బరికి సిద్ధమవుతున్న ‘పందెం’ కోళ్లు

ABN , First Publish Date - 2021-01-13T05:48:30+05:30 IST

కోళ్ల కొట్లాట సందడి కాస్త పందేల శిబిరాలుగా మారిపోయాయి.

బరికి సిద్ధమవుతున్న ‘పందెం’ కోళ్లు

కోట్లల్లో చేతులు మారనున్న డబ్బులు

జిల్లాలో రోజుకు రూ.2 కోట్లు,.. పొరుగు జిల్లాలకెళ్లి రూ.10 కోట్లు

శిబిరాలు.. నిర్వాహకులపై పోలీసుల డేగ కన్ను


కడప (సిటీ), జనవరి 12: తెలుగునాట సంబరాల పండుగ సంక్రాంతి. భోగి మంటలు, ఇళ్లముంగిట రంగవల్లులు, బసవయ్యల ప్రదర్శనలు, హరిదాసుల కీర్తనలు ఇలా చెప్పుకుంటూపోతే సంబరాల చిట్టా చేంతాడంత అవుతుంది. ఇవన్నీ ఒక ఎత్తయితే కోళ్ల కొట్లాట అదనపు సందడి. అయితే ఆ సందడి రూటు మారి జూదంగా మారింది. కోళ్ల కొట్లాట సందడి కాస్త పందేల శిబిరాలుగా మారిపోయాయి. లక్షలు కాదు.. కోట్లల్లో చేతులు మారుతుంటాయి. వీటిని గతంలోనే ప్రభుత్వాలు నిషేధించాయి. న్యాయస్థానాలు కూడా ఆక్షేపించాయి. కోళ్ల పందేలను పోలీసులు అడ్డుకునే ప్రయత్నాలు చేస్తున్నా అరకొర అరెస్టులతో మమ అనిపిస్తుండడంతో యథేచ్ఛగా కొనసాగుతూ వస్తున్నాయి. కరోనా కారణంగా ఈసారి ఆ పందేల జూదానికి అడ్డుకట్ట పడుతుందని భావించినా విశ్వసనీయ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం మేర నిర్వాహకులు గుట్టుగా పని ముగించేందుకు కసరత్తులు ప్రారంభిస్తున్నారు. ఈనెల 13 నుంచి 17వ తేదీ వరకు పందేలు సాగనున్నట్లు తెలుస్తోంది.


గతంలో జిల్లాలో రోజుకు రూ.2 కోట్లు, పొరుగు జిల్లాలకెళ్లి రూ.10 కోట్ల మేర పందేలు కాస్తూ వచ్చేవారు. ఈసారి ఎంత కట్టడి, కరోనా ఉన్నా ఈసారి కూడా అంతకు తక్కువగా ఉండదనే గుసగుసలు వినిపిస్తున్నాయి. సంక్రాంతి కోడిపందేలకు ఉభయగోదావరి జిల్లాలు గుంటూరు, కృష్ణా, నెల్లూరు జిల్లాలోని పలు ప్రాంతాల్లో శిబిరాలు వెలుస్తాయి. జిల్లాలో కమలాపురం, రాయచోటి, పులివెందుల, ప్రొద్దుటూరు, రాజంపేట, కోడూరు నియోజకవర్గ పరిధిలోని కొన్ని ప్రాంతాల్లో కోడిపందేలు నిర్వహిస్తుంటారు. కాగా భీమవరం, రాజమండ్రి సమీపంలోని భజనపల్లెలో భారీ స్థాయిలో పందేల శిబిరాలు నడుస్తుంటాయని చెబుతుంటారు. జిల్లాలో రాయచోటి నియోజకవర్గ పరిధిలో పెద్ద మొత్తంలో పందేల ద్వారా చేతులు మారతాయని తెలుస్తోంది.


ఏడు తెగల మధ్య పోటీ

పోరాటంలో ఏడు తెగల కోళ్లు పాలుపంచుకుంటాయి. డేగ, నెమలి, నల్లనెమలి, కాకి, కోడినెమలి, పింగళి, కొరకోడి తెగలుంటాయి. వీటిలో డేగ, కాకి తెగల మధ్య భీకర పోరు సాగుతుంది. పందేలు కూడా ఆ స్థాయిలో జరుగుతుంటాయి. డేగ, కాకి తరవాత పింగలి, కొరకోడి మధ్య, కాకి నల్లనెమలి మధ్య కూడా పోటీ తీవ్రంగానే ఉంటుంది. డేగ, కాకి, పింగలి తెగల కోడిపుంజులను లక్షలు పెట్టి కొనుగోలు చేసి దాణా కోసం అంతకు రెట్టింపు వ్యయం చేస్తూ సాకుతారు. సంక్రాంతి నేపధ్యంలో బరిలోకి దింపుతుంటారు.


జిల్లాలో రూ.2 కోట్లు.. పొరుగు జిల్లాలకెళ్లి రూ.10 కోట్లు

జిల్లాలో నిర్వహించే శిబిరాల్లో రోజుకు రూ.2 కోట్ల మేర పందేలు జరుగుతుంటాయి. జిల్లా నుంచి దాదాపు 30 కార్లల్లో పందెం రాయుళ్లు పొరుగు జిల్లాలకెళ్లి పందేలు కాస్తుంటారు. అక్కడ మన జిల్లావాసులు రోజుకు రూ.10 కోట్ల మేర పందేలు కాస్తుంటారని తెలుస్తోంది. గెలుస్తున్నారా, ఓడిపోతున్నారా అనేది మాత్రం రహస్యం. గ్రూపులుగా  ఏర్పడి  తాము ఎంచుకున్న ప్రాంతానికి రహస్యంగా వెళ్లడం గమనార్హం. ఈసారి పోలీసుల దాడులు ఉంటాయన్న భావనతో నిర్వాహకులు, పందెంరాయుళ్లు ఆన్‌లైన్‌ ద్వారా చెల్లింపులు చేసుకునే కసరత్తుకు శ్రీకారం చుడుతున్నట్లు సమాచారం.


కోడిపందేలు నిర్వహిస్తే కఠిన చర ్యలు

- ఎస్పీ కేకేఎన్‌ అన్బురాజన్‌

 సంక్రాంతి పండుగ సందర్భంగా జూదం, కోడిపందేలు, గుండాట తదితర అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తప్పవని ఎస్పీ కేకేఎన్‌ అన్బురాజన్‌ హెచ్చరించారు. మంగళవారం ఎస్పీ పత్రికా ప్రకటన విడుదల చేశారు. బహిరంగ ప్రదేశాల్లో మద్యం తాగడం, మద్యం తాగి వాహనాలు నడిపేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. కోడిపందేల బరులు ఏర్పాటు చేస్తే కఠిన చర్యలు ఉంటాయన్నారు. జిల్లా వ్యాప్తంగా ఆయా పోలీసుస్టేషన్ల పరిధిలో కోడిపందేలు ఆడేవారిపై నిఘా ఉంటుందన్నారు. అసాంఘిక కార్యకలాపాలు నిర్వహించే వారి గురించి ప్రజలు సమాచారం తెలపాలన్నారు. ఇప్పటికే జిల్లాలో ఉన్న పోలీసు అధికారులకు దాడులు నిర్వహించి కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించినట్లు పేర్కొన్నారు. 

Updated Date - 2021-01-13T05:48:30+05:30 IST