడం.. ఇంతకుముందు పెళ్లయిన విషయం దాచడం.. వంటి తప్పుడు సమాచారంతో సంబంధాలు కుదుర్చుకుంటున్నారు. రూ.లక్షల్లో కట్నకానుకలు తీసుకుని పెళ్ళిళ్లు చేసుకుంటున్నారు. కొత్తూరు మండలం పారాపురానికి చెందిన ఓ యువతి ఆన్‌లైన్‌లో మ్యాట్రీమనీ ద్వారా సంబంధం కుదుర్చుకుని పెళ్లికి సిద్ధమవుతుండగా.. వరుడి మోసాలు బయటపడ్డాయి. బుధవారం ఈ ఘటన వెలుగుచూసింది.  నెల్లూరు జిల్లా ఉలవలపాడుకు చెందిన బడతల సాయిసందీప్‌.. మ్యాట్రీమనీ ద్వారా పారాపురానికి చెందిన యువతి ఫోన్‌ నెంబర్‌ సేకరించాడు.  ఆమెతో మాట్లాడి.. ఢిల్లీలోని స్పిన్‌ కంపెనీ ఉద్యోగిగా పరిచయం చేసుకున్నాడు. మంచి జీతభత్యాలుగా చెప్పుకొచ్చాడు. దీంతో ఇరు కుటుంబాల పెద్దలు ఈ నెల 11న వివాహం చేయాలని నిశ్చయించారు. వధువు బంధువు ఒకరు ఫేస్‌బుక్‌లో సాయిసందీప్‌ వివరాలు పరిశీలించగా.. ఆయనకు ఇంతకుముందే మరో అమ్మాయితో పెళ్లయిన విషయం బయటపడింది.  ఆ అమ్మాయితో వివాదం కారణంగా పోలీస్‌ కేసు కూడా నమోదైంది. పెళ్లికి ఒక్కరోజు ముందు ఈ విషయం తెలియడంతో.. యువతి సేఫ్‌గా బయటపడింది. మోసం చేసి వివాహం చేసుకోవడానికి ప్రయత్నించారంటూ వరుడిపై పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేసింది.  ఇలా ఎంతోమంది ఆన్‌లైన్‌ మ్యారేజ్‌బ్యూరోలో పెళ్లి సంబంధాల పేరిట తప్పుడు సమాచారంతో మోసాలకు పాల్పడుతున్నారు. అలాగే కొంతమంది మహిళలు కూడా సామాజిక మాధ్యమాల ద్వారా యువకులకు, సంపన్నులకు వల వేసి పెళ్లి చేసుకుంటున్నారు. పెళ్లయిన కొన్నిరోజుల తర్వాత నగలు, డబ్బులతో పరారవుతున్నారు. పెళ్లయిన తర్వాత ఇటువంటి మోసాలు బయటపడడంతో ఎంతోమంది విడిపోయి రోడ్డున పడుతున్నారు. ఈ నేపథ్యంలో ఆన్‌లైన్‌ మ్యారేజ్‌బ్యూరోలో సంబంధాలు కలుపుకొనే వారు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని మేధావులు  సూచిస్తున్నారు.

జాగ్రత్తలివీ..
- ఆన్‌లైన్‌ మ్యారేజ్‌బ్యూరో వెబ్‌సైట్లలో వధువు, వరుడుల ప్రొఫైల్‌ చూసి మోసపోవద్దు. వారు నమోదు చేసుకున్న వివరాలు కచ్చితమో కాదో నిర్ధారించుకోవాలి. చదువు, ఉద్యోగం, కులం వంటి వివరాలు తెలుసుకోవాలి.
- కొంతమంది విదేశాల్లో ఉద్యోగాలు చేస్తున్నామని, ఆర్థికంగా స్థితిమంతులమని ప్రకటనలు ఇస్తారు. అటువంటి వారి సామాజిక స్థాయి, అంతస్తును పరిశీలించి సంబంధాలు ఖరారు చేసుకోవాలి. స్థిరాస్తి డాక్యుమెంట్లు పరిశీలించుకోవాలి.
- నేర ప్రవృత్తి ఉందా? ఎన్నో పెళ్లి?.. పిల్లలు ఉన్నారా? తదితర వివరాలను పెళ్లికి ముందుగానే పరిశీలించుకోవాలి. కుటుంబ నేపథ్యం తెలుసుకోవాలి. ఎక్కడ ఉద్యోగం చేస్తున్నారో క్షేత్రస్థాయిలో ఆరా తీయాలి.
- కొంతమంది దీర్ఘకాలిక రోగాలు ఉన్నా.. బయటకు తెలియకుండా పెళ్లిళ్లు చేసుకుంటున్నారు. వరుడు, వధువులకు వైద్యపరీక్షలు చేయించి సంబంధాలు చేసుకోవాలి.  

అప్రమత్తం అవసరం
జీవిత భాగస్వామి ఎంపిక సమయంలో అప్రమత్తంగా వ్యవహరించాలి. ఆన్‌లైన్‌లోని మ్యారేజ్‌బ్యూరో సంబంధాలు కలుపుకునేటప్పుడు కుటుంబ నేపథ్యం తెలుసుకోవాలి. కుటుంబ పెద్దలు చూసిన వివాహాలు చేసుకోవడం ఉత్తమం.
- ఎంఆర్‌ జ్యోతిఫెడ్రరిక్‌, రిటైర్డు ప్రిన్సిపాల్‌, సామాజిక కార్యకర్త

రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలి
సామాజిక మాధ్యమాల పరిచయాలతో కొందరు పెళ్లిళ్లు చేసుకుంటున్నారు. కొన్నాళ్ల తరువాత  కట్టుకున్న వారిని వదిలి వెళ్లిపోతున్నారు. ఇలాంటివి జరగకుండా పెళ్లిళ్లు చేసుకునే సమయంలో వెంటనే రిజిస్ట్రేషన్‌ చేసుకుంటే కొంతవరకు మోసాలను అరికట్టవచ్చును. పెళ్లి రిజిస్ర్టేషన్‌ అయితే.. రెండో పెళ్లి చేసుకున్నా.. ఆధార్‌ నెంబర్‌ ఆధారంగా తెలుస్తుంది.  
- గొండు సత్యనారాయణ, న్యాయవాది, నరసన్నపేట

పరిశీలించుకోవాలి
కొంతమంది సామాజిక మాధ్యమాల్లో మాయమాటలు చెప్పి.. పెళ్లి పేరిట దోచుకుంటారు. ఈ నేపథ్యంలో తెలిసిన మధ్యవర్తుల ద్వారా వివరాలు పూర్తిస్థాయిలో పరిశీలించాకే సంబంధాలను కుదుర్చుకోవాలి. మ్యారేజ్‌బ్యూరోలకు ప్రభుత్వ అనుమతి ఉందో లేదో చూసుకోవాలి.
- తిరుపతి, సీఐ, నరసన్నపేట




 

 

Updated Date - 2022-08-13T05:03:40+05:30 IST