గుమ్మడికాయ విత్తనాలతో ప్రయోజనాలు బోలెడు!
ABN , First Publish Date - 2022-04-20T18:45:05+05:30 IST
గుమ్మడికాయ విత్తనాల్లో పోషకాలు పుష్కలంగా ఉంటాయని అంటున్నారు పోషకాహార నిపుణులు. వాటిని రోజూ తీసుకుంటే బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయని అంటున్నారు. అవేమిటంటే...
ఆంధ్రజ్యోతి(20-04-2022)
గుమ్మడికాయ విత్తనాల్లో పోషకాలు పుష్కలంగా ఉంటాయని అంటున్నారు పోషకాహార నిపుణులు. వాటిని రోజూ తీసుకుంటే బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయని అంటున్నారు. అవేమిటంటే...
గుమ్మడికాయ విత్తనాల్లో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి కేన్సర్ వచ్చే అవకాశాలను తగ్గిస్తాయి. ఈ గింజలను తీసుకుంటే స్త్రీలలో రొమ్ముకేన్సర్, పురుషుల్లో ప్రొస్టేట్ కేన్సర్ వచ్చే అవకాశాలు బాగా తగ్గుతాయి. వీటిలో మెగ్నీషియం పాళ్లు ఎక్కువ. ఎముకల దృఢత్వానికి ఇది ఉపయోగపడుతుంది. కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచి చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. రక్తపోటును నియంత్రణలో ఉంచుతుంది. బ్లడ్ షుగర్ లెవెల్స్ సైతం నియంత్రణలో ఉంటాయి. ప్రతిరోజూ కొన్ని గుమ్మడికాయ విత్తనాలు తింటే శరీరానికి కావలసిన ముఖ్యమైన పోషకాల్లో 14 నుంచి 42 శాతం వరకు అందుతాయి. గుమ్మడికాయ విత్తనాలు తినడం వల్ల ఫైటోస్టెరాల్ అనే మిశ్రమం శరీరానికి అందుతుంది. ఇది చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో సహాయపడుతుంది.ఈ విత్తనాల్లో యాంటీ ఫంగల్, యాంటీ వైరల్ గుణాలున్నాయి. జింక్, ఐరన్ సమృద్ధిగా లభిస్తాయి. ఇవి రెండూ రోగనిరోధక శక్తి పెంచడంలో సహాయపడతాయి.గుమ్మడికాయ విత్తనాల నుంచి తీసిన నూనె స్పెర్మ్ నాణ్యతను పెంచుతుందని పరిశోధనల్లో వెల్లడయింది. ఇందులో ఉండే జింక్‌కు మేల్ ఫెర్టిలిటీకి సంబంధం ఉంది.
జింక్ లోపం ఉన్న వారిలో స్పెర్మ్ నాణ్యత తక్కువ ఉన్నట్టు గుర్తించారు.బట్టతల రాకుండా చూసుకోవాలంటే గుమ్మడికాయ విత్తనాల నుంచి తీసిన నూనెను తలకు పట్టించాల్సిందే. ఈ నూనెలో ఫ్యాటీయాసిడ్స్తో పాటు విటమిన్-ఇ, ఫైటోఈస్ట్రోజెన్స్ ఉన్నాయి. ఇవి జుట్టు పెరుగుదల బాగుండేందుకు తోడ్పడతాయి.సాల్మన్ చేపలో లభించే ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఈ విత్తనాల్లోనూ లభిస్తాయి. శాకాహారులకు ఇది మంచి ఆహారంగా చెప్పుకోవచ్చు. ఇది గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుంది. రక్తనాళాలు గట్టిపడటాన్ని నిరోధిస్తుంది. నిద్రలేమితో బాధపడే వారు గుమ్మడికాయ విత్తనాలు తినడం వల్ల మంచి ప్రయోజనం ఉంటుంది. బరువు తగ్గడం కోసం ప్రయత్నాలు చేస్తున్న వారు తీసుకోదగిన ఫుడ్ ఇది.