డెంగ్యూతో జాగ్రత్త

ABN , First Publish Date - 2022-05-16T04:42:54+05:30 IST

ప్రజలను వణికిస్తున్న వ్యాధుల్లో డెంగ్యూ ఒకటి. పగటి పూట కుట్టే దోమ కారణంగా ఇది వ్యాపిస్తుంది. వ్యాధి సోకిన వారిలో తలనొప్పి, నరాలు, కండరాల నొప్పి ఉంటుంది. రక్తంలో ప్లేట్‌లెట్స్‌ క్షీణిస్తాయి. ప్రమాదకరమైన ఈ వ్యాధి సోకకుండా జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.

డెంగ్యూతో జాగ్రత్త
నీటి గుంతలో జంబుగా చేపలను వదులుతున్న సిబ్బంది(ఫైల్‌)

- పగటి పూట కుట్టే దోమతో వ్యాధి

- పరిసరాలు, ఇంటిని శుభ్రంగా ఉంచుకోవాలి

- నేడు జాతీయ డెంగ్యూ నివారణ దినం 

నస్పూర్‌, మే 15: ప్రజలను వణికిస్తున్న వ్యాధుల్లో డెంగ్యూ ఒకటి. పగటి పూట కుట్టే దోమ కారణంగా ఇది వ్యాపిస్తుంది. వ్యాధి సోకిన వారిలో తలనొప్పి, నరాలు, కండరాల నొప్పి ఉంటుంది. రక్తంలో ప్లేట్‌లెట్స్‌ క్షీణిస్తాయి. ప్రమాదకరమైన ఈ వ్యాధి సోకకుండా జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. ఈ వ్యాధి వర్షాకాలంలో ఎక్కువగా వ్యాప్తి చెందుతుంది. నీటి నిల్వలు, అపపరిశుభ్ర వాతావరణంలో దోమలు వృద్ధి చెందుతాయి. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం ద్వారా వీటిని అరికట్టవచ్చు. డెంగ్యూ వ్యాధి ఏడీస్‌ ఈజిప్ట్‌ (టైగర్‌ దోమ) కాటు వేయడం మూలంగా వ్యాప్తి చెందుతుంది.  దోమ కుట్టిన ఐదు నుంచి 8 రోజుల్లో వ్యాధి లక్షణాలు కనిపిస్తాయి. ఈ వ్యాధిపై అవగాహన పెంచేందుకు యేటా మే 16న జాతీయ డెంగ్యూ నివారణ దినం నిర్వహిస్తారు. 

- జిల్లా వ్యాప్తంగా..

జిల్లా వ్యాప్తంగా 2020లో జిల్లా వ్యాప్తంగా 32 డెంగ్యూ పాజిటివ్‌ కేసులు నమోదు కాగా 2021 నాటికి 118కు చేరుకుంది. జిల్లాలో తాళ్లపేట ఆరోగ్య కేంద్రం మినహా మిగిలిన 20 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలల్లో గతేడాదిలో అధికంగా కేసులు నమోదయ్యాయి. దీంతో అప్రమత్తమైన ఆరోగ్య శాఖ ఆయా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలో పర్యటించి స్ర్పేలు చేయించడంతో పాటు నీటి గుంతల్లో జంబుగ చేప పిల్లలను వదిలారు. గిరిజన ప్రాంతాల్లో దోమ తెరలను పంపిణీ, కర పత్రాల ద్వారా ప్రచారం తదితర కార్యక్రమాలను చేపట్టారు. 2021లో జన్నారం-6, అంగ్రాజుపల్లి-12, వేమనపల్లి -8, రాజీవ్‌నగర్‌-10, నస్పూర్‌-15, వెంకట్రావు పేట-4, హాజీపూర్‌-15, పాత మంచిర్యాల-12, మందమర్రి-5, భీమిని-7, కోటపల్లి-1, జైపూర్‌-5, కుందారం-2, తాండూరు-4, నెన్నెల-2, తాళ్ళగురిజాల-1, కాసీపేట-2, షంశీర్‌నగర్‌-3, దండేపల్లి-2, దీపక్‌నగర్‌-2 డెంగ్యూ కేసులు నమోదైయ్యాయి. 2022 లో ఇప్పటి వరకు అంగ్రాజుపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో ఒక కేసు నమోదైయింది. వైద్య ఆరోగ్య సిబ్బంది జ్వర సర్వేలు, వైద్య శిబిరాలను ఏర్పాటు చేసి పాజిటివ్‌ కేసులు వచ్చిన ప్రాంతాల్లో చు ట్టూ ప్రక్కల ఇళ్ళకు చెందిన వారికి పరీక్షలు చేసి వ్యాధి వ్యాప్తిని అరికట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. 

- వ్యాధి లక్షణాలు.

హఠాత్తుగా తీవ్ర జ్వరంతో మొదలవుతుంది. కాళ్లు కదిలించలేని పరిస్థితి ఏర్పడుతుంది. ఎముకలు కండరాల్లో భరించలేని నొప్పి, శరీరంపై పొక్కులు వస్తాయి. వాంతులు, వికారం, రక్తంతో కూడిన మల విసర్జన అవుతుంది. ఒక్కసారి వచ్చిన జ్వరం 7 నుంచి 10 రోజులకు మళ్లీ తిరుగబెడుతుంది. డెంగ్యూ బారిన పడిన వారు సమీపంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో చికిత్స చేయించుకోవాలి. డెంగ్యూ వ్యాధి నిర్ధారణకు మాక్‌ ఎలీసా పరీక్ష చేస్తారు. 

- ఇలా చేద్దాం..

డెంగ్యూ వ్యాధి నివారణకు అందరూ కలిసి కట్టుగా బాధ్యతగా వ్యవహరించాలి. ప్రతి ఒక్కరూ ఇంటి చుట్టూ నీరు నిల్వ కాకుండా చూసుకోవాలి. నిల్వ ఉన్న నీటిలో దోమలు తొందరగా వృద్ధి చెందుతాయి. మురుగు కాలువల నీరు ఎప్పటికప్పుడు ప్రవహించే విధంగా చూడాలి. మురుగు నీటి గుంతలు లేకుండా చేయాలి. వారానికి ఒక్క సారి ఇంటిలోని కూలర్లు,పూల తొట్టిలు, ఇతర నీటి పాత్రలను శుభ్రం చేయాలి. తాగి పారేసిన కొబ్బరి బొండాలను చెత్త కుండీల్లో వేయాలి. పాత టైర్లు, డబ్బాలు, ప్లాస్టిక్‌ కప్పులు, ఖాళీ పాత్రలుఇంటి పరసరాల్లో లేకుండా జాగ్రత్త పడాలి. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో నివాస ప్రాంతాల్లో చెత్తాచెదారం పేరుకుపోకుండా ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలి. దీనితో పాటు ఇంటి కిటికిలు, తులపులు ద్వారాలకు దోమలు లోపలికి రాకుండా జాలీలు ఏర్పాటు చేసుకోవాలి. ఇంటిలో దోమ తెరలను వినియోగించడం, మాస్కిటో కాయిల్స్‌, జెట్‌ బిల్లలను కాల్చడం రాత్రి వేళల్లో చేయాలి. 

- ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాం...

డాక్టర్‌ అనిత, జాతీయ కీటక జనిత వ్యాధుల నియంత్రణ ప్రోగ్రాం అధికారి

జిల్లాలో డెంగ్యూ పాజిటివ్‌ కేసుల నమోదుపై ఆరా తీసి ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాం. గతేడాదిలో ఎక్కువ కేసులు నమోదు అయ్యాయి. వ్యాధిని నివారిం చేందుకు దోమ తెరలను కూడా పంపిణీ చేశాం. డెంగ్యూ వ్యాధి నివారణకు అందరూ కలిసి వచ్చి నియంత్రణకు కృషి చేయాలి. నస్పూర్‌, హాజీపూర్‌, మంచిర్యాలలో  గత సంవత్సరం ఎక్కువ కేసులు నమోదు వచ్చాయి. డెంగ్యూ నిర్ధారణ పరీక్ష మంచిర్యాల ప్రభుత్వాసుపత్రిలో నిర్వహిస్తున్నాం.

Updated Date - 2022-05-16T04:42:54+05:30 IST