బెట్టింగ్‌ జోరు.. యువత బేజారు!

ABN , First Publish Date - 2022-04-28T05:16:49+05:30 IST

క్రికెట్‌ క్రీడ అంటేనే చిన్నారుల నుంచి యువకుల వరకు ఏదో తెలియని జోష్‌ వస్తోంది. గతంలో క్రికెట్‌ చూస్తూ ఆటగాళ ్లను అనుకరిస్తూ మైదానంలో క్రికెట్‌ ఆడే యువత గత కొన్ని సంవత్సరాలుగా కొత్త పంతాను ఎంచుకుంటుంది.

బెట్టింగ్‌ జోరు.. యువత బేజారు!

- వ్యసనంగా మారిన ఐపీఎల్‌ బెట్టింగ్‌

- ఈజీ మనీ కోసం యువకుల ఆరాటం

- పందెం కోసం బైక్‌, బంగారం తాకట్టు

- వ్యవహారమంతా ఆన్‌లైన్‌లోనే..

- పట్టణాలు, పల్లెలు అని తేడా లేకుండా జరుగుతున్న బెట్టింగ్‌


కామారెడ్డి టౌన్‌, ఏప్రిల్‌ 27: క్రికెట్‌ క్రీడ అంటేనే చిన్నారుల నుంచి యువకుల వరకు ఏదో తెలియని జోష్‌ వస్తోంది. గతంలో క్రికెట్‌ చూస్తూ  ఆటగాళ ్లను అనుకరిస్తూ మైదానంలో క్రికెట్‌ ఆడే యువత గత కొన్ని సంవత్సరాలుగా కొత్త పంతాను ఎంచుకుంటుంది. మైదానంలో ఆడాల్సిన క్రికెట్‌కు ఫుల్‌ స్టాప్‌ పెట్టేసి అరచేతిలో ఉన్న సెల్‌ఫోన్‌లో లేదంటే టీవీల ముందు చేరి బెట్టింగ్‌ అనే మహమ్మారిని తమ జీవితంలోకి ఆహ్వానించి అటు ఆరోగ్యపరంగా, ఆర్థిక పరంగా ఇబ్బందులు పడడమే కాకుండా తల్లిదండ్రులను సైతం క్షోభకు గురి చేస్తున్నారు. ప్రతీ సంవత్సరం ఏప్రిల్‌ వచ్చిందంటే చాలు క్రికెట్‌ ప్రేమికులకు వినోదాన్ని అందించే ఐపీఎల్‌ క్రికెట్‌ ద్వారా యువత పెడతోవ పడుతోంది. ఈజీగా మనీ సంపాదనే ధ్యేయంగా బెట్టింగ్‌వైపు అడుగులేసి జేబులను గుల్లచెసుకుంటున్నారు. గతంలో ముఖ్యమైన పట్టాణాలలోనే పరిమితమైన ఈ వికృత క్రీడ ఇప్పుడు పల్లెలకు కూడా పాకుతోంది. మ్యాచ్‌ జరిగే సమయంలో యువత చేతిలో డబ్బులు లేకపోతే తల్లిదండ్రులు ప్రేమతో ఇచ్చిన ద్విచక్రవాహనం, సెల్‌ఫోన్‌ లేదా బంగారు గొలుసులను తాకట్టు పెట్టి బెట్టింగ్‌ చేస్తున్నారు. తాను కట్టిన జట్టు, ప్లేయర్‌లో గెలవాలనే ఆకాంక్షతో చదువులను సైతం పక్కన పెట్టి టీవీలకు లేదంటే సెల్‌ఫోన్‌లకు అతుక్కుపోతున్నారు. తీరా ఆ ప్లేయర్‌ గెలువకపోతే ఒత్తిడికి గురి అయి మద్యం తాగుతూ వికృత చేష్టలు చేస్తున్నారు. కాగా ఈ వ్యవహారమంతా ఆన్‌లైన్‌లో సాగుతుండడంతో విషయం బయటకు పొక్కడం లేదని తెలుస్తోంది. ముఖ్యంగా ఈ వ్యవహారాన్ని అడ్డుకుందామని పోలీసులు యత్నించినా, చిన్న సాక్ష్యం కూడా దొరకడం లేదని చెప్పవచ్చు. ఏ పది మంది యువకులు కలిసినా ఐపీఎల్‌కు సంబంధించిన విషయాలు మాట్లాడుకోవడమే తప్ప వేరే విషయాలను చర్చించకపోవడం గమనార్హం.

రేటింగ్సే బెట్టింగ్‌కు ఆధారం

మ్యాచ్‌లో పాల్గొంటున్న జట్లకు రేటింగ్స్‌ను, బలాబలాలను బుకీలు ఇస్తున్నారు. బలంగా ఉన్న జట్టుకు తక్కువ రేటింగ్‌, బలహీన జట్టుకు ఎక్కువ రేటింగ్‌ను ఇస్తూ యువత జీవితాలతో బుకీలు ఆటలు ఆడుకుంటున్నారు. గత నాలుగు సంవత్సరాల వరకు కేవలం పట్టణ ప్రాంతాల్లోనే ఉండే ఈ బెట్టింగ్‌ ఇప్పుడు పల్లెలకు పాకింది. బెట్టింగ్‌లో కోల్పోయిన వస్తువులను వెనక్కి తీసుకురాలేక, ఇంట్లో నిజాన్ని చెప్పలేక నరకయాతన అనుభవిస్తున్నారు. గత మూడు సంవత్సరాల కింద కొందరు యువకులు జిల్లా కేంద్రంలో బెట్టింగ్‌లు కడుతున్నారనే అనుమనంతో పోలీసులు అరెస్టులు చేసినప్పుడు తీవ్ర స్థాయిలో చర్చలు జరిగి పోలీసులు సైతం కఠినంగా వ్యవహరించిన యువతలో మార్పు మాత్రం రావడం లేదు. ప్రస్తుతం జిల్లా కేంద్రంలో ఈ బెట్టింగ్‌ వ్యవహారం పెద్ద ఎత్తున జరుగుతుండడం కొందరు ఏకంగా ఓ రిజిస్టర్‌ను మెయింటేన్‌ చేస్తూ బెట్టింగ్‌పై మక్కువ చుపే యువకులకు గాలం వేస్తూ కమీషన్‌ల రూపంలో పెద్ద ఎత్తున దందాను సాగిస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా పాత పట్టణంలోని ఓ ప్రభుత్వ పాఠశాల వద్ద ఉన్న కిరాణ దుకాణ నిర్వాహకుడితో పాటు ఆ ప్రాంతంలో ఉండే మరో నలుగురైదుగురు ఈ వ్యవహారాన్ని పెద్ద ఎత్తున జరిపిస్తున్నారని సమాచారం. 

వ్యవహారమంతా ఆన్‌లైన్‌లోనే..

డిజిటల్‌ సేవలను మంచి పనులకు ఉపయోగించుకోవాల్సింది పోయి చెడు మార్గానికి వినియోగించుకునేందుకే యువత మొగ్గు చూపుతోంది. మ్యాచ్‌కు సంబంధించిన ప్రతీ వ్యవహారం అంతా వాట్సప్‌, హైక్‌, మెసేంజర్‌ల రూపంలో ఆన్‌లైన్‌లోనే సాగుతుంది. మ్యాచ్‌ ప్రారంభమైన 20 నిమిశాల ముందే ఆయా జట్ల బలాబలాలపై రేటింగ్స్‌పై కాసేందుకు బూకీలకు సంబంధించిన ఏజెంట్లు యువతకు విషయాన్ని చేరవేస్తున్నారు. దీంతో యువత చిల్లిగవ్వ లేకపోయినా అప్పుగానో, వస్తువులు తాకట్టు పెట్టో డబ్బును బెట్టింగ్‌లో పెడుతున్నారు. పందెంలో గెలిచినా.. ఓడినా సరే డబ్బు కూడా ఆన్‌లైన్‌లోనే బదిలీ అవుతోంది. ముఖ్యంగా ఆన్‌లైన్‌ సర్వీస్‌లు అయిన గూగుల్‌పే, వాట్సప్‌పే, పేటీఎం, ఫోన్‌పే యాప్‌ల నుంచి నగదును ట్రాన్స్‌ఫర్‌ చేస్తున్నారు. క్యాష్‌లెస్‌గా ఈ వ్యవహారం జరుగుతుండడంతో ఎక్కడా ఏ చిన్న అనుమానం రాకుండా గుట్టుగా వ్యవహారం కొనసాగుతోంది. కాగా పట్టిష్టమైన నిఘాను ఏర్పాటు చేస్తే ఇలాంటి బుకీల ఆటలు కట్టించడం పోలీసులకు కష్టమేమి కాదని పలువురు అభిప్రాయపడుతున్నారు.

Updated Date - 2022-04-28T05:16:49+05:30 IST