Bengaluruలో కోటి దాటిన వాహనాలు

ABN , First Publish Date - 2022-05-11T18:44:01+05:30 IST

రాజధాని బెంగళూరు నగరంలో అంచనాలకు మించి జనాభా పెరుగుతుండగా అందుకు అనుగుణంగా ప్రైవేటు వాహనాల సంఖ్య కూడా ఒక కోటి దాటడం గమనార్హం. నగరంలో

Bengaluruలో కోటి దాటిన వాహనాలు

                   - మరింత సంక్లిష్టం కానున్న ట్రాఫిక్‌ సమస్య


బెంగళూరు: రాజధాని బెంగళూరు నగరంలో అంచనాలకు మించి జనాభా పెరుగుతుండగా అందుకు అనుగుణంగా ప్రైవేటు వాహనాల సంఖ్య కూడా ఒక కోటి దాటడం గమనార్హం. నగరంలో ట్రాఫిక్‌ రద్దీకి, వాతావరణ కాలుష్యానికి వాహనాల సంఖ్య పెరగడం ఒక కారణంగా ఉంటోంది. ప్రజా రవాణా అయిన బీఎంటీసీ వాహనాలను, నమ్మ మెట్రో సేవలను వినియోగించుకోవాలని ప్రభుత్వం ప్రచారం చేస్తున్నప్పటికీ ప్రజలు మాత్రం సొంత వాహనాల వాడకానికి ఆసక్తి చూపడం విశేషం. ఈ కారణంగా ఏటా బెంగళూరు నగరంలో లక్షలాది వాహనాల రిజిస్ట్రేషన్‌ అవుతున్నాయి. నగరంలో జనాభా 1.30కోట్లుగా ఉండగా ఇంతవరకు నగరంలో 1,03,21,000కుపైగా ప్రైవేటు వాహనాలు నమోదయ్యాయి. ఒక్కో ఇంట్లో ఇద్దరు ముగ్గురు ఉన్నా ఉద్యోగం, వ్యాపారం, పిల్లలకోసం ఇలా పలు కారణాలతో సొంతవాహనాలు అంత కంటే ఎక్కువగానే ఉంటున్నాయి. 2022 మే 1 నాటికి బెంగళూరులో వాహనాల రిజిస్ట్రేషన్‌ గమనిస్తే ద్విచక్రవాహనాలు 68,72,763, కార్లు 21,74,830, ట్రక్‌, లారీలు 1,15,000, ట్యాక్సీలు, ఆటోలు 3,50,000 ఇతరత్రా కలిపి 1,03,21,583 వాహనాలు రిజిస్ట్రేషన్‌ అయినట్టు రోడ్డు రవాణాశాఖ వెల్లడించింది. బీబీఎంపీ పరిధిలో రోడ్లు కేవలం 60లక్షల వాహనాలు భరించే సామర్థ్యం ఉండగా ప్రస్తుతం వీటి సంఖ్య కోటి దాటడంతో రహదారులు నాణ్యతా ప్రమాణాలు కోల్పోతున్నట్టు సామాజిక కార్యకర్త అమరేశ్‌ అభిప్రాయపడ్డారు. 

Read more