Dubai లో మ్యాచ్‌.. Hyderabad లో బెట్టింగ్‌.. అతనో ‘మహా’.. తెలుగు రాష్ట్రాల్లో అతడే కీలకం.. Google కు లేఖ

ABN , First Publish Date - 2021-09-30T17:33:12+05:30 IST

దుబాయ్‌లో జరుగుతున్న ఐపీఎల్‌ - 2021 క్రికెట్‌ మ్యాచ్‌లపై ...

Dubai లో మ్యాచ్‌.. Hyderabad లో బెట్టింగ్‌.. అతనో ‘మహా’.. తెలుగు రాష్ట్రాల్లో అతడే కీలకం.. Google కు లేఖ

  • ఆన్‌లైన్‌ క్రికెట్‌ బెట్టింగ్‌ ముఠా అరెస్ట్‌ 
  • సైబరాబాద్‌లో ఏక కాలంలో ఏడు చోట్ల దాడులు
  • 23 మందిని అరెస్టు చేసిన ఎస్‌వోటీ పోలీసులు
  • రూ. 93 లక్షల నగదు, ఐదు కార్లు సహా..
  • రూ. 2.21 కోట్ల సొత్తు స్వాధీనం
  • బెట్టింగ్‌లో విద్యార్థులే అధికం

హైదరాబాద్‌ సిటీ : దుబాయ్‌లో జరుగుతున్న ఐపీఎల్‌ - 2021 క్రికెట్‌ మ్యాచ్‌లపై నగరంలో పందెంలు కాస్తున్న ఆన్‌లైన్‌ క్రికెట్‌ బెట్టింగ్‌ ముఠా ఆటకట్టించారు సైబరాబాద్‌ పోలీసులు. విశ్వసనీయ సమాచారం అందుకున్న మాదాపూర్‌ పోలీసులు ఏకకాలంలో ఏడు చోట్ల దాడులు నిర్వహించారు. మొత్తం 23 మందిని అరెస్టు చేసి కటకటాల్లోకి నెట్టారు. వారి నుంచి రూ. 93 లక్షల నగదు, 14 బెట్టింగ్‌ బోర్డులు, 8 ల్యాప్‌టా్‌పలు, 247 మొబైల్‌ ఫోన్స్‌, 28 స్మార్ట్‌ ఫోన్లు, 4 ట్యాబ్‌లు, 4 టీవీలు, 2 రూటర్లు, ఓ ప్రింటర్‌, 5 కార్లు సహా మొత్తం రూ. 2,21,65,000 సొత్తును స్వాధీనం చేసుకున్నారు. సైబరాబాద్‌ కమిషనరేట్‌లో సీపీ స్టీఫెన్‌ రవీంద్ర బుధవారం మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఈ వివరాలు వెల్లడించారు.


దుబాయ్‌లో మంగళవారం ముంబై వర్సెస్‌ పంజాబ్‌ ఐపీఎల్‌ మ్యాచ్‌ జరిగింది. ఈ నేపథ్యంలో పలు గ్యాంగ్‌లు వందల సంఖ్యలో యువకులను ఆకట్టుకొని ఆన్‌లైన్‌లో క్రికెట్‌ బెట్టింగ్‌ నిర్వహిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. అదో పెద్ద రాకెట్‌ అని పోలీసులు గుర్తించారు. వెంటనే మాదాపూర్‌ ఎస్‌వోటీ పోలీసులు ఏడు టీమ్‌లుగా ఏర్పడ్డారు. మాదాపూర్‌ జోన్‌లోని మియాపూర్‌లో-1, బాచుపల్లిలో-3, గచ్చిబౌలి-2, శంషాబాద్‌ జోన్‌లోని మైలార్‌దేవ్‌పల్లిలో మొత్తం ఏడు ప్రాంతాల్లో ఏకకాలంలో దాడులు చేశారు. సబ్‌ ఆర్గనైజర్స్‌, బుకీలు, బోర్డు ఆపరేటర్స్‌, సబ్‌ బుకీలు సహా మొత్తం 23 మందిని అరెస్టు చేశారు.


తెలంగాణ, ఆంధ్రాలో అతనే కీలకం

అతనిపేరు మహా. ఊరు విజయవాడ. క్రికెట్‌ బెట్టింగ్‌లో ఆరితేరాడు. దేశంలోని ప్రధాన బెట్టింగ్‌ ఆర్గనైజర్స్‌తో సత్సంబంధాలున్నాయి. దాంతో ఆన్‌లైన్‌ బెట్టింగ్‌ల నిర్వహణలో ప్రధాన భూమిక పోషిస్తున్నాడు. ఎప్పుడు క్రికెట్‌ బెట్టింగ్‌లు జరిగినా మకాంను బెంగళూరుకు మారుస్తాడు. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లోని బుకీలకు బెట్టింగ్‌ లైన్స్‌ ప్రొవైడ్‌ చేస్తున్నదీ ఇతనే. బుధవారం సైబరాబాద్‌ పోలీసులు పట్టుకున్న అతిపెద్ద ఐపీఎల్‌  బెట్టింగ్‌ ముఠాలో ప్రధాన బుకీ ‘మహా’గా పోలీసులు గుర్తించారు. ఏ-1 నిందితుడు చింత వేణుకు బెట్టింగ్‌ లైన్స్‌ను ప్రొవైడ్‌ చేసింది మహానే. 


తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల్లో నిర్వహించే బెట్టింగ్‌ దందాలో మహా కీలక భూమిక పోషిస్తున్నట్లు ఎస్‌వోటీ పోలీసులు గుర్తించారు. ఒక్కో బెట్టింగ్‌ లైన్‌కు మహా రూ. లక్షలు తీసుకుంటాడు. ఒక్క క్రికెట్‌ మ్యాచ్‌ ముగిసే సమయానికి మహా సంపాదించే ఆదాయం అక్షరాలా రెండున్నర కోట్లు ఉంటుందని సైబరాబాద్‌ సీపీ స్టీఫెన్‌ రవీంద్ర వెల్లడించారు. అతని కోసం ఎస్‌వోటీ పోలీస్‌ బృందం గాలిస్తోంది. అతన్ని పట్టుకుంటే దేశ విదేశాల్లో క్రికెట్‌ బెట్టింగ్‌ నిర్వహిస్తున్న ప్రధాన ఆర్గనైజింగ్‌ ముఠాల ఆటకట్టించవచ్చని పోలీసులు భావిస్తున్నారు. మహా కోసం గట్టిగా గాలిస్తున్నారు.


నాలుగు అంచెలలో...

మొదటి అంచెలో బెట్టింగ్‌ ప్రధాన ఆర్గనైజర్‌ ఉంటాడు. రెండో అంచెలో సబ్‌బుకీస్‌, మూడవ అంచెలో బుకీస్‌, నాలుగో అంచెలో పంటర్స్‌ ఉంటారు. ప్రధాన ఆర్గనైజర్స్‌ నుంచి బుకీలకు బెట్టింగ్‌ లైన్‌ యాక్సెస్‌ ఇవ్వాలంటే రూ. 5లక్షలు చెల్లించాల్సి ఉంటుంది. ఒక్కో లైన్‌ నుంచి 30 మంది పంటర్స్‌తో ఏకకాలంలో బెట్టింగ్‌ నిర్వహించచ్చు. పంటర్స్‌ బంతి బంతికీ బెట్టింగ్‌లో పాల్గొనే అవకాశం ఉంటుంది. అక్కడ జరిగే బెట్టింగ్‌ కామెంట్‌ అంతా ఆన్‌లైన్‌లో పంటర్స్‌కు వినిపిస్తుంటారు. మారుతినగర్‌ మియాపూర్‌కు చెందిన చింత వేణు బుకీగా వ్యవహరిస్తున్నాడు. మొత్తం 5 లైన్‌లలో 120 మంది పంటర్స్‌తో హైదరాబాద్‌లో బెట్టింగ్‌ నిర్వహిస్తున్నాడు. ఒక్కో లైన్‌ బోర్డును ముగ్గురు ఆపరేట్‌ చేస్తుంటారు.


మరికొంత మంది ఆన్‌లైన్‌లో ఖాతాల్లో బెట్టింగ్‌ చెల్లింపులు (క్రెడిట్స్‌, డెబిట్స్‌) చూస్తుంటారు. కొందరు ఆఫ్‌లైన్‌లో డబ్బులు తీసుకోవడం, పంటర్లు గెలుచుకున్న డబ్బులను చెల్లించడం చేస్తుంటారు. ఇలా వేణు ముఠా ఒక్కో మ్యాచ్‌కు రూ. 20 - 25 లక్షలు కొల్లగొడుతున్నట్లు సీపీ స్టీఫెన్‌ వెల్లడించారు. ఈ ముఠా తన కార్యకలాపాలను ముంబై, గోవా, బెంగళూరు దుబాయ్‌ల్లో నిర్వహిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఏడేళ్లుగా క్రికెట్‌ బెట్టింగ్‌ నిర్వహిస్తున్న వేణుపై గతంలో కూడా గచ్చిబౌలి పరిధిలో కేసులు నమోదయ్యాయి. 


వేణు ముఠాలో అరెస్టయిన నిందితుల్లో సబ్‌ ఆర్గనైజర్‌ వదువు అజయ్‌ కుమార్‌, జెల్ల సురేష్‌, బోర్డు ఆపరేటర్‌ కూనప్పరెడ్డి దుర్గా పవన్‌కుమార్‌, తిరుమాని మణికంఠ, కొల్లాటి మణికంఠ, పి. శ్రీనివాస్‌, కొల్లాటి దుర్గాప్రసాద్‌, సబ్‌ బుకీ డి. సుందర రామన్‌ రాజ్‌, ల్యాప్‌టాప్‌ ఆపరేటర్‌ జయ శ్రీనివాస్‌, నాగళ్ల రాకేష్‌, సబ్‌ ఆర్గనైజర్‌ జమ్ము నాగరాజు, తురెళ్ల సా యి, బుకీ గోదావర్తి వెంకటేశ్‌, బోర్డు ఆపరేటర్‌ అట్లూరి రంజిత్‌కుమార్‌, కోట సాయి నవీన్‌, బొప్ప వెంకటేష్‌, గన్ని కళ్యాణ్‌, పత్తిపాటి రాము, సబ్‌ బుకీస్‌ ఈదర రవి, గన్ని రవితేజ, కామగాని సతీష్‌, మల్లికార్జున్‌ చారి ఉన్నారు. ప్రధాన బుకీ సహా మరో ఏడుగురు పరారీలో ఉన్నారు. బెట్టింగ్‌లో పాలుపంచుకుంటున్న వీరందరికి వారి వారి స్థాయిలో కమీషన్‌లు ఉంటాయి.


కుత్బుల్లాపూర్‌లో మరో ముఠా అరెస్ట్‌

క్రికెట్‌ బెట్టింగ్‌కు పాల్పడుతున్న ఓ ముఠాను షాపూర్‌నగర్‌ పోలీసులు పట్టుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం రాజస్థాన్‌కు చెందిన రామ్‌స్వరూప్‌ పరిహర్‌ కుత్బుల్లాపూర్‌ సమీపంలో జేకే ఫుట్‌వేర్‌ నిర్వహిస్తుంటాడు. ఆన్‌లైన్‌లో క్రికెట్‌ బెట్టింగ్‌ పాల్పడుతున్నాడనే సమాచారంతో ఆయన ఇంటిపై పోలీసులు దాడి చేశారు.  బుకీ రామ్‌స్వరూ్‌పతో పాటు మరో నలుగురు పంటర్లు దీపక్‌ తివారీ, అశోక్‌శర్మ, పవన్‌ చౌహాన్‌, భూమారెడ్డిలను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి రూ. 1,01,200 నగదును స్వాధీనం చేసుకున్నారు. 


గూగుల్‌కు లేఖ

ప్లేస్టోర్‌లో నిబంధనలకు విరుద్ధంగా ఉన్న  బెట్టింగ్‌ యాప్స్‌పై విచారణ చేస్తున్నామని సీపీ స్టీఫెన్‌ అన్నారు. వాటిని గుర్తించి ప్లేస్టోర్‌ నుంచి డిలీట్‌ చేయాల్సిందిగా గూగుల్‌కు లేఖలు రాస్తామన్నారు. వాటి వల్ల యువత బెట్టింగ్‌ల బారినపడి నష్టాల పాలవుతున్న విషయాన్ని ఆధారాలతో నిరూపిస్తామన్నారు. ఆన్‌లైన్‌ క్రికెట్‌ బెట్టింగ్‌లో ఎక్కువ మంది విద్యార్థులే చిక్కుకుంటున్నట్లు పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. 


యాప్స్‌లో బెట్టింగ్‌

క్రికెట్‌ బెట్టింగ్‌ను ప్రధాన ఆర్గనైజర్స్‌ ఆన్‌లైన్‌ యాప్స్‌ ద్వారా దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్నారు. ఫ్యాన్సీ లైఫ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌, లైవ్‌లైన్‌ గురూ, క్రికెట్‌ మజా, లోటస్‌, బెట్‌-365, బెట్‌ ఫెయిర్‌ యాప్స్‌లో ఆన్‌లైన్‌ బెట్టింగ్‌ నిర్వహిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ముందుగా రూ. 12 వేలు చెల్లించి యూసర్‌ ఐడీ, పాస్‌వర్డ్‌  పొంది యాప్‌లో రిజిస్టర్‌ చేసుకోవాల్సి ఉంటుంది. అప్పుడే ఆన్‌లైన్‌ బెట్టింగ్‌కు అవకాశం ఉంటుంది.

Updated Date - 2021-09-30T17:33:12+05:30 IST