Advertisement
Advertisement
Abn logo
Advertisement

3 నిమిషాల్లో 900 మంది ఉద్యోగులను తీసిపారేసిన సంస్థ

న్యూఢిల్లీ: కరోనా లాక్‌డౌన్ నేపథ్యంలో వర్క్‌ ఫ్రం హోం సదుపాయం అందుబాటులోకి వచ్చిన తర్వాత ‘జూమ్’ బాగా పాపులర్ అయింది. ఇంటి నుంచి పనిచేసే ఉద్యోగులతో సమావేశాలు, సలహాలు, సూచనలు ఇచ్చేందుకు ‘జూమ్’ వీడియో కాల్స్ బాగా అక్కరకొచ్చాయి. కార్పొరేట్ నుంచి అన్ని సంస్థలు దీనిని సద్వినియోగం చేసుకున్నాయి. అయితే, ఈ జూమ్ కాల్ మీటింగులో కొన్ని అపశ్రుతులు చోటు చేసుకున్న ఘటనలు కూడా వెలుగులోకి వచ్చి వైరల్ అయ్యాయి. 


తాజాగా, అమెరికాలోని న్యూయార్క్‌కు చెందిన ఓ తనఖా సంస్థ మూడు నిమిషాల జూమ్ కాల్ ద్వారా ఏకంగా 900 మంది ఉద్యోగులను ఒక్క పెట్టున తొలగించింది. అంతేకాదు, ఉద్యోగుల తొలగింపునకు ముందు పాటించాల్సిన ఎలాంటి నియమ నిబంధనలు పాటించలేదు. జూమ్ కాల్‌కు హాజరయ్యే వరకు ఉద్యోగులకు తమ ఉద్యోగాలకు అదే చివరి రోజున్న సంగతి తెలియకపోవడం గమనార్హం. పింక్ స్లిప్ అందుకున్న ఓ ఉద్యోగి ఆ షార్ట్ వీడియోను ట్విట్టర్‌లో షేర్ చేయడంతో అది కాస్తా వైరల్ అయింది.


బెటర్ డాట్ కామ్  సీఈవో విశాల్ గార్గ్ ఆ వీడియోలో మాట్లాడుతూ.. ఇది మీరు వినాల్సిన వార్త కాదని చెబుతూనే ఉద్యోగులను తొలగిస్తున్నట్టు చెప్పి అందరికీ ఒకేసారి షాకిచ్చారు. మీరో ‘అన్‌లక్కీ గ్రూప్’లో ఉన్నారని పేర్కొంటూ అందరికీ లే ఆఫ్ ఇస్తున్నట్టు చెప్పి బాంబు పేల్చారు. అంతేకాదు, ఈ క్షణం నుంచే ఈ నిర్ణయం అమల్లోకి వస్తుందని కూడా చెప్పారు.


‘‘నేనేమీ గొప్ప వార్తను మోసుకు రాలేదు. మార్కెట్‌లో పరిస్థితులు ఎంతలా మారిపోయాయో మీకు ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మనుగడ సాగించేందుకు మేమైతే ముందుకెళ్లాలి. అలా అయితేనే  అభివృద్ధి చెంది మా మిషన్‌ను కొనసాగించగలుగుతాము’’ అని విశాల్ గార్గ్ చెప్పడం ఆ వీడియోలో స్పష్టంగా వినిపిస్తోంది.  నిజానికి ఇలా చేయడం తనకు ఎంతమాత్రమూ ఇష్టం లేదని, ఇలా చేయడం ఇది రెండోసారని గార్గ్ పేర్కొన్నారు. గతంలో ఇలా ఉద్యోగులను తొలగించినప్పుడు ఏడ్చేశానని గుర్తు చేసుకున్నారు. 

Advertisement
Advertisement