బెంగళూరులో వీకెండ్ కర్ఫ్యూ

ABN , First Publish Date - 2022-01-05T18:47:52+05:30 IST

రాష్ట్రంలో కరోనా, ఒమైక్రాన్‌ కేసులు విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి బసవరాజ్‌ బొమ్మై తన అధికార నివాసం కృష్ణలో ఆరోగ్యశాఖ నిపుణులు, ఉన్నతాధికారులు, మంత్రులతో మంగళవారం కీలక

బెంగళూరులో వీకెండ్ కర్ఫ్యూ

- రెండు వారాలు విద్యాసంస్థలకు సెలవు 

- 10, 12 తరగతులకు మినహాయింపు 

- కఠిన ఆంక్షలతో ప్రత్యేక గైడ్‌లైన్స్‌ జారీ

- మరింత పెరిగిన కరోనా, ఒమైక్రాన్‌ కేసులు

 

బెంగళూరు: రాష్ట్రంలో కరోనా, ఒమైక్రాన్‌ కేసులు విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి బసవరాజ్‌ బొమ్మై తన అధికార నివాసం కృష్ణలో ఆరోగ్యశాఖ నిపుణులు, ఉన్నతాధికారులు, మంత్రులతో మంగళవారం కీలక సమావేశం నిర్వహించారు. 3 గంటలకుపైగా ఉన్నతస్థాయి సమావేశం జరిగింది. అనంతరం రెవెన్యూశాఖ మంత్రి అశోక్‌, వైద్య,ఆరోగ్యశాఖ మంత్రి సుధాకర్‌ మీడియాతో మాట్లాడారు. శుక్రవారం రాత్రి నుంచే బెంగళూరు నగరంలో కఠిన ఆంక్షలు ప్రారంభమవుతాయన్నారు. రెండు వారాలపాటు ఈ ఆంక్షలు కొనసాగిస్తామన్నారు. రాజధాని బెంగళూరులో వారాంతపు కర్ఫ్యూ విధించాలని తీర్మానించామన్నారు. నిత్యావసర వస్తువులు, అత్యవసర సేవలు మినహా మిగిలినవాటికి అనుమతులు ఉండవన్నారు. వీకెండ్‌ కర్ఫ్యూ శుక్రవారం రాత్రి 10 గంటలకు ప్రారంభమై సోమవారం ఉదయం 6 వరకు కొనసాగుతుందన్నారు. కాగా మాల్స్‌, థియేటర్లు, పబ్‌లు, హోటళ్లు, బార్లలో 50 శాతం సీట్లకే అనుమతులు మంజూరు చేస్తామన్నారు. జాతరలు, బహిరంగ సభలు, ర్యాలీలు, అన్ని రకాల ఆధ్యాత్మిక కార్యక్రమాలను రద్దు చేస్తున్నట్లు పేర్కొన్నారు. గురువారం నుంచి 10, 12 తరగతులు మినహా మిగిలిన అన్ని తరగతుల విద్యాసంస్థలను రెండువారాలపాటు మూసివేయాలని నిర్ణయించామన్నారు. 

Updated Date - 2022-01-05T18:47:52+05:30 IST