Chicken Pakodi: చిచ్చు పెట్టిన చికెన్ పకోడీ.. భార్యపై దాడి చేసిన భర్త.. ఆ తర్వాత అతను ఎంత పని చేశాడంటే..

ABN , First Publish Date - 2022-08-02T21:13:33+05:30 IST

భార్యాభర్తల మధ్య చికెన్ పకోడీ చిచ్చు పెట్టింది.. భార్య చేసిన చికెన్ పకోడీ రుచిగా లేదనే కారణంతో భర్త తీవ్ర ఆగ్రహానికి గురయ్యాడు..

Chicken Pakodi: చిచ్చు పెట్టిన చికెన్ పకోడీ.. భార్యపై దాడి చేసిన భర్త.. ఆ తర్వాత అతను ఎంత పని చేశాడంటే..

భార్యాభర్తల మధ్య చికెన్ పకోడీ చిచ్చు పెట్టింది.. భార్య చేసిన చికెన్ పకోడీ రుచిగా లేదనే కారణంతో భర్త తీవ్ర ఆగ్రహానికి గురయ్యాడు.. ఆమెను చితక్కొట్టాడు.. ఆ తర్వాత కత్తితో ఆమెపై దాడి చేశాడు.. అనంతరం తీవ్ర భయాందోళనకు గురై చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.. బెంగళూరు (Bangaluru) నగరంలోని అరెకెరే లే ఔట్‌లో గత గురువారం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 


ఇది కూడా చదవండి..

Bihar Student: ఇదెక్కడి విడ్డూరం.. పరీక్షలో 100కు 151 మార్కులు సాధించిన విద్యార్థి.. కారణమేంటంటే..



బొమ్మనహళ్లిలోని ఓ గార్మెంట్స్ ఫ్యాక్టరీలో విధులు నిర్వర్తించే సురేష్ (48) అనే వ్యక్తి గత గురువారం ఆఫీస్ నుంచి వచ్చి భార్య షాలినిని చికెన్ పకోడి (chicken pakodi) చేయమని అడిగాడు. భర్త కోరిక మేరకు షాలిని చికెన్ పకోడీ చేసింది. అయితే సురేశ్‌కు భార్య చేసిన చికెన్ పకోడి రుచి నచ్చలేదు. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురై భార్య షాలినిని తీవ్రంగా కొట్టాడు. అంతటితో ఆగకుండా ఇంట్లో ఉన్న కత్తితో (Husband stabs wife) దాడి చేశాడు. షాలిని తల, చేతులపై గాయాలై రక్తస్రావం అవుతుండడంతో సురేశ్ అక్కడి నుంచి పరారయ్యాడు.


షాలిని కేకలు విన్న చుట్టుపక్కల వారు ఆమెను వెంటనే ఆసుపత్రికి తరలించారు. సమచారం అందుకున్న పోలీసులు షాలిని వాంగ్మూలం తీసుకుని సురేశ్‌పై కేసు నమోదు చేశారు. పరారైన సురేశ్ కోసం అన్వేషణ ప్రారంభించారు. అయితే సురేశ్ తన ఇంటికి సమీపంలో ఉన్న ఓ చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. భార్యపై చేసిన దాడికి సంబంధించి భయాందోళనకు గురైన సురేష్ ఆత్మహత్య చేసుకుని ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు.

Updated Date - 2022-08-02T21:13:33+05:30 IST