కరోనా లింకులతో జర జాగ్రత్త!

ABN , First Publish Date - 2020-04-11T09:19:03+05:30 IST

కరోనా భయాన్ని ఆసరాగా చేసుకొని సైబర్‌ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. వాట్సప్‌, ఫేస్‌బుక్‌, ఇ-మెయిల్‌ ద్వారా ఫిషింగ్‌ లింకులు పంపిస్తూ ఖాతాలు కొల్లగొడుతున్నారు. లాక్‌డౌన్‌ సమయంలో ఎక్కువ మంది

కరోనా లింకులతో జర జాగ్రత్త!

కరోనా భయాన్ని ఆసరాగా చేసుకొని సైబర్‌ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. వాట్సప్‌, ఫేస్‌బుక్‌, ఇ-మెయిల్‌ ద్వారా ఫిషింగ్‌ లింకులు పంపిస్తూ ఖాతాలు కొల్లగొడుతున్నారు. లాక్‌డౌన్‌ సమయంలో ఎక్కువ మంది ఫోన్‌, కంప్యూటర్‌ మీద గడుపుతుండటంతో సైబర్‌ నేరగాళ్ల పని సులువవుతోంది. సైబర్‌ నేరగాళ్ల ఉచ్చులో పడకుండా ఉండాలంటే ఆ నేరాల గురించి తెలుసుకొని ఉండాలి.


రిలయన్స్‌ జియో సంస్థ రోజుకి 25 జిబి మొబైల్‌ డేటా, ఆరు నెలలపాటు ఉచిత ఫోన్‌కాల్స్‌ను అందిస్తోంది. అలాగే 498 రూపాయల విలువైన ఉచిత రీఛార్జ్‌ను జియో అందిస్తోంది. ఆఫర్‌ను యాక్టివేట్‌ చేసుకోవాలంటే ఈ లింక్‌ క్లిక్‌ చేయండి అంటూ ఒక మెసేజ్‌ వాట్సాప్‌లో సర్క్యులేట్‌ అవుతోంది. ఎట్టి పరిస్థితుల్లో దాన్ని క్లిక్‌ చేయకండి. పొరపాటున క్లిక్‌ చేస్తే, ‘ప్రైమ్‌ ఆఫర్స్‌.ఎపికె’ పేరుతో ఒక ఆండ్రాయిడ్‌ అప్లికేషన్‌ డౌన్‌లోడ్‌ చేసుకొమ్మని సందేశం వస్తుంది. దాన్ని ఇన్‌స్టాల్‌ చేస్తే మీ ఫోన్‌ పూర్తిగా హ్యాకర్‌ కంట్రోల్‌లోకి వెళుతుంది. మీకు తెలియకుండానే మీ ఫోన్‌లో ఫోటోలు, వీడియోలు చూడడంతో పాటు, మీరు ఎవరితో మాట్లాడుతున్నారు, ఎప్పటికప్పుడు మీ లొకేషన్‌, మైక్రోఫోన్‌ యాక్సెస్‌ వంటివన్నీ హ్యాకర్‌ నియంత్రణలోకి వెళ్తాయి. రిలయన్స్‌ జియో సంస్థ నిజంగా అలాంటి ఆఫర్‌ ఏదైనా అందిస్తే, అధికారికంగా తన ‘మై జియో’ యాప్‌లో తెలియజేస్తుంది.


ఈఎంఐల గురించి ఫోన్‌ కాల్‌ వచ్చిందా?

బ్యాంకుల నుంచి వివిధ రకాల లోన్లు తీసుకున్న వారికి, క్రెడిట్‌ కార్డు కలిగి ఉన్నవారికి ఇటీవల కేంద్ర ప్రభుత్వం మూడు నెలలపాటు వాయిదాలు చెల్లించే అవసరం లేదని ప్రకటించింది. సరిగ్గా దీన్ని ఆసరాగా చేసుకొని సైబర్‌ నేరగాళ్లు వల పన్నుతున్నారు. బ్యాంకు ప్రతినిఽధులుగా ఫోన్లు చేస్తున్నారు. మీకు నమ్మకం కలగడం కోసం గతంలో వివిధ పద్ధతుల ద్వారా సేకరించిన మీ బ్యాంకు ఖాతా లేదా మీ క్రెడిట్‌ కార్డ్‌ వివరాలను చెబుతారు. ఈఎంఐ వాయిదా వేయాలంటే యాక్టివేట్‌ చేసుకోవాలి అని కబుర్లు చెబుతారు. అప్పటికే తన దగ్గర మీ బ్యాంక్‌ అకౌంట్‌కు సంబంధించి ఉన్న వివరాల ద్వారా మీ అకౌంట్లో నుంచి డబ్బులు కాజేయడానికి ఫ్రాడ్‌ లావాదేవీ మొదలుపెట్టి, ‘మీకు ఇప్పుడు ఒక ఓటిపి వస్తుంది’. దానిని తెలియజేయండి అంటాడు. ఈఎంఐ గురించి ఆలోచిస్తున్న మీరు ఏ మాత్రం రెండో ఆలోచన లేకుండా అతను కోరినట్లు ఓటీపి చెబుతారు. అంతే క్షణాల్లో, మీ అకౌంట్లో నుంచి భారీ మొత్తంలో డబ్బులు మాయమవుతాయి.


నెట్‌ఫ్లిక్స్‌ ఉచితమా?

నెట్‌ఫ్లిక్స్‌ పేరుతో మరో అసత్య ప్రచారం జరుగుతోంది. సెల్ఫ్‌ క్వారంటైన్‌లో ఉంటున్న వారి కోసం నెట్‌ఫ్లిక్స్‌ కొన్ని ఉచిత పాసులు అందిస్తున్నట్లుగా హ్యాకర్లు నమ్మిస్తున్నారు. చాలామంది తెలిసీ తెలియక అమాయకంగా ఇలాంటి లింకులు క్లిక్‌ చేస్తున్నారు. ఇది పూర్తిగా ప్రమాదకరమైన మెసేజ్‌. దీన్ని క్లిక్‌ చేస్తే మరో పది మందికి షేర్‌ చెయ్యమనీ, ఆ తర్వాత మీ నెట్‌ఫ్లిక్స్‌ అకౌంట్‌లోకి లాగిన్‌ అయితే ఆఫర్‌ యాక్టివేట్‌ అవుతుందని చూపిస్తుంది. ఒకవేళ పొరపాటున మీరు మీ యూజర్‌నేమ్‌, పాస్‌వర్డ్‌ ఎంటర్‌ చేస్తే మీఅకౌంట్‌ని హ్యాకర్‌ చేజిక్కించుకుంటాడు. ఒకవేళ మీ అకౌంట్‌కి క్రెడిట్‌ కార్డ్‌ లింక్‌ చేసి ఉంటే దానిని వాడే ప్రమాదం కూడా ఉంది.


మందులు సరఫరా చేస్తామంటూ...

లాక్‌డౌన్‌ను ఆసరాగా చేసుకుని నేరుగా మీ ఇంటికే కావలసిన మెడిసిన్స్‌ సప్లై చేస్తామంటూ, నకిలీ వెబ్‌సైట్లు సృష్టించి, ఆర్డర్లు, పేమెంట్స్‌ స్వీకరిస్తూ ఆ తర్వాత పత్తా లేకుండా పోతున్నారు. అలాగే ఇంటికే లిక్కర్‌ సప్లై చేస్తామంటూ డబ్బులు వసూలుచేసి మాయమవు తున్నారు. మరికొంతమంది ఆన్‌లైన్‌లో ఆర్డర్‌ చేస్తే కూరగాయలు, అవసరమైన సరుకులు సప్లై చేస్తామనీ మోసాలకు పాల్పడుతున్నారు.


ప్రధాని డబ్బులు ఇస్తున్నాడు అంటూ...

కరోనా వైరస్‌తో ఇబ్బందిపడుతున్న ప్రజానీకానికి ప్రధాని నేరుగా వారి అకౌంట్లలోకి డబ్బులు వేస్తున్నాడు. వాటిని క్లెయిమ్‌ చేసుకోవాలంటే ఈ లింక్‌ క్లిక్‌ చేయండి అంటూ కూడా కొన్ని ఫిషింగ్‌ లింకులు చలామణి అవుతున్నాయి. వాస్తవానికి ప్రధానమంత్రి జన్‌ ధన్‌ యోజన పథకంలో భాగంగా ఉన్న 15.65 కోట్ల మంది మహిళలకు మాత్రమే ఒక్కొకరి అకౌంట్లో 500 రూపాయల చొప్పున మూడు నెలలపాటు జమ చేయబడుతుంది. అది నేరుగా సంబంధిత అకౌంట్లలోకి వెళుతుంది గానీ ఇలాంటి లింకులు క్లిక్‌ చెయ్యకూడదు.


రాన్‌సంవేర్‌ ప్రమాదం

హాస్పిటల్స్‌ని టార్గెట్‌గా చేసుకుని హ్యాకర్లు వాటి కంప్యూటర్లు, నెట్‌వర్క్‌లలో రాన్‌సంవేర్లు జొప్పిస్తున్నారు. వరల్డ్‌ హెల్త్‌ ఆర్గనైజేషన్‌, కేంద్ర ప్రభుత్వం నుంచి తాజా ఆదేశాలు అంటూ వివిధ హాస్పిటల్స్‌ సిబ్బందికి అటాచ్మెంట్‌లతో కూడిన మెయిల్స్‌ పంపిస్తున్నారు. వారు వాటిని క్లిక్‌ చేసిన వెంటనే హాస్పిటల్‌ కంప్యూటర్లోకి రాన్‌సంవేర్‌ రావడం జరుగుతోంది. దీంతో పేషెంట్‌ రికార్డులు, ఇతర కీలకమైన డాక్యుమెంట్లు, మొత్తం డేటా ఎన్‌క్రిప్ట్‌ అవుతుంది. ఆ డేటా తిరిగి పొందాలంటే హాస్పిటల్స్‌ భారీ మొత్తంలో బిట్‌కాయిన్ల రూపంలో చెల్లించాలని డిమాండ్‌ చేస్తున్నారు.


నకిలీ అప్లికేషన్లు

ఫోన్లో ఉన్న కెమెరాతో స్కాన్‌ చేస్తే మీకు కరోనా ఉందో లేదో తెలుసుకోవచ్చు! అంటూ కొన్ని యాప్స్‌ కనిపిస్తున్నాయి. మీకు దగ్గరలో కరోనా వ్యక్తి ఎవరైనా ఉన్నారేమో ఇలా తెలుసుకోండి! అంటూ మరికొన్ని యాప్స్‌ దర్శనమిస్తున్నాయి. వీటిలో చాలా వరకు అన్ని రకాల పర్మిషన్లు తీసుకుని యూజర్ల డేటాను దొంగలిస్తున్నాయి. కాబట్టి అలాంటి వాటి పట్ల జాగ్రత్తగా ఉండండి. 


నల్లమోతు శ్రీధర్‌

fb.com/nallamothusridhar

Updated Date - 2020-04-11T09:19:03+05:30 IST