అదిగో పులి!

ABN , First Publish Date - 2022-07-31T06:00:37+05:30 IST

జూలై 27న మెంటాడ మండలం పణుకువానివలస వద్ద పులి సంచరిస్తుందంటూ స్థానికులిచ్చిన సమాచారం మేరకు అటవీ శాఖ అధికారులు స్పందించారు. చుట్టుపక్కల గ్రామాలను జల్లెడ పట్టారు

అదిగో పులి!

 జిల్లాలో బెంగాల్‌ టైగర్‌ సంచారం 

 నిజమేనని తేల్చిన అటవీ శాఖ

 పాదముద్రికలతో నిర్థారణ

 ఇంతవరకూ కానరాని ఆచూకీ

 గాలింపు చర్యలు ముమ్మరం

 అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు పిలుపు

 (శృంగవరపుకోట)

‘జిల్లాలో పులి ప్రవేశించింది. అనకాపల్లి జిల్లా నుంచి కొత్తవలస మండలంలో ప్రవేశించినట్టు ఆనవాళ్లను గుర్తించాం. కొత్తవలస, మెంటాడ, వేపాడ, గజపతినగరం, గంట్యాడ, జామి, ఎస్‌.కోట, ఎల్‌.కోట మండలాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి’.. అంటూ జిల్లా అటవీ శాఖ అధికారి వెంకటేష్‌ ప్రకటన జారీ చేయడంతో ప్రజలు వణికిపోతున్నారు. బెంగాల్‌ టైగర్‌గా భావిస్తుండగా..ఈ పులి కాకినాడ, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు మన్యం జిల్లాల్లో సంచరించి ముప్పు తిప్పలు పెట్టింది. దిశ మార్చుకొని  జిల్లాలో ప్రవేశించినట్టు నిర్థారణకు వచ్చిన జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. అటు ప్రజలను అప్రమత్తం చేస్తూనే పులిని పట్టుకునే ప్రయత్నంలో పడింది. 

- జూలై 27న మెంటాడ మండలం పణుకువానివలస వద్ద పులి సంచరిస్తుందంటూ స్థానికులిచ్చిన సమాచారం మేరకు అటవీ శాఖ అధికారులు స్పందించారు. చుట్టుపక్కల గ్రామాలను జల్లెడ పట్టారు. పులి ఆచూకీ దొరకలేదు..కానీ పులి పాదముద్రలను మాత్రం గుర్తించారు. 

- జూలై 28న గజపతినగరం మండలం బంగారమ్మ గ్రామ సమీపంలో పులి సంచార ఆనవాళ్లను గుర్తించారు. స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు గ్రామాన్ని సందర్శించిన అధికారులు పులి సంచరించినట్టు నిర్థారించారు. పాదముద్రలు పరిశీలించి మెంటాడలో నిర్థారణ అయిన వాటితో సరిపోల్చారు. ఒకటేనని తేల్చారు.  

- జూన్‌ నెలాఖరులో వేపాడ మండలం పోతుబందిపాలెంలో పులి సంచరిస్తుందని తెలియడంతో అటవీ శాఖ అధికారులు పరిశీలించారు. ఆ మరుసటి రోజు  బక్కునాయుడుపేట, నల్లబల్లి ప్రాంతాల వైపు వెళ్లిందని చెప్పడంతో మూడు రోజులు పాటు గాలించారు. 

- ఏప్రిల్‌ మూడో వారంలో మెంటాడ మండలంలో తిరిగిన పులి  తరువాత బొండపల్లి మండలంలోకి ప్రవేశించింది. అటు నుంచి గంట్యాడ మండలం డీకే పర్తి అటవీ ప్రాంతంలోకి వెళ్లిపోయిందని ప్రచారం సాగింది. అటవీశాఖ అధికారులు పాదముద్రలు సేకరించారు.  

- గత మూడు నెలలుగా పులి సంచారంతో ప్రజలు హడలెత్తిపోతున్నారు. అదిగో పులి..ఇదిగో పులి అంటూ పుకార్లు షికార్లు చేస్తున్నాయి. దాదాపు ఐదారు మండలాల్లో పులి సంచారంపై స్థానికులు ఎక్కడిక్కడే సమాచారమందిస్తుండడంతో అటవీ శాఖ అధికారులు అప్రమత్తమవుతున్నారు. పాదముద్రలు సేకరించి దాదాపు అవి పులివిగానే నిర్థారణకు వస్తున్నారు. అయితే పులి ఏ ప్రాంతంలో సంచరిస్తుందో మాత్రం నిర్థారణకు రాలేకపోతున్నారు. కాకినాడ జిల్లాలో సైతం పులి సంచారం ఇదే మాదిరిగా కొనసాగింది. అక్కడి యంత్రాంగానికి కంటిమీద కునుకు లేకుండా చేసింది. అటవీ శాఖ అధికారుల ప్రయత్నాలకు చిక్కలేదు. అసలు పులి ఉందా అన్న సందేహం వ్యక్తమైంది. చివరకు జంతు కబేళాలను ఎరగా పెట్టిన బోను వద్ద ఏర్పాటుచేసిన కెమెరాకు పులి సంచార దృశ్యాలు చిక్కాయి. దీంతో అక్కడ పులి సంచరిస్తుందన్న నిర్థారణకు వచ్చారు. అయితే మన జిల్లాకు సంబంధించి మూడు నెలలుగా పులి సంచారంపై అధికారులు ఓ నిర్థారణకు వచ్చినా.. నిర్థిష్టమైన అభిప్రాయానికి మాత్రం రాలేకపోయారు. అయితే గత మూడు రోజులుగా నిపుణులు అనుమానిత గ్రామాలను పరిశీలించారు. అది కచ్చితంగా పులియేనని తేల్చారు. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు. అటు గ్రామాల్లో ప్రజలను అప్రమత్తం చేసే పనిలో పడ్డారు. 

 గత మూడు నెలలుగా...

ఏప్రిల్‌ రెండో వారంలో మెంటాడ మండలం నుంచి ప్రారంభమైన పులి సంచారం గజపతినగరం, బొండపల్లి, గంట్యాడ, శృంగవరపుకోట, వేపాడ, కొత్తవలస మండలాలకు పాకింది. అయితే ఒకేరోజు రెండు, మూడు మండలాల్లో పులి సంచరిస్తున్నట్టు స్థానికుల నుంచి సమాచారం వస్తోంది. దీంతో అటవీశాఖ అధికారులు ఎలా ముందుకెళ్లాలో తెలియక మల్లగుల్లాలు పడుతున్నారు. జూలై 26 నుంచి కొత్తవలస మండలంలో పులి తిరుగుతోందని తొలుత అటవీ శాఖ అధికారులు గుర్తించారు. అదేరోజు మెంటాడ, గజపతినగరం మండలాల్లోను పులి సంచరించిన ఆనవాళ్లు ఉన్నాయని తేల్చారు.  ఒకటే పులి అన్ని ప్రాంతాలను చుట్టేస్తుందా? లేక రెండు పులులు సంచరిస్తున్నాయా? అన్న అనుమానం అయితే ప్రజల్లో ఉంది. పులి అనకాపల్లి జిల్లా నుంచి.. జిల్లాలో ప్రవేశించినట్టు అధికారులు గుర్తించారు. అయితే ఇంతవరకూ అడుగుజాడలను గుర్తిస్తున్న అటవీ శాఖ అధికారులు పులి ఆచూకీని కనుక్కోలేకపోతున్నారు. కెమెరాలు సైతం అమర్చినా పులి సంచారంపై ఒక్క ఫొటో కూడా బయటపడడం లేదు.

ఇవి చేయాలి..

- పులి సంచారం ఉన్న ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.

- వీలైనంత వరకూ రాత్రిపూట బయటకు రాకూడదు.

- పశువుల శాలల వద్ద కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటుచేయాలి.

- తోటలు, పొలాల్లో గొర్రెలు, మేకలు, పశువుల మందలను వేసినప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలి. 

- పెంపకందారులు ఒంటరిగా ఉండరాదు. మందల వద్ద సామూహికంగా ఉంటే చాలా మంచిది.

- రాత్రి 7 గంటల నుంచి వేకువజాము వరకూ పులి సంచరిస్తుంది. ఆ సమయంలో పొలాలకు ఒంటరిగా వెళ్లకూడదు.

- పులులు స్వతహాగా బిడియ స్వభావం కలిగి ఉంటాయి. మనుషులకు సాధ్యమైనంత దూరంగా ఉండేందుకు ప్రయత్నిస్తాయి. మనిషి అకస్మాత్తుగా తారసపడితే మాత్రం మెరుపు వేగంతో దాడి చేస్తాయి. 

- గ్రామీణ ప్రాంతాల్లో ఆరుబయట నిద్రించకూడదు. మనుషుల సంచారం లేనిచోట ఒంటరిగా తిరగకూడదు.

-  పులి నాలుగు కాళ్ల జంతువులను టార్గెట్‌ చేస్తుంది. అందుకే పశువులను సురక్షిత ప్రాంతాల్లో మాత్రమే కట్టాలి.  

 


Updated Date - 2022-07-31T06:00:37+05:30 IST