కాంగ్రెస్‌ దీక్ష భగ్నం

ABN , First Publish Date - 2020-06-03T09:30:02+05:30 IST

పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు సాధన కోసం కాంగ్రెస్‌ పార్టీ చేపట్టిన దీక్షను పోలీసులు భగ్నం చేశారు.

కాంగ్రెస్‌ దీక్ష భగ్నం

రేవంత్‌రెడ్డి, కొండా, టీఆర్‌ఆర్‌ల అరెస్ట్‌ 

కార్యకర్తలు, పోలీసుల మధ్య తోపులాట 

పరిస్థితి ఉద్రిక్తం


కొడంగల్‌ / పరిగి / షాద్‌నగర్‌/చౌదరిగూడ : పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు సాధన కోసం కాంగ్రెస్‌ పార్టీ చేపట్టిన దీక్షను పోలీసులు భగ్నం చేశారు. మంగళవారం రంగారెడ్డి జిల్లా చౌదరిగూడ మండలం కేపీ లక్ష్మీదేవిపల్లి దగ్గర ఒక దీక్ష చేపట్టాలని కాంగ్రెస్‌ పార్టీ అధిష్ఠానం నిర్ణయించిన సంగతి విధితమే. కాంగ్రెస్‌ నాయకులంతా మంగళవారం తరలివెళ్లాల్సి ఉండగా.. పోలీసులు ఎక్కడివారిని అక్కడే అరెస్ట్‌ చేశారు. దీంతో రంగారెడ్డి, వికారాబాద్‌ జిల్లాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.


రేవంత్‌రెడ్డి అరెస్ట్‌.. పరిస్థితి ఉద్రిక్తం

 రంగారెడ్డి జిల్లా లక్ష్మీదేవర్‌పల్లి దగ్గర కృష్ణా జలాల పరిరక్షణ కోసం తలపెట్టిన నిరాహార దీక్షకు మంగళవారం కొడంగల్‌ నుంచి వెళ్లడానికి సిద్ధమైన రేవంత్‌రెడ్డిని పోలీసులు హౌజ్‌అరెస్టు చేశారు. జిల్లా అడిషనల్‌ ఎస్పీ రషీద్‌ ఆధ్వర్యంలో పోలీసు బలగాలు రేవంత్‌రెడ్డి ఇంటిని చుట్టుముట్టాయి. ఎంపీని అరెస్టు చేసేందుకు పోలీసులు ప్రయత్నించగా.. విషయం తెలుసుకున్న కాంగ్రెస్‌ నాయకులు, కార్యకర్తలు పెద్దఎత్తున రేవంత్‌రెడ్డి ఇంటికి చేరుకున్నారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు రేవంత్‌రెడ్డిని అరెస్టు చేసి పోలీసు వాహనంలో ఎక్కించారు. ఈక్రమంలో కార్యకర్తలకు పోలీసుల మధ్య తోపులాట జరగడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. వాహనం ముందుకు వెళ్లకుండా కార్యకర్తలు అడ్డుకోవడంతో స్వల్ప లాఠీచార్జికి దారి తీసింది. పోలీసు బలగాల మధ్య రేవంత్‌రెడ్డిని కుల్కచర్ల పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. తమ నాయకుడిని అన్యాయంగా అరెస్టు చేశారంటూ కార్యకర్తలు కొడంగల్‌లో ఆందోళనకు దిగారు. 


పరిగిలో కొండా, టీఆర్‌ఆర్‌ల అరెస్ట్‌

కాంగ్రెస్‌ పార్టీ చేపట్టిన దీక్షకు వెళ్లకుండా నేతలను ఎక్కడివారిని అక్కడే అరెస్ట్‌ చేశారు. పరిగి డీఎస్పీ శ్రీనివాస్‌ ఆధ్వర్యంలో తెల్లవారుజామున పరిగిలోని డీసీసీ అధ్యక్షుడు రామ్మోహన్‌రెడ్డి నివాసగృహాన్ని పోలీసు దిగ్బంధించారు. చేవెళ్ళ మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి కూడా ఒకరోజు ముందుగానే పరిగికి చేరుకున్నారు. పోలీసులు కొండా, టీఆర్‌ఆర్‌లను గృహనిర్బంధం చేయడంతో ఇంట్లోనే దీక్ష చేపట్టాలని నిర్ణయించారు. నిరసన దీక్షలో కూర్చునే ప్రయత్నం చేస్తున్న వారిని పోలీసులు చుట్టుముట్టారు. అరెస్ట్‌ చేడానికి యత్నిస్తుండగా పార్టీ శ్రేణులకు, పోలీసులకు వాగ్వాదం జరిగింది. వారెంట్‌ లేకుండా ఇంట్లోకి వచ్చి ఎలా అరెస్ట్‌ చేస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు.


అయినా డీఎస్పీ శ్రీనివాస్‌, సీఐ లక్ష్మీరెడ్డి ప్యూహం ప్రకారం ఇద్దరిని అరెస్ట్‌ చేసి చన్‌గోముల్‌ స్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, డీసీసీ అధ్యక్షుడు రామ్మోహన్‌రెడ్డిలు మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వం ప్రవర్తిస్తున్న తీరు అప్రజాస్వామికమని విమర్శించారు. పోతిరెడ్డిపాడు ద్వారా నీటిపి ఏపీ దోచుకుపోతుంటే తెలంగాణ సర్కారు చూసి మిన్నకుండిపోతుందని ఆరోపించారు. ప్రజాస్వామ్య బద్దంగా నిరసన చేస్తుంటే, అడ్డుకోవడం విడ్డూరంగా ఉందన్నారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు సాధించే వరకు పోరాటం చేస్తామని వారు స్పష్టం చేశారు.


కేసీఆర్‌ది నియంత పాలన

కేసీఆర్‌ నియంత పాలన కొనసాగిస్తున్నారని, ఉత్తర తెలంగాణలో ప్రాజెక్టుల నిర్మాణాలు కొనసాగిస్తూ.. దక్షిణ తెలంగాణను విస్మరిస్తు న్నారని షాద్‌నగర్‌ నియోజకవర్గ కాంగ్రెస్‌ పార్టీ ఇన్‌చార్జి వీర్లపల్లి శంకర్‌ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం నాడు పెండింగ్‌ ప్రాజెక్టుల నిర్మాణ స్థలాల్లో ఒకరోజు దీక్ష చేపట్టాలని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పిలుపునిచ్చారు. ఈమేరకు మంగళవారం శంకర్‌ నాయకత్వంలో కాంగ్రెస్‌ నాయ కులు, కార్యకర్తలు పెద్దఎత్తున జిల్లేడ్‌-చౌదరిగూడ మండలంలోని లక్ష్మీదేవిపల్లి సమీపంలో చేపట్టాల్సిన రిజర్వాయర్‌ నిర్మాణ స్థలం వద్ద ఆందోళన నిర్వహించారు.


అనంతరం షాద్‌నగర్‌ ఏసీపీ సురేం దర్‌ అక్కడికి చేరుకుని కరోనా విస్తరిస్తున్న సమయంలో ఆందోళ నలు చేయొద్దని, దీక్ష విరమించాలని నచ్చజెప్పారు. దీంతో కాంగ్రెస్‌ నాయకులు పెద్ద ఎత్తున నినాదాలు చేయడంతో వారిని అరెస్టు చేసి షాబాద్‌ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఆందోళన కార్యక్రమంలో టీపీసీసీ సభ్యుడు బాబర్‌ఖాన్‌, కృష్ణారెడ్డి, జె. సుదర్శన్‌గౌడ్‌, జి. బాల్‌రాజ్‌గౌడ్‌, పురుషోత్తంరెడ్డి, జితెందర్‌రెడ్డి, సిద్దార్థ, శ్రీకాంత్‌రెడ్డి, కె. చెన్నయ్య, చంద్రశేఖర్‌, ఖదీర్‌, విఠల్‌, కొమ్ము కృష్ణ, జంగ కృష్ణ, సీతయ్య, అశోక్‌, సత్తయ్య పాల్గొన్నారు.

Updated Date - 2020-06-03T09:30:02+05:30 IST