భగ్గుమన్న బెంగళూరు

ABN , First Publish Date - 2020-08-13T07:14:17+05:30 IST

ఒక మతంపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేస్తూ పెట్టిన సోషల్‌ మీడియా పోస్టుతో బెంగళూరు భగ్గుమంది. నగరంలోని పులకేశి నగర్‌ నియోజకవర్గం అల్లర్లతో అట్టుడికింది. మంగళవారం రాత్రి నుంచి బుధవారం తెల్లవారుజాము వరకు విధ్వంసం కొనసాగింది...

భగ్గుమన్న బెంగళూరు

  • దాడులతో వణికిన పులకేశి నగర్‌
  • కాంగ్రెస్‌ ఎమ్మెల్యే మేనల్లుడి 
  • సోషల్‌ మీడియా పోస్టింగ్‌తో చిచ్చు
  • ఎమ్మెల్యే ఇల్లు లూటీ.. ఇంటికి నిప్పు
  • రెండు పోలీసు స్టేషన్లూ ధ్వంసం
  • డజన్ల కొద్దీ వాహనాల దహనం
  • పోలీసు కాల్పుల్లో ముగ్గురి మృతి 
  • పోలీసులు, జర్నలిస్టులకు గాయాలు
  • ఎంతటి వారైనా వదిలేది లేదు
  • విచారణకు కర్ణాటక సీఎం ఆదేశం
  • ప్రభుత్వానికి పూర్తి మద్దతు: విపక్షాలు


బెంగళూరు హింసాకాండ సమయంలో కుల, మతాలకు అతీతంగా ముస్లిం యువకులు చేసిన ప్రయత్నం ప్రశంసలను పొందుతోంది. డీజే హళ్లి ప్రాంతంలోని శాంపురా మెయిన్‌ రోడ్‌లో హనుమాన్‌ ఆలయం ఉంది. దీనిపై కూడా ఆందోళన కారులు దాడి చేసి, ధ్వంసం చేసేందుకు ప్రయత్నించారు. దీనిని పసిగట్టిన వంద మందికి పైగా ముస్లిం యువకులు మానవహారంగా ఏర్పడి ఆలయం జోలికి రాకుండా ఆందోళనకారులను అడ్డుకున్నారు.



బెంగళూరు, ఆగస్టు 12 (ఆంధ్రజ్యోతి): ఒక మతంపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేస్తూ పెట్టిన సోషల్‌ మీడియా పోస్టుతో బెంగళూరు భగ్గుమంది. నగరంలోని పులకేశి నగర్‌ నియోజకవర్గం అల్లర్లతో అట్టుడికింది.  మంగళవారం రాత్రి నుంచి బుధవారం తెల్లవారుజాము వరకు విధ్వంసం కొనసాగింది. పెట్రోలు బాంబులు, రాళ్ల వర్షం కురిసింది. పోలీసులు జరిపిన కాల్పుల్లో ముగ్గురు యువకులు మరణించారు. పోలీసు అధికారులు తెలిపిన వివరాల ప్రకారం...పులకేశినగర్‌ కాంగ్రెస్‌ ఎమ్మెల్యే అఖండ శ్రీనివాసమూర్తి మేనల్లుడు నవీన్‌ సోషల్‌ మీడియాలో పెట్టిన పోస్టింగ్‌తో రచ్చ మొదలైంది. మంగళవారం రాత్రి దాదాపు మూడు వేల మందికిపైగా ఆందోళనకారులు రోడ్ల మీదకి వచ్చారు. తొలుత ఎమ్మెల్యే ఇంటిని లూటీ చేశారు. ఇంటికి నిప్పుపెట్టారు. ఈ ఘటనలో ఎమ్మెల్యే ఇల్లు పూర్తిగా బూడిదైపోయింది. ఆందోళనకారులు రోడ్ల వెంబడి ఉన్న వాహనాలను దహనం చేశారు.  దేవరజీవనహళ్లి, కాడుగొండనహళ్లి పోలీసు స్టేషన్లపై ఆందోళనకారులు దాడిచేసి ప్రజలు, ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేశారు. మీడియా ప్రతినిధులపై రాళ్ల వర్షం కురిపించారు. పోలీసులు రంగంలోకి దిగి ఆందోళనలకారులపై లాఠీచార్జి చేశారు. భాష్పవాయు గోళాలను ప్రయోగించారు. అప్పటికీ పరిస్థితి అదుపులోకి రాకపోవడంతో కాల్పులకు దిగారు. పోలీసు కాల్పుల్లో ముగ్గురు మృతిచెందారు. మృతులంతా 25 ఏళ్లలోపు యువకులే. ఈ ఘర్షణల్లో 60 మంది పోలీసులు సహా 200 మంది తీవ్రంగా గాయపడ్డారని... దాడులకు పాల్పడిన వారిలో 140 మందిని అరెస్టు చేశామని నగర పోలీసు కమిషనర్‌ పంత్‌ తెలిపారు. కాగా, ఆందోళనకారుల దాడిసమయంలో ఎమ్మెల్యే ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ప్రాణాపాయం తప్పిందన్నారు. 




కఠిన చర్యలు: సీఎం

హింసాకాండపై ముఖ్యమంత్రి యడ్యూరప్ప  న్యాయవిచారణకు ఆదేశించారు. దాడికి దిగిన వారు ఏమతం వారైనా సరే ఉపేక్షించే ప్రశ్నేలేదని, వారిని క్షమించబోమని స్పష్టం చేశారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం విధ్వంసాల్లో జరిగిన నష్టాన్ని అల్లరిమూకల నుంచే రాబడతామని హోం మంత్రి బసవరాజ్‌ బొమ్మై తెలిపారు. ‘‘దీని వెనుక ఎస్‌డీపీఐ ఉన్నా, పాపులర్‌ ఫ్రంట్‌ ఉన్నా ఎవ్వరినీ వదిలిపెట్టం. ఏ కలుగులో నక్కినా వెంటాడి పట్టుకుంటాం’’ అని రెవెన్యూ మంత్రి అశోక ప్రకటించారు.  ఇదిలావుంటే, ముందస్తు పథకం ప్రకారమే ఆందోళనకారులు దాడులకు దిగారని బీజేపీ నేతలు ఆరోపించారు. అల్లరిమూకలపై గూండా యాక్ట్‌ను ప్రయోగించాలని బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు నళిన్‌కుమార్‌ కటీల్‌ డిమాండ్‌ చేశారు. ఎస్‌డీపీఐ, పీఎ్‌ఫఐ సంస్థలను నిషేధించాలని డిమాండ్‌ చేశారు. కాగా, బెంగళూరు హింసాకాండను పార్టీలకు అతీతంగా నేతలందరూ ఖండించారు. కారకులపై కఠిన చర్యలు తీసుకోవాలని సీఎంను కోరారు. బెంగళూరులో హింసాకాండ చోటు చేసుకున్న నేపథ్యంలో కేంద్ర బలగాలు రంగంలోకి దిగాయి. ఇప్పటికే 120 మందితో కూడిన ఆర్‌ఏఎఫ్‌ బెటాలియన్‌ నగరానికి చేరుకోగా, హైదరాబాదు నుంచి మరో బెటాలియన్‌ గురువారం చేరుకోనుంది. 


రక్షణ కల్పించండి: ఎమ్మెల్యే

అల్లరి మూకలు తన ఇంటిని పెట్రోల్‌ బాంబులు వేసి తగలపెట్టారని, ఇంట్లోని ఆభరణాలను, వస్తువులను లూటీ చేశారని ఎమ్మెల్యే అఖండ శ్రీనివాసమూర్తి ఆరోపించారు. బెంగళూరు విధానసౌధలో బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. తీవ్ర ఉద్వేగానికిలోనై కంటతడిపెట్టారు. తనకు, తన కుటుంబానికి రక్షణ కల్పించాలని సీఎంకు విజ్ఞప్తిచేశారు. తన అక్క కుమారుడు నవీన్‌తో తనకు పదేళ్లుగా ఎలాంటి సంబంధాలూ లేవన్నారు. ఎమ్మెల్యేకు సీఎం యడియూరప్ప బుధవారం ఫోన్‌చేసి పరామర్శించారు. కేపీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్‌తో పాటు పలువురు నేతలు ఎమ్మెల్యే నివాసానికి వెళ్లి పరిశీలించారు. 


Updated Date - 2020-08-13T07:14:17+05:30 IST