ఫ్లైఓవర్‌ నీడన జూదం.. డబ్బులాటలకు కేంద్రం బెంజ్‌సర్కిల్‌

ABN , First Publish Date - 2020-09-24T15:45:27+05:30 IST

ఉదయం నుంచి సాయంత్రం దాకా మద్యం తాగడం... మధ్యమధ్యలో బొమ్మ..

ఫ్లైఓవర్‌ నీడన జూదం.. డబ్బులాటలకు కేంద్రం బెంజ్‌సర్కిల్‌

అక్కడే మద్యం.. నిత్యం ఘర్షణలు


(ఆంధ్రజ్యోతి, విజయవాడ): ఉదయం నుంచి సాయంత్రం దాకా మద్యం తాగడం... మధ్యమధ్యలో బొమ్మ, బొరుసు ఆటలు.. డబ్బుల దగ్గర తేడాలు వస్తే కొట్లాటలు. ఇదీ బెంజ్‌సర్కిల్‌ ఫ్లైఓవర్‌ కింద నిత్యం కనిపించే దృశ్యాలు. చిల్లర జూదగాళ్లు ఉదయమే ఇక్కడికి వచ్చేస్తారు. మొన్నటి వరకు లారీ ఓనర్స్‌ అసోసియేషన్‌ హాలు ప్రాంతంలో ఉండేవారు. ఎదురుగా ఉన్న మద్యం షాపులో నుంచి మందు కొనుగోలు చేసి ఇక్కడున్న చెట్ల కింద బహిరంగంగా తాగేవారు. ఒకరకంగా ఆ ప్రాంతం మినీ బెల్టు షాపులా కనిపించేది. ఇప్పుడు అక్కడ రెండో ఫ్లైఓవర్‌ నిర్మాణ పనులు జరుగుతున్నాయి. దీంతో ఈ జూదగాళ్లు ఆంజనేయ స్వామి ఆలయం వైపు ఉన్న ఫ్లైఓవర్‌ కిందకు మకాం మార్చారు. ఇక్కడున్న టిఫిన్‌ బండ్ల మీద కూర్చుని మద్యం తాగుతూ, పందేలు కట్టి బొమ్మాబొరుసు ఆడుతున్నారు. డబ్బుల వద్ద తేడాలు వస్తే నడిరోడ్డుపై కొట్టుకుంటున్నారు. ఈ ప్రాంతంలో కార్యాలయాలు.. బ్యాంకు, టెన్నిస్‌ శిక్షణ కేంద్రం ఉండడంతో ఈ జూదగాళ్ల గొడవలతో అక్కడికి వచ్చేవారు ఇబ్బంది పడుతున్నారు. 


ఆటోలో వచ్చి.. డబ్బులు లాక్కుని

ఇక్కడ డబ్బులాటలు జోరుగా జరుగుతుండడాన్ని గమనించి ముగ్గురు దుండగులు స్కెచ్‌ చేశారు. ఒక ఆటోలో వచ్చి పోలీసులమని చెప్పి చిరు వ్యాపారుల నుంచి, ఈ జూదగాళ్ల నుంచి డబ్బులు లాక్కొని పారిపోయారు. బుధవారం సాయంత్రం నాలుగు గంటల ప్రాంతంలో ఏపీ16 టీసీ 1877 నంబర్‌ గల టాటా ఏస్‌ వాహనంలో ముగ్గురు గుర్తుతెలియని వ్యక్తులు వచ్చారు. వారిలో ఇద్దరు వాహనంలో కూర్చున్నారు. ఒకరు వేగంగా కిందికి దిగి స్టేషన్‌లో కానిస్టేబుల్‌నని చెప్పి వృద్ధ వ్యాపారి నుంచి రూ.700 లాక్కుని జేబులో పెట్టుకున్నాడు. అక్కడున్న జూదగాళ్లను బెదిరించి డబ్బులు లాక్కుని ఆటోలో జాతీయ రహదారిపైకి వెళ్లిపోయారు. 

Updated Date - 2020-09-24T15:45:27+05:30 IST