Abn logo
Apr 13 2021 @ 01:15AM

బెంగాల్‌ యుద్ధం

పశ్చిమ బెంగాల్‌ ఎన్నికల ప్రక్రియలో ఇంకా నాలుగుదశలు మిగిలిఉండగా, మొన్న నాలుగోదశ సందర్భంగా జరిగిన హింస ఆందోళన కలిగిస్తోంది. ఈ హింసకు కారకులు మీరేనంటూ బీజేపీ, తృణమూల్‌ పరస్పరం విమర్శలు చేసుకుంటున్నాయి. కూచ్‌బిహార్‌ హింస కమలం కుట్ర అనీ, కేంద్రమంత్రి అమిత్‌షా దీనికి బాధ్యులని ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆరోపించారు. ఓటమి భయంతోనే మమత ఇంతటి ఘాతుకానికి తెగించారనీ, బీజేపీకి దక్కుతున్న ప్రజాదరణ చూసి ఓర్వలేక ఆమె ఇలా హింసను ప్రేరేపిస్తున్నారని ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆరోపించారు. ఎన్నికల సభలో మాట్లాడుతూ ఈ మాటలన్నారు కనుక, ఏ విచారణలూ, దర్యాప్తులూ లేకుండానే సాక్షాత్తూ ప్రధాని ఇలా ఎలా నిర్థారిస్తారని మనం ఆశ్చర్యపోనక్కరలేదు.


ఒక్క బెంగాల్‌లోనే ఎన్నికల ప్రక్రియను ఇలా ఎనిమిది విడతలకు సాగదీయడం వెనుక కేంద్రం కుట్ర ఉన్నదని మమతాబెనర్జీ ఆదిలోనే ఆరోపించారు. ఎన్నికల్లో అవకతవకలను, హింసను అడ్డుకోవాలంటే, ప్రత్యేక బలగాలను భారీ ఎత్తున దింపడంతో పాటు, ఒకచోటనుంచి మరొకచోటకు తరలించడానికి ప్రక్రియను ఇలా సాగదీసివుండవచ్చు. కానీ, వెయ్యికంపెనీల కేంద్రబలగాలున్నా హింసను నివారించలేకపోగా, వారి చేతుల్లోని రైఫిళ్ళను లాక్కొనేందుకు జరిగిన ఓ ప్రయత్నమే నలుగురి మరణానికి కారణం కావడం విషాదం. రెండుగంటల్లో సీఐఎస్‌ఎఫ్‌ సిబ్బంది రెండుసార్లు కాల్పులు జరపడంతో మరో అరడజనుమంది గాయపడ్డారు. కేంద్రబలగాలను అడ్డుకోవాలనీ, ఘెరావ్‌ చేయాలనీ మమత పిలుపునివ్వడంతోనే ఈ హింస జరిగిందని అమిత్‌షా ఆరోపణ. కేంద్రబలగాలు బీజేపీకి బాహాటంగా సహకరిస్తూ తృణమూల్‌ను మాత్రం ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నాయని మమత ఆరోపణ. తృణమూల్‌ ఓటర్లనూ, కార్యకర్తలను భయపెట్టే లక్ష్యంతో ఈ కాల్పులు జరిగాయనీ, ఓటేయడానికి ఎవరూ భయపడవద్దని ఆమె అంటున్నారు. 


కేంద్రబలగాలు ఆత్మరక్షణార్థమే కాల్పులు జరపాల్సి వచ్చిందని ఎన్నికల సంఘం నిర్థారించి బెంగాల్‌కు మరిన్ని బలగాలు పంపింది. తుపాకులు లాక్కోవడానికి ప్రయత్నించారని అంటున్న ఆ కొద్దిమంది జనాన్నీ సీఐఎస్ఎఫ్‌ బలగాలు ఇతరత్రా మార్గాల్లో ఎందుకు నిలువరించలేకపోయాయో అర్థంకావడం లేదు. ఏ హెచ్చరికలూ లేకుండా, కనీసం లాఠీలను కూడా వినియోగించకుండా నేరుగా కక్షపూర్వకంగా కాల్చేశారని మమత ఆరోపణ. ఈ వాదనను విశ్వసించకూడదనుకున్నా, కేంద్రబలగాలు ముందుగా మూకను నియంత్రించే, కాల్పులను నివారించే ప్రయత్నాలు శక్తిమేర చేసినట్టు కనిపించదు. 


పశ్చిమబెంగాల్‌ ఎన్నికలు రెండు పార్టీల కంటే, ఇద్దరు వ్యక్తుల మధ్య సాగుతున్న యుద్ధంగా మారిపోయాయి. బెంగాల్‌ను వశం చేసుకోవడంతో పాటు, మమతను ఇప్పుడే ఇక్కడే అడ్డకపోతే సార్వత్రక ఎన్నికల నాటికి ఢిల్లీలో చక్రం తిప్పే అవకాశం ఏర్పడుతుందని బీజేపీ నాయకుల భయం. ప్రతీ ఎన్నికనూ ప్రతిష్ఠాత్మకంగా తీసుకొనే బీజేపీ, బెంగాల్‌ ఎన్నికలను ఏకంగా ఓ మహాయుద్ధంలాగా మార్చివేసింది. ఎన్నికల సంఘం మధ్యలో నలిగిపోతున్నమాట నిజమే కానీ, కొన్ని నిర్ణయాలు దానికి మరింత అప్రదిష్ఠ తెస్తున్నాయి. ఎన్నికల ప్రక్రియను నెలరోజులు సాగదీయడంతో పోలింగ్‌ జరుగుతున్న ప్రాంతాల్లోని ఓటర్లను కేంద్రపాలకులు ప్రభావితం చేసేందుకు అవకాశం ఏర్పడిందని మమత వాదన. మోదీ, అమిత్‌షాలతో పాటు, కేంద్రమంత్రులు, ముఖ్యమంత్రులు, సినీనటులు, బీజేపీ యోధానుయోధులంతా రాష్ట్రానికి వరుసకడుతూ పొరుగు ప్రాంతాల్లో జోరుగా ప్రచారం సాగిస్తుంటే, పోలింగ్‌ నడుస్తున్న చోట ఆ వ్యాఖ్యల ప్రభావం లేకుండా ఎలా ఉంటుంది? ఒంటరిపోరాటం చేస్తున్న మమత మోడల్‌ కోడ్‌ను మోదీ కోడ్‌గా అభివర్ణించడం సముచితం కాదు కానీ, ఈ ఎన్నికల్లో మోదీ పాత్ర మరీ పెరిగిపోవడంతో ఎన్నికల సంఘానికి కూడా న్యాయం చెప్పడం కష్టమే అవుతున్నది. ముస్లింలు తమ ఓట్లు చీలకుండా జాగ్రత్తపడాలన్న మమత వ్యాఖ్యలు ఈసీ ఆగ్రహానికి గురైనాయి. నేను కనుక హిందువులంతా ఏకం కావాలని పిలుపునిస్తే, ఈసీ నాకు నోటీసులు ఇస్తుంది అని మోదీ అన్నప్పటికీ, ఆయనకు ఏ నోటీసులూ రాలేదు. ఎన్నికల సంఘం మిగతా నాలుగు విడతల పోలింగునీ శాంతియుతంగా, నిష్పక్షపాతంగా ముగిసేట్టు చూడాలి.

Advertisement
Advertisement
Advertisement