Advertisement
Advertisement
Abn logo
Advertisement
Mar 6 2021 @ 19:54PM

బెంగాలీ నటులు దేబశ్రీ, రాహుల్ బీజేపీలో చేరిక

కోల్‌కతా : పశ్చిమ బెంగాల్ శాసన సభ ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ బీజేపీలోకి ప్రముఖుల చేరికలు పెరుగుతున్నాయి. తాజాగా బెంగాలీ నటులు రాహుల్ చక్రవర్తి, దేవశ్రీ భట్టాచార్య ఆ పార్టీలో చేరారు. బెంగాల్ బీజేపీ శాఖ అధ్యక్షుడు దిలీప్ ఘోష్ సమక్షంలో వీరు ఆ పార్టీలో చేరారు. 


దిలీప్ ఘోష్ శనివారం నిర్వహించిన విలేకర్ల సమావేశంలో రాహుల్ చక్రవర్తి, దేవశ్రీ భట్టాచార్య సహా టీఎంసీ మాజీ ఎమ్మెల్యే దీపాలీ సాహా, టీఎంసీ విద్యార్థి విభాగం రాష్ట్ర కార్యదర్శి కనిష్క మజుందార్, టీఎంసీ యువజన నేతలు సౌరవ్ రాయ్‌ చౌదరి, సాయన్ ముఖర్జీ, శుభంకర్ బీజేపీలో చేరారు. వీరితోపాటు గుర్ బంగా విశ్వవిద్యాలయం అసిస్టెంట్ ప్రొఫెసర్ గోపాల్ చంద్ర కృష్ణ, మరికొందరు ఆ పార్టీలో చేరారు. 


నరేంద్ర మోదీ చాలా పెద్ద తార : రాహుల్

రాహుల్ చక్రవర్తి మీడియాతో మాట్లాడుతూ, తాను క్రమశిక్షణగల వ్యక్తినని, బీజేపీ క్రమశిక్షణగల పార్టీ అని తెలిపారు. బీజేపీలో చేరాలనే నిర్ణయాన్ని గతంలోనే తీసుకున్నానని, అయితే సరైన సమయం కోసం వేచి చూశానని చెప్పారు. రానున్న ఎన్నికల్లో పోటీ చేయడం గురించి ఇంకా చర్చించలేదన్నారు. తాను పని చేయడానికి వచ్చానని, సీనియర్లు తీసుకునే నిర్ణయానికి కట్టుబడి ఉంటానని అన్నారు. బీజేపీ, టీఎంసీలలో సెలబ్రిటీలు చేరుతుండటం గురించి అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ, చాలా పెద్ద తార నరేంద్ర మోదీ అని రాహుల్ చెప్పారు. 


బంగారు బెంగాల్ కోసం : దేవశ్రీ

దేవశ్రీ భట్టాచార్య మీడియాతో మాట్లాడుతూ, స్వచ్ఛమైన పశ్చిమ బెంగాల్ సాధన కోసం తాను బీజేపీలో చేరానని చెప్పారు. బీజేపీ అతి పెద్ద పార్టీ అని, అందుకే ఆ పార్టీతో చేతులు కలిపానని తెలిపారు. తనకు టీఎంసీలో సరైన గౌరవం దక్కలేదన్నారు. టీఎంసీలో అవినీతి పెరిగిందన్నారు. బీజేపీ స్వచ్ఛమైన పార్టీ అని తెలిపారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, బీజేపీ బెంగాల్ చీఫ్ దిలీప్ ఘోష్ కలలుగంటున్న బంగారు బెంగాల్ సాధన కోసం బీజేపీలో చేరానని తెలిపారు.


మార్చి 27 నుంచి ఎన్నికలు

294 స్థానాలున్న పశ్చిమ బెంగాల్ శాసన సభ ఎన్నికలు ఎనిమిది దశల్లో జరుగుతాయి. మార్చి 27న మొదటి దశ ఎన్నికలు జరుగుతాయి.  8వ, చివరి విడత ఎన్నికలు ఏప్రిల్ 29న జరుగుతాయి. ఓట్ల లెక్కింపు మే 2న జరుగుతుంది. 


Advertisement
Advertisement