Bengaluruలో పెరుగుతున్న Covid పాజిటివ్ కేసులు

ABN , First Publish Date - 2022-06-14T16:55:55+05:30 IST

కొవిడ్‌ కేసులు ఇటీవల వారం రోజులుగా బెంగళూరు కేంద్రంగానే అత్యధికంగా నమోదవుతున్నాయి. రాష్ట్రంలో నమోదయ్యే కేసులలో 90శాతానికిపైగా

Bengaluruలో పెరుగుతున్న Covid పాజిటివ్ కేసులు

బెంగళూరు, జూన్‌ 13 (ఆంధ్రజ్యోతి): కొవిడ్‌ కేసులు ఇటీవల వారం రోజులుగా బెంగళూరు కేంద్రంగానే అత్యధికంగా నమోదవుతున్నాయి. రాష్ట్రంలో నమోదయ్యే కేసులలో 90శాతానికిపైగా బెంగళూరులోనే ఉంటున్నాయి. ఇది వరకు 1.1శాతంగా పాజిటివిటీ రేటు ఉండగా తాజాగా 2.15శాతం దాటింది. ఆదివారం విడుదలైన బులెటిన్‌ ప్రకారం బెంగళూరులో 429 కేసులు నమో దయ్యాయి. అన్ని వార్డులలోనూ కొవిడ్‌ కేసులు క్రమేపీ పెరుగుతున్నాయి. మహదేవపుర, బొమ్మనహళ్ళి డివిజన్‌లోనే ఎక్కువమంది బాధితులు నమోదైనట్టు తెలుస్తోంది. ఇతర వార్డులతోపోలిస్తే బెళ్ళందూరు, వర్తూరు, హగదూరులలో జనాభా అధికంగా ఉండగా ఇక్కడ ఎక్కువ కొవిడ్‌ కేసులు నమోదైనట్టు బీబీఎంపీ ఆరోగ్య అధికారి (మహదేవపుర డివిజన్‌) డాక్టర్‌ సురేందర్‌ వెల్లడించారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలనుంచి నగరానికి వలసలు రావడం, కూలి కార్మికులు అధికంగా ఉంటున్న ప్రాంతాలలోనే కొవిడ్‌ కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయని బీబీఎంపీ అధికారులు వెల్లడించారు. కొవిడ్‌ ప్రభావం క్రమేపీ అధికమవుతున్న తరుణంలో మాస్కు తప్పనిసరి, ఇతర ఆంక్షలు విధించాల్సి వస్తుందని అధికారులు అంటున్నారు. మరోవైపు కొవిడ్‌ పరీక్షలు పెంచడం, వ్యాక్సిన్‌ రెండో డోసు, బూస్టర్‌ డోసు శిబిరాల నిర్వహణపై దృష్టి సారిస్తున్నామన్నారు. 


పెరుగుతున్న డెంగీ జ్వరాలు 

ఒకపక్క కొవిడ్‌ కేసులతోపాటు రాష్ట్రంలోని పలు ప్రాంతాలలో డెంగీ జ్వరాలు అధికంగా ఉండ డంతో సర్వత్రా కలకలం చెలరేగుతోంది. అప్రమత్తంగా ఉండాల్సిందిగా అన్ని జిల్లాలఆరోగ్యశాఖ అధికారులకు స్పష్టమైన సూచనలు చేశామని ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్‌ కే సుధాకర్‌ నగరంలో సోమవారం మీడియాకు తెలిపారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నట్టు తెలిపారు. ఒకవేళ జ్వరం వచ్చినా ఆందోళన చెందవద్దని, కొవిడ్‌ పరీక్షలకు సిద్ధం కావాలని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు. 


Updated Date - 2022-06-14T16:55:55+05:30 IST