Advertisement
Advertisement
Abn logo
Advertisement

గడువుకు ముందే బెంజ్‌-2.. వయాడక్ట్‌ రెడీ

ఏడు నెలల ముందే ప్రారంభానికి సిద్ధం 

ప్రాజెక్టు పనుల్లో 98 శాతం పురోగతి 

రేపటి నుంచి ఫ్లై ఓవర్‌కు సామర్థ్య పరీక్షలు 

నెలఖరుకు ట్రయల్‌ రన్‌


బెంజ్‌సర్కిల్‌-2 ఫ్లై ఓవర్‌ రికార్డు సమయంలో నిర్మాణ పనులను పూర్తి చేసుకుంటోంది. గడువుకంటే ముందే ఫ్లై ఓవర్‌ను పూర్తి చేస్తామని ప్రకటించిన కాంట్రాక్టు సంస్థ లక్ష్మీ ఇన్‌ఫ్రా అందుకనుగుణంగానే అడుగులు వేసింది. ప్రాజెక్టులో 98 శాతం పనులు ఇప్పటికే పూర్తికాగా, మిగిలిన రెండు శాతం పనులను వారంలో పూర్తి చేసి, నెలాఖరుకు ట్రయల్‌ రన్‌ వేయనుంది.


(ఆంధ్రజ్యోతి, విజయవాడ) : బెంజ్‌సర్కిల్‌-2 ఫ్లై ఓవర్‌ నిర్మాణ పనులు నిర్దేశించిన గడువు కంటే ముందే ముగింపు దశకు వచ్చాయి. ప్రస్తుతం విద్యుద్దీపాల పనులు జరుగుతున్నాయి. రెండు మూడు రోజుల్లో ఈ పనులు కూడా పూర్తవుతాయని భావిస్తున్నారు. ఫ్లై ఓవర్‌, అప్రోచ్‌లకు బీటీ పనులు పూర్తవడంతో, స్లాబ్‌ ఫ్రిక్షన్‌ పరీక్షలను, గడ్డర్ల దగ్గర  దుర్భేద్య పరీక్షలను కాంట్రాక్టు సంస్థ నిర్వహించింది. ఈ రెండు పరీక్షలూ సంతృప్తికరంగా ఉండటంతో అతి ముఖ్యమైన సామర్ధ్య పరీక్షలకు ఎన్‌హెచ్‌ సిద్ధమవుతోంది. 


రేపు ఫ్లై ఓవర్‌కు సామర్థ్య పరీక్ష

బెంజ్‌-2 ఫ్లై ఓవర్‌కు శనివారం సామర్ధ్య పరీక్షలు (లోడ్‌ టెస్ట్‌) నిర్వహించనున్నారు. ఇందుకు అవసరమైన పది టైర్ల భారీ టిప్పర్లను, మెటీరియల్‌ను ఇప్పటికే సిద్ధం చేశారు. భారీ టిప్పర్లలో మెటీరియల్‌ను ఉంచి, ఫ్లై ఓవర్‌పైకి ఎక్కిస్తారు. పది చోట్ల వీటిని కదలకుండా ఉంచుతారు. కింద భాగంలో స్లాబ్‌ కుంగుదలను జాతీయ రహదారుల సంస్థ (ఎన్‌హెచ్‌) అధికారులు ప్రతిరోజూ పరిశీలించి, కొలతలను నమోదు చేస్తారు. ఇలా వారం పరిశీలిస్తారు. కొలతల్లో అసాధారణ తేడాలు ఉంటే వైఫల్యం చెందినట్టు, సాధారణ కుంగుదల ఉంటే లోడ్‌టెస్ట్‌లో ఫ్లై ఓవర్‌ పాసైనట్టు భావించాల్సి ఉంటుంది. లోడ్‌ టెస్ట్‌ పూర్తయిన తరువాత, ఈ నెల చివరి వారంలో ట్రయల్‌ రన్‌ నిర్వహించాలని కాంట్రాక్టు సంస్థ, ఎన్‌హెచ్‌ భావిస్తున్నాయి. లోడ్‌ టెస్ట్‌ జరుగుతున్న సమయంలోనే మిగిలిన రెండు శాతం పనులను పూర్తి చేయాలని కాంట్రాక్టు సంస్థ భావిస్తోంది. సెంటిని హాస్పిటల్‌ సమీపంలో అప్రోచ్‌కు అనుసంధానంగా హైవే విస్తరణ పనులు చేపడుతున్నారు. 


బోనస్‌ అందుకోనున్న లక్ష్మీ ఇన్‌ఫ్రా  

గడువు కంటే ఏడు నెలల ముందుగానే ఫ్లై ఓవర్‌ పనులను పూర్తి చేస్తున్న లక్ష్మీ ఇన్‌ఫ్రా రికార్డును సొంతం చేసుకోవడంతో పాటు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే బోనస్‌కు కూడా ఎంపిక కానుంది. గడువు కంటే ముందుగా ప్రాజెక్టులను పూర్తి చేసే సంస్థలకు కేంద్ర ప్రభుత్వం బోనస్‌లను ప్రకటిస్తుంది. దేశంలో ఏ1 కాంట్రాక్టు సంస్థలు మాత్రమే గడువు కంటే ముందుగా ప్రాజెక్టులను పూర్తి చేసి, బోనస్‌లను అందుకుంటాయి. బడా కాంట్రాక్టు సంస్థలకు ఉండే వనరులే ఇందుకు కారణం. ఏడు నెలల ముందుగా ఫ్లై ఓవర్‌ను పూర్తి చేయటం ద్వారా లక్ష్మీ ఇన్‌ఫ్రా ఇటువంటి రికార్డును సొంతం చేసుకుంటోంది. ఒక కాంట్రాక్టు సంస్థగా లక్ష్మీ ఇన్‌ఫ్రాకు కూడా బెంజ్‌-2 ఫ్లై ఓవర్‌ నిర్మాణం మైలు రాయి వంటిదని చెప్పవచ్చు. బెంజ్‌-1 ఫ్లై ఓవర్‌ను  దేశంలోనే అతిపెద్ద కాంట్రాక్టు సంస్థల్లో ఒకటైన దిలీప్‌ బిల్డ్‌ కాన్‌ చేపట్టింది. ఆ సంస్థ ఫ్లై ఓవర్‌ను పూర్తి చేసేందుకు నాలుగేళ్ల సమయాన్ని తీసుకుంది. లక్ష్మీ ఇన్‌ఫ్రా ఈ ఫ్లై ఓవర్‌ను 2022 మే నాటికి పూర్తి చేయాల్సి ఉండగా, గడువుకు ముందే పూర్తి చేస్తామని ప్రకటించి, చెప్పినట్టే ఏడు నెలల ముందే పూర్తి చేసింది.

Advertisement
Advertisement