
బెంగళూరు(Karnataka): బెంగళూరులోని హెణ్ణూరు పోలీస్స్టేషన్ సబ్-ఇన్స్పెక్టర్పై దాడికి పాల్పడి పరారయ్యేందుకు ప్రయత్నించిన నిందితుడు రఘుపై పోలీసులు కాల్పులు జరిపిన ఘటన మంగళవారం సంభవించింది. నగరంలోని పిల్లారెడ్డి నగర్ నివాసి రఘు (30) ఓ హత్యకేసులో నిందితుడిగా ఉ న్నాడు. ఈనెల 13న మధ్యాహ్నం 12 గంటల సమయంలో గార్మెంట్ సంస్థ యజమాని శ్రీధర్ కారులో వెళుతుండగా రఘు, అతడి సహచరులు వెంటాడి కత్తులతో పొడిచి కిరాతకంగా హతమార్చారు. ఈఘటనకు సంబంధించి హెణ్ణూరు పోలీసులు ఆరుగురిని అరెస్టు చేశారు. వ్యక్తిగత కక్షలతోనే హత్య జరిగిందని తేల్చారు. హత్యాప్రదేశం మహజరుకు సంబంధించి హెణ్ణూరు పోలీస్స్టేషన్ ఇన్స్పెక్టర్ వసంతకుమార్, ఎస్ఐ లింగరాజు ఇతర సిబ్బంది ఈ కేసులో కీలక నిందితుడిగా ఉన్న రఘును మంగళవారం ఘటనా ప్రదేశానికి తీసుకొచ్చారు. ఈ సమయంలో ఎస్ఐ లింగరాజుపై దాడి చేసి రఘు పారిపోయే ప్రయత్నం చేయగా ఇన్స్పెక్టర్ వసంతకుమార్ లొంగిపోవాల్సిందిగా హెచ్చరిస్తూ తొలుత ఒక రౌండు గాలిలోకి కాల్పులు జరిపారు. అప్పటికీ లొంగకపోవడంతో నిందితుడి కాలిపై కాల్పులు జరిపారు. గాయపడ్డ రఘును బౌరింగ్ ఆసుపత్రికి తరలించారు. అతడికి ప్రాణాపాయం లేదని వైద్యులు తెలిపారు. తాజాగా పోలీసులు నిందితుడి రఘు పై మరో హత్యాయత్నం కేసు నమోదు చేశారు.