జాతీయ జెండా కేరాఫ్‌ బెంగేరి

ABN , First Publish Date - 2020-08-15T05:30:00+05:30 IST

జాతీయ పతాక... దేశ సార్వభౌమత్వానికి ప్రతీక... ప్రజల ఆకాంక్షలకు చిహ్నం... జాతికి గర్వకారణం... ఢిల్లీ నుంచి గల్లీ వరకూ రెపరెపలాడే మన త్రివర్ణ పతాకాలన్నీ వచ్చేది ఒక చోటి నుంచే...

జాతీయ జెండా కేరాఫ్‌ బెంగేరి

జాతీయ పతాక... దేశ సార్వభౌమత్వానికి ప్రతీక... ప్రజల ఆకాంక్షలకు చిహ్నం... జాతికి గర్వకారణం... ఢిల్లీ నుంచి గల్లీ వరకూ రెపరెపలాడే మన త్రివర్ణ పతాకాలన్నీ వచ్చేది ఒక చోటి నుంచే... అదే జెండాల తయారీకి అధికారిక కార్ఖానా కర్ణాటకలోని బెంగేరి... అంతేకాదు, వాటిని రూపొందించే వారంతా మహిళలే!


ఎనిమిది వందల యాభై మంది జనాభా మాత్రమే ఉన్న ఒక చిన్న గ్రామం అది. కానీ భారతదేశ పటంలో మహా నగరాలకూ, పట్టణాలకూ లేని ఒక ప్రత్యేకత దానికి ఉంది. దేశ రాజధానిలోని ఎర్రకోట మొదలు వీధి బడి వరకూ... దేశంలోని ఏ ప్రధాన ప్రదేశంలోనైనా ఎగురవేసే జాతీయ జెండాలు అక్కడే తయారవుతాయి. ఆ గ్రామం పేరు బెంగేరి. కర్ణాటక రాష్ట్రంలోని హుబ్బల్లి (హుబ్లీ) నగరానికి నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉంది.

అరవై మూడేళ్ళ కిందటి మాట... ఖాదీ, గ్రామీణ పరిశ్రమలకు ప్రోత్సాహం... తద్వారా గ్రామీణ యువతకు ఉపాధి అందించాలన్న సంకల్పంతో కొందరు గాంధేయ వాదులు 1957 నవంబరు ఒకటిన కర్ణాటక ఖాదీ గ్రామోద్యోగ సంయుక్త సంఘ (కెకెజిఎస్‌ఎస్‌)ను బెంగేరి గ్రామంలో ఏర్పాటు చేశారు. క్రమంగా ఇది విస్తరించింది. కర్ణాటక రాష్ట్రంలో దాదాపు యాభై ఎనిమిది సంస్థలు ఒకే గొడుగు కి ందకు చేరడంతో ఇది ఒక సమాఖ్యగా రూపుదిద్దుకుంది. సమాఖ్య ద్వారా కాటన్‌ ఖాదీ, పోలివస్త్ర ఖాదీ, సిల్క్‌ ఖాదీ వస్త్రాలతో పాటు ఖాదీ సంచులు, టోపీలు, దుప్పట్లు తయారు చేస్తారు. హ్యాండ్‌మేడ్‌ పేపర్‌, సబ్బులు, శుద్ధి చేసిన తేనె, వివిధ చేతి వృత్తుల పరికరాలు కూడా ఈ సమాఖ్య ఉత్పత్తుల్లో ఉన్నాయి. క్రమంగా ఖాదీ ఉత్పత్తుల విక్రయాలు తగ్గిపోవడంతో ఒక దశలో వరుసగా నాలుగేళ్ళ పాటు ఈ సంఘం ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంది.


బిఎస్‌ఐ గుర్తింపు

జాతీయ చిహ్నాలు, పేర్లు, నిబంధనల చట్టం, 1950, జాతీయ గౌరవ చిహ్నాలను అవమానించడాన్ని నిరోధించే చట్టం, 1971లోని అంశాలను కలిపి ‘ఫ్లాగ్‌ కోడ్‌’గా 2002లో కేంద్ర ప్రభుత్వం అమలులోకి తెచ్చింది. దీనిలో నిర్దేశించిన ప్రమాణాలకు అనుగుణంగా జాతీయ పతాకాల తయారీకోసం ఒక సంస్థను గుర్తించే క్రమంలో ‘కెకెజిఎస్‌ఎస్‌’ అధికారుల దృష్టికి వచ్చింది. ఆ సంఘానికి మన జెండాను తయారు చేసే బాధ్యతను అప్పగించారు. అదే ‘కెకెజిఎస్‌ఎస్‌’కు ఒక గుర్తింపును తీసుకొచ్చింది. అధికారికంగా భారత జాతీయ పతాకాలను తయారు చేయడానికి అనుమతి పొందిన ఏకైక సంస్థ ఇదొక్కటే. వివిధ ప్రభుత్వ సంస్థలకూ, రక్షణ శాఖ, పారామిలటరీ దళాల్లో అధికారిక వినియోగానికీ ఇక్కడి నుంచే జెండాలు సరఫరా అవుతాయి. 2004లో జాతీయ పతాకాల తయారీని ఈ సంస్థ ప్రారంభించింది. 2006లో ‘బిఐఎస్‌’ సర్టిఫికెట్‌ సంపాదించుకుంది. 




తయారీ ఇలా...

భారత ప్రమాణాల సంస్థ (బిఐఎస్‌) నిర్దేశించిన ప్రమాణాల మేరకు పతాకాలను తయారు చేయాల్సి ఉంటుంది. కర్ణాటకలోనే ఉన్న భగల్‌కోట జిల్లా తులసిగెరిలో నేసిన ఖాదీ వస్త్రాన్ని మాత్రమే బెంగేరిలో జెండాల తయారీకి ఉపయోగిస్తారు. తెల్లటి ఖాదీ వస్త్రానికి డైల ద్వారా రంగులు వేస్తారు. ఆ తరువాత అవసరమైన సైజుల్లో కట్‌ చేస్తారు. తెల్ల రంగు భాగం మీద నీలంరంగు అశోక చక్రాన్ని స్ర్కీన్‌ ప్రింటింగ్‌ ద్వారా ముద్రిస్తారు. కాషాయ, తెల్లరంగు, ముదురాకు పచ్చ రంగుల వస్త్రాలు మూడింటినీ కలిపి బెంగేరీలో కుట్టడంతో త్రివర్ణ పతాకం సిద్ధం అవుతుంది. దాన్ని ఇస్త్రీ చేసి, ప్యాక్‌ చేస్తారు. కెకెజిఎస్‌ఎస్‌ జెండా తయారీ విభాగంలో అరవై కుట్టు యంత్రాలు ఉన్నాయి. వస్త్రం తయారీ, స్పిన్నింగ్‌ పనుల కోసం భగల్‌కోట్‌ జిల్లాలో 22 కేంద్రాలున్నాయి. వీటి ద్వారా సుమారు 1,200 మంది మహిళలు పని చేస్తున్నారు. భుల్‌కోట్‌, ధార్వాడ్‌, విజయపుర జిల్లాల్లో మహిళలు ఆర్థిక స్వాలంబనకు ఎన్నో ఏళ్ళుగా కెకెజిఎస్‌ఎస్‌ దోహదపడుతోంది.


Updated Date - 2020-08-15T05:30:00+05:30 IST