ఉత్తమ పార్లమెంటేరియన్‌

ABN , First Publish Date - 2020-03-18T05:57:41+05:30 IST

రాజకీయ పార్టీలు, ఎన్నికల ప్రక్రియలో తరచు నేర చరితులను తమ అభ్యర్థులుగా ఎంపిక చేయటం గురించి, ప్రజా ప్రతినిధులుగా ఎంపికైన అటువంటి నేతలు చట్ట సభలలో ప్రవర్తిస్తున్న తీరుతెన్నుల...

ఉత్తమ పార్లమెంటేరియన్‌

దేశాన్ని విచ్ఛిన్న పరుస్తున్న మతతత్వ శక్తులనెదుర్కొనేందుకు లౌకికవాద శక్తులు ఏకం కావాల్సిన ఆవశ్యకతను ఇంద్రజిత్ గుప్తా ఆనాడే నొక్కిచెప్పారు. మన రాజ్యాంగ వ్యవస్థలకు మతతత్వ శక్తుల నుంచి పెను ప్రమాదం పొంచి వున్నదని 1980వ దశకంలోనే గుప్తా హెచ్చరించారు. మతం, కులం ప్రాతిపదికపై ఎన్నికల్లో ఓట్లు అడిగేవారిని ప్రజాప్రాతినిధ్య చట్టం ప్రకారం అనర్హులుగా ప్రకటించాలని,  పార్టీ ఫిరాయిస్తే సీటు ఖాళీ చేస్తానని మినేషన్‌ పేపర్‌పైనే అభ్యర్థి సంతకం చేయించాలని ఆయన సూచించారు.


రాజకీయ పార్టీలు, ఎన్నికల ప్రక్రియలో తరచు నేర చరితులను తమ అభ్యర్థులుగా ఎంపిక చేయటం గురించి, ప్రజా ప్రతినిధులుగా ఎంపికైన అటువంటి నేతలు చట్ట సభలలో ప్రవర్తిస్తున్న తీరుతెన్నుల గురించి, ఆకాశాన్నంటుతున్న ఎన్నికల వ్యయం, పార్టీ ఫిరాయింపుల గురించి దేశ సర్వోన్నత న్యాయస్థానం పదే పదే ప్రశ్నిస్తున్న తరుణమిది. ఈ సందర్భంలో, పార్లమెంటులో ఉత్తమ సాంప్రదాయాలను నెలకొల్పిన, సమున్నత విలువలను నిలబెట్టిన ప్రముఖ ప్రజా ప్రతినిధులలో సువిఖ్యాతుడు ఇంద్రజిత్‌ గుప్తాను స్మరించుకోవడం సముచితంగా ఉంటుంది.


భారత పార్లమెంటు చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగిన పేరు ఇంద్రజిత్‌ గుప్తా. కులీన కుటుంబంలో జన్మించి శ్రామిక ప్రజల శ్రేయస్సు కోసం తన జీవితాన్ని త్యాగం చేసిన మహామనిషి ఆయన. ఉన్నత పదవులు అలంకరించి, ఆ పదవులకు ఎనలేని వన్నె తెచ్చిన ఉత్తమ రాజకీయ వేత్త ఇంద్రజిత్ గుప్తా. పార్టీలకు అతీతంగా అత్యంత గౌరవాదరాలు పొందిన కొద్ది మంది పార్లమెంటేరియన్లలో ఆయన ఒకరు. గాంధేయ నిరాడంబరత, ప్రజాస్వామ్య స్ఫూర్తి, విలువల పట్ల నిబద్ధత పరిపూర్ణంగా గల ప్రజా హితుడు ఇంద్రజిత్ గుప్తా అని (1990 దశకంలో రాష్ట్రపతిగా వున్న) కీర్తి శేషులు కె.ఆర్. నారాయణన్ కొనియాడారు. ఇంద్రజిత్‌ గుప్తాతో తన సాన్నిహిత్యాన్ని మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ ఇలా గుర్తు చేసుకున్నారు: ‘ఎన్నికల్లో గెలవటమే ప్రధానం కాదని ఇంద్రజిత్ రాజకీయ జీవితం స్పష్టం చేస్తున్నది. ఆయన వినయ విధేయతలు స్ఫూర్తిదాయకమైనవి. ఎంతో కఠినమైన విషయాల్ని కూడా సులభంగా, సుబోధకంగా వివరించగలిగే ప్రజ్ఞ ఆయన సొంతం’. ఎన్నికల వ్యయం నియంత్రణ, ఇతర ఎన్నికల సంస్కరణలపై ఇంద్రజిత్‌ గుప్తా కమిటీ సూచనలు, సిఫారసులు సమగ్రంగా అమలయినప్పుడే మన ప్రజాస్వామ్యం మరింత పారదర్శకంగా వర్ధిల్లుతుందని మన్మోహన్ సింగ్ అన్నారు. పార్లమెంటరీ చర్చల్లో పాల్గొనేటప్పుడు ఇంద్రజిత్ గుప్తా నుంచి తాను ‘తమ్ముడి’లాగా ఎంతో నేర్చుకున్నానని (1990 దశకంలో లోక్‌సభ స్పీకర్‌గా ఉన్న) సోమనాథ్ చటర్జీ గుర్తు చేసేవారు. 


బెంగాల్‌లో జన్మించిన ఇంద్రజిత్‌ గుప్తా ఇంగ్లాండ్‌లో ఉన్నత విద్యాభ్యాసం చేశారు. 1940లో స్వదేశానికి తిరిగి వచ్చిన వెంటనే భారత కమ్యూనిస్టు పార్టీలో చేరి ఆరు దశాబ్దాల పాటు కార్మికుల, కర్షకుల జీవన స్థితిగతులను మెరుగు పరిచేందుకు నిరంతరం కృషి చేశారు. భారత కమ్యూనిస్టు పార్టీ అగ్రనాయకుల్లో ఆయన ఒకరు. 1990 దశకంలో భారత కమ్యూనిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. 1960లో కలకత్తా నైరుతి నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికలో గెలవడం ద్వారా ఇంద్రజిత్ గుప్తా లోక్‌సభలో ప్రవేశించారు. దరిమిలా నాలుగు దశాబ్దాలపాటు లోక్‌సభ సభ్యునిగా ఆయన కొనసాగారు. 1996లో ఏర్పాటైన యునైటెడ్‌ ఫ్రంట్‌ ప్రభుత్వంలో హోంమంత్రిగా పనిచేశారు. హోంమంత్రిగా కూడా ఆయన రెండు గదుల క్వార్టర్స్‌లో ఉంటూ లోక్‌సభకు నడిచి వెళ్ళేవారు. ఇది ఆయన నిరాండంబరతకు నిదర్శనం. 


ఇంద్రజిత్‌గుప్తా పార్లమెంట్‌లో అనేక అంశాలపై వ్యక్తీకరించిన అభిప్రాయాలను మనం తెల్సుకోవాల్సిన అవసరం నేడు ఎంతైనా వున్నది. దేశాన్ని విచ్ఛిన్న పరుస్తున్న మతతత్వ శక్తుల నెదుర్కొనేందుకు లౌకికవాద శక్తులు ఏకం కావాల్సిన ఆవశ్యకతను ఇంద్రజిత్ గుప్తా ఆనాడే నొక్కిచెప్పారు. రాజ్యాంగం, చట్టాలలోని విషయాలపై ప్రజలకు అవగాహన కలిగించేందుకు ఆయన ఎనలేని కృషి చేశారు. భారత రాజ్యాంగంపై ప్రమాణం చేసి హిందూ రాష్ట్ర స్థాపనకు పూనుకోవడం క్షమార్హం కాదని ఇంద్రజిత్ గుప్తా అన్నారు. మన రాజ్యాంగ వ్యవస్థలకు మతతత్వ శక్తుల నుంచి పెను ప్రమాదం పొంచి వున్నదని 1980 దశకంలోనే ఇంద్రజిత్ గుప్తా హెచ్చరించారు. మతం, కులం ప్రాతిపదికపై ఎన్నికల్లో ఓట్లు అడిగే వారిని ప్రజాప్రాతినిధ్య చట్టం ప్రకారం అనర్హులుగా ప్రకటించాలని, పార్టీ ఫిరాయిస్తే సీటు ఖాళీ చేస్తానని నామినేషన్‌ పేపర్‌పైనే  అభ్యర్థుల సంతకం చేయించాలని ఆయన సూచించారు. విశాల భారతదేశ వైవిధ్యాన్ని దృష్టిలో వుంచుకొని మన ప్రజాస్వామ్య వ్యవస్థలో దామాషా ప్రాతిపదికన చట్ట సభలలో రాజకీయ పార్టీలకు సీట్లు కేటాయించాలన్నదే తమ పార్టీ వైఖరి అని చెప్పేవారు. ‘భారతీయ సమాజం మతతత్వం కబంధ హస్తాలలో ఉన్నంతకాలం దేశంలో సోషలిజం స్థాపన సాధ్యం కాదని సోషలిస్టులు ఎందుకు అర్ధం చేసుకోరు?’ అన్న గాంధీజీ వాక్కులను గుప్తా పదే పదే ఉటంకించేవారు. 


నాలుగున్నర దశాబ్దాల క్రితం అంతర్జాతీయ మహిళా సంవత్సరమైన 1975లో పార్లమెంట్‌లో ఉపన్యసిస్తూ మహిళలకు చట్టసభలలో రిజర్వేషన్లు కల్పించాలని కోరిన మొట్టమొదటి వ్యక్తి ఇంద్రజిత్‌గుప్తా. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కోసం ఏర్పాటు చేసిన ఐదవ వేతన సంఘం సిఫార్సుల మేరకు జీతభత్యాలు గణనీయంగా పెంచడానికి కేంద్ర క్యాబినెట్‌లో తోటి సహచరమంత్రులతో వాదించి ఒప్పించిన మాన్యుడు గుప్తా. పార్టీ ఆదేశాల మేరకు పశ్చిమబెంగాల్‌ జూట్‌ మిల్స్‌ కార్మికుల్లో తన ట్రేడ్‌ యూనియన్‌ జీవితాన్ని ప్రారంభించి ఆరు దశాబ్దాల పాటు వారికి సేవలను అందించారు. పార్లమెంట్‌లో ఎన్నో సందర్భాలలో కార్మికవర్గ చట్టాలను రూపొందించటంలో తన వాణిని వినిపించటమే కాక పార్లమెంట్‌ వెలుపల అనేక పోరాటాలకు ఆయన నాయకత్వం వహించారు. ఆ క్రమంలోనే అఖిల భారత ట్రేడ్‌ యూనియన్‌ కాంగ్రెస్‌ (ఏఐటీయూసీ) ప్రధాన కార్యదర్శిగా, ప్రపంచ ట్రేడ్‌ యూనియన్‌ సమాఖ్య అధ్యక్షులుగా కూడా ఆయన పనిచేశారు. 


పౌరహక్కులను కాలరాయ చూసే చట్టాలైన పీడీ యాక్ట్‌, మీసా లాంటివి పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన సందర్భంగా వాటిని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఇంద్రజిత్ గుప్తా చేసిన ప్రసంగాలు నేటికీ ఎంతో స్ఫూర్తిదాయకం. సిఏఏ, ఎన్‌ఆర్‌సి, ఎన్‌పీఆర్‌లపై నేడు చర్చ జరుగుతున్న సందర్భంలో ఇంద్రజిత్‌ గుప్తా ఉపన్యాసాల్ని మరోసారి అధ్యయనం చేయవలసిన అవసరం ఎంతైనా వున్నది. వాటి సారాన్ని గ్రహించి తద్వారా ఈ చట్టాలపై మన వైఖరిని వెల్లడించటంతో పాటు ప్రజాస్వామ్యయుతంగా పోరాటం చేయడమే ఇంద్రజిత్‌ గుప్తాకు మనం సమర్పించగలిగే నిజమైన నివాళి. 

డాక్టర్ పి.నారాయణ రావు

(నేడు ఇంద్రజిత్‌ గుప్తా జయంతి)

Updated Date - 2020-03-18T05:57:41+05:30 IST