జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో మెరిశారు

ABN , First Publish Date - 2021-10-17T05:36:00+05:30 IST

జేఈఈ అడ్వాన్స్‌డ్‌ ఫలితాల్లో జిల్లా విద్యార్థులు సత్తా చాటారు. ఉత్తమ ర్యాంకులతో సిక్కోలు ప్రతిభను జాతీయ స్థాయిలో ఇనుమడింపజేశారు. రేగిడి మండలం బూరాడ గ్రామానికి చెందిన వావిలపల్లి బాలాజీ సిద్ధార్థ ఆలిండియా స్థాయిలో 126 ర్యాంకు, ఓబీసీ కేటగిరీలో పదో ర్యాంకు సాధించాడు.

జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో మెరిశారు
నిఖిల్‌కు స్వీటుతిన్పిస్తున్న తల్లితండ్రులు

- జిల్లా విద్యార్థులకు ఉత్తమ ర్యాంకులు

(రేగిడి/పోలాకి/రాజాం రూరల్‌/జలుమూరు, అక్టోబరు 16)

జేఈఈ అడ్వాన్స్‌డ్‌ ఫలితాల్లో జిల్లా విద్యార్థులు సత్తా చాటారు. ఉత్తమ ర్యాంకులతో సిక్కోలు ప్రతిభను జాతీయ స్థాయిలో ఇనుమడింపజేశారు. రేగిడి మండలం బూరాడ గ్రామానికి చెందిన వావిలపల్లి బాలాజీ సిద్ధార్థ ఆలిండియా స్థాయిలో 126 ర్యాంకు, ఓబీసీ కేటగిరీలో పదో ర్యాంకు సాధించాడు. బాలాజీ సిద్ధార్థ విశాఖలోని ప్రైవేటు కళాశాలలో ఇంటర్‌ చదివాడు. తెలంగాణ ఎంసెట్‌లో 129వ ర్యాంకు సాధించాడు.  ఇతని తండ్రి నారాయణ మామిడిపల్లి ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు. తల్లి మణి అంబకండి ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయుని. జేఈఈలో సిద్ధార్థ ప్రతిభ చూపడంపై తల్లిదండ్రులతో బంధువులు, గ్రామస్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 

- పోలాకి గ్రామానికి చెందిన ఇంజరాపు నిఖిల్‌ ఆలిండియాలో  196 వ ర్యాంక్‌, ఓబీసీ కేటగిరీలో 16వ ర్యాంక్‌ సాధించాడు. తండ్రి వెంకటరమణ మూర్తి గార ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు. తల్లి జ్యోతిలక్ష్మి కొర్ని ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు. నిఖిల్‌ విజయవాడలో ఇంటర్‌   చదివాడు. జేఈఈలో మంచి ర్యాంకు సాధించడంపై తల్లిదండ్రులు, గ్రామస్తులు హర్షం వ్యక్తంచేశారు. 

- జలుమూరు మండలం చల్లవానిపేట గ్రామానికి చెందిన పాగోటి హేమంత్‌నాయుడు 262 మార్కులతో జాతీయ స్థాయిలో 232వ ర్యాంకు సాధించాడు. ఓబీసీలో 22వ ర్యాంకును కేవసం చేసుకున్నారు. హేమంత్‌ నాయుడు ప్రాథమిక విద్యాభ్యాసం చల్లవానిపేట, నరసన్నపేటలో సాగింది. ఏడో తరగతి నుంచి ఇంటర్‌ వరకు వైజాగ్‌లో ప్రైవేటు పాఠశాల, కళాశాలలో చదువుకున్నాడు. జేఈఈ మెయిన్స్‌లో జాతీయ స్థాయిలో 430వ ర్యాంకు సాధించాడు. తల్లి శారద గృహిణి. తండ్రి ప్రసాదరావు వస్త్రదుకాణం నిర్వహిస్తున్నారు. హేమంత్‌నాయుడు మంచి ర్యాంక్‌ సాధించడంపై తల్లిదండ్రులు, గ్రామస్థులు అభినందించారు. తాత నీలాంబరం ప్రోత్సాహంతో జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో ఉత్తమ ర్యాంకు సాధించానని హేమంత్‌నాయుడు తెలిపారు. ఐఏఎస్‌ కావాలన్నదే తన లక్ష్యమని వివరించారు. 

- రాజాం పట్టణానికి చెందిన వారాడ మహంతనాయుడు ఆలిండియా ఓపెన్‌ కేటగిరీలో 38వ ర్యాంకు, ఓబీసీ కేటగిరీలో రెండో ర్యాంకు కైవసం చేసుకున్నాడు. మహంతి నాయుడు తల్లిదండ్రులు త్రివేణి, రామారావులు ప్రభుత్వ ఉపాధ్యాయులే. రాజాం పట్టణంలోని మల్లికార్జున కాలనీకి చెందిన వానపల్లి రాజగోపాల్‌ ఓపెన్‌ కేటగిరీలో 375వ ర్యాంకు, ఓబీసీ కేటగిరీలో 39వ ర్యాంకు సాధించాడు. రాజగోపాల్‌ తల్లి హైమవతి ఉపాధ్యాయిని కాగా, తండ్రి గోవిందరావు మత్స్యశాఖలో ఉద్యోగి. మహంతనాయుడు, రాజగోపాల్‌ ఉత్తమ ర్యాంకులు సాధించడంపై కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు. 

Updated Date - 2021-10-17T05:36:00+05:30 IST