కోల్‌కతా: బీజేపీ మద్దతుదారులు ఓటు వేయడానికి బయటకు రావద్దని తృణమూల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే నరేన్ చక్రవర్తి బెదరించినట్టు ఓ వీడియో బయటకు వచ్చింది. బీజేపీ బెంగాల్ కో-ఇన్చార్జి, పార్టీ ఐటీ సెల్ చీఫ్ అమిత్ మాలవీయ ఈ వీడియాను షేర్ చేస్తూ టీఎంసీపై విమర్శలు గుప్పించారు. ఈ వీడియాలో బీజేపీ మద్దతుదారులు ఓటు వేయవద్దని, అలా చేస్తే ఎన్నికల తర్వాత తీవ్ర పరిణామాలు ఎదుర్కోవలసి వస్తుందని నరేన్ చక్రవర్తి చెబుతున్నట్టు ఉంది. ఓటు వేయని పక్షంలో వాళ్లు (బీజేపీ మద్దతుదారులు) రాష్ట్రంలోనే ఉండవచ్చని, ఉద్యోగం లేదా వ్యాపారం చేసుకోవచ్చని కూడా ఎమ్మెల్యే అన్నట్టు ఆ వీడియోలో కనిపిస్తోంది.
కాగా, వీడియో ఆధారంగా నరేన్ చక్రవర్తిపై చర్యలు తీసుకోవాలని మాలవీయ డిమాండ్ చేశారు. ఇలాంటి క్రిమినల్స్‌ను కటకటాల వెనక్కి నెట్టాలని, ఇందుకు భిన్నంగా వారికి బెంగాల్లో ముఖ్యమంత్రి, టీఎంసీ చీఫ్ మమతా బెనర్జీ బాసటగా నిలుస్తున్నారని ఆయన ఆరోపించారు. ఈసీఐ ఈ అంశాన్ని తప్పనిసరిగా పరిగణనలోకి తీసుకోవాలన్నారు.
అసాంసోల్ ఎన్నికలు ఏప్రియల్ 12న
కాగా, అసాంసోల్ లోక్‌సభ సీటుతో పాటు నాలుగు అసెంబ్లీ స్థానాలకు ఏప్రిల్ 12న ఉప ఎన్నికలు జరగనున్నాయి. బీజేపీతో విభేదాల కారణంగా గత అక్టోబర్‌లో అసాంసోల్ సీటుకు ఎంపీ బాబుల్ సుప్రియో రాజీనామా చేశారు. అనంతరం ఆయన టీఎంసీలో చేరారు. అసాంసోల్ లోక్‌సభ ఉప ఎన్నికలో టీఎంసీ తరఫున బాలీవుడ్ సీనియర్ నటుడు శత్రుఘ్నుసిన్హా పోటీ చేస్తుండగా, ఆయనపై అగ్నిమిత్ర పాల్‌ను బీజేపీ తమ అభ్యర్థిగా నిలబెట్టింది.