యూపీఐ ట్రాన్స్‌ఫర్ తప్పిదం..కస్టమర్‌కు రూ.10,000 తిరిగి ఇచ్చేసిన ఆటో డ్రైవర్

ABN , First Publish Date - 2022-01-25T18:52:11+05:30 IST

అడిగిన చోటికి రాలేదని, ఎక్కువ చార్జీలు డిమాండ్ చేశారని బెంగళూరు ఆటో డ్రైవర్లపై తరచు ప్రయాణికులు..

యూపీఐ ట్రాన్స్‌ఫర్ తప్పిదం..కస్టమర్‌కు రూ.10,000 తిరిగి ఇచ్చేసిన ఆటో డ్రైవర్

బెంగళూరు: అడిగిన చోటికి రాలేదని, ఎక్కువ చార్జీలు డిమాండ్ చేశారని బెంగళూరు ఆటో డ్రైవర్లపై తరచు ప్రయాణికులు ఫిర్యాదు చేస్తుంటారు. అయితే ''కస్టమర్ ఫ్రండ్లీ'' డ్రైవర్లు కూడా ఉంటారని చామరాజ్‌పేటకు 58 ఏళ్ల ఆటో డ్రైవర్ ఆర్.గోపీ నిరూపించాడు. తన నిజాయితీని చాటుకుని అందరి మన్ననలు అందుకుంటున్నాడు. పొరపాటున యూపీఏ ట్రాన్స్‌ఫర్‌ ద్వారా ఓ కస్టమర్ నుంచి తనకు వచ్చిన రూ.10,000 అదే కస్టమర్‌కు తిరిగి పంపించి మంచితనం చాటుకున్నాడు.


ఐటీ కన్సెల్టెంట్, న్యాయవాది అయిన శివకుమార్ సోమవారం ఉదయం 7.30 గంటలకు ఆనంద్ రావు సర్కిల్ నుంచి గోపి ఆటోలో ప్రయాణించి రాజాజీనగర్‌ వెళ్లాడు. ఆటో ఫేర్ రూ.120 కావడంతో ఆ సొమ్మును యూపీఐ (యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్) ద్వారా పంపాడు. ఆ తర్వాత కొద్ది సేపటికి శివకుమార్ ఫ్రెండ్‌ ఒకరికి రూ.10,000 అవసరం పడింది. అదే యాప్ ద్వారా డబ్బులు పంపమని అతను శివకుమార్‌ను కోరాడు. శివకుమార్ ఆ సొమ్మును పొరపాటున గోపికి ట్రాన్స్‌ఫర్ చేశారు. ఆ తర్వాత జరిగిన పొరపాటును తెలుసుకుని అంతపెద్ద మొత్తం ఎలా తిరిగివస్తుందనే ఆందోళనకు గురయ్యాడు. అయితే, అతని భయాందోళనలన్నీ పటాపంటలయ్యాయి.


దీనిపై గోపీ మాట్లాడుతూ...''నేను ఆటోలో వేరే ప్యాసింజర్‌ను తీసుకు వెళ్తుండగా కుమార్ నుంచి ఫోన్ వచ్చింది. ఆ తర్వాత నా ఫోన్‌లో బ్యాలెన్స్ చూసుకున్నారు. ఉండాల్సిన సొమ్ము కన్నా ఎక్కువ ఉన్నట్టు గమనించాను. డబ్బులు వచ్చినట్టు కుమార్‌కు వెంటనే చెప్పాను. కానీ, ఆ అప్లికేషన్ ఎలా సొంతంగా ఉపయోగించి పంపించాలే తెలియలేదు. అయితే వేరే వాళ్ల సాయం తీసుకుని ఆ డబ్బులు కుమార్‌కు పంపేశాను. ఆయన సైతం డబ్బులు అందినట్టు ధ్రువీకరించారు'' అని చెప్పాడు.


కాగా, ఆటో డ్రైవర్ గోపి నిజాయితీని కుమార్ అభినందించారు. జరిగిన మొత్తం విషయాన్ని, ఆటో డ్రైవర్ నిజాయితీని వివరిస్తూ సిటీ పోలీస్ కమిషనర్‌కు లేఖ రాశాననీ, నిజాయితీ కలిగిన వ్యక్తులను గౌరవించి, వారి నిజాయితీని అందరికీ తెలియజేసినప్పుడే వారి నుంచి సమాజం కూడా మంచి పాఠాలు నేర్చుకుంటుందని ఆయన ప్రశంసలు కురిపించాడు.


ఆర్థిక ఇబ్బందులున్నా..

ఆటో డ్రైవర్ గోపి తన ఆర్థిక ఇబ్బందులు వివరిస్తూ..ఎన్నో సార్లు ఇబ్బందులు ఎదుర్కొన్నానని, ఒక్కోసారి ఇంటి అద్దె కూడా ఇవ్వలేకపోయేవాడినని మీడియాకు చెప్పాడు. అయితే ఇంకొకరు కష్టపడి కూడబెట్టిన సొమ్ము తనకు అవసరం లేదని, మనం కష్టపడినప్పుడే ఇతరులు కూడా మనను చూసి నేర్చుకుంటారని  అన్నాడు. తాను హెవీ వెహికల్స్ నడిపేవాడినని, కరోనా భయాల కారణంగా ట్రాన్స్‌పోర్ట్ పనులు లేకపోవడంతో ఆటో నడుపుతున్నట్టు చెప్పాడు.

Updated Date - 2022-01-25T18:52:11+05:30 IST