Amazon, Google ఆఫర్లను తిరస్కరించి.. Facebook ఆఫర్‌ పట్టేసిన విద్యార్థి.. వార్షికవేతనం ఎంతో తెలుసా..

ABN , First Publish Date - 2022-06-28T17:21:08+05:30 IST

ప్రతిభ, నైపుణ్యాలు కలిగివుండే ఉద్యోగావకాశాలు వాటంతటవే వెతుక్కుంటూ వస్తాయని పశ్చిమబెంగాల్‌(West bengal)కి చెందిన బిసాఖ్ మండల్(Bisakh Mondal) అనే విద్యార్థి(Student) నిరూపించారు.

Amazon, Google ఆఫర్లను తిరస్కరించి.. Facebook ఆఫర్‌ పట్టేసిన విద్యార్థి.. వార్షికవేతనం ఎంతో తెలుసా..

కోల్‌కతా : ప్రతిభ, నైపుణ్యాలు కలిగివుండే ఉద్యోగావకాశాలు వాటంతటవే వెతుక్కుంటూ వస్తాయని పశ్చిమబెంగాల్‌(West bengal)కి చెందిన బిసాఖ్ మండల్(Bisakh Mondal) అనే విద్యార్థి(Student) నిరూపించారు. ఏకంగా రూ.1.8 కోట్ల భారీ వార్షికవేతనంతో సోషల్ మీడియా, టెక్ దిగ్గజం ఫేస్‌బుక్‌(Facebook)లో ఉద్యోగానికి ఎంపికయ్యాడు. ఫేస్‌బుక్‌కు ముందే అమెజాన్(Amazon), గూగుల్(Google) కంపెనీలు భారీ ఆఫర్లు ఇచ్చినా వాటిని తిరస్కరించాడు. ఎక్కువ జీతం(Salary) ఆఫర్ చేసిన ఫేస్‌బుక్‌కే అతడు ఓటేశాడు. కోల్‌కతా(Kolkata)లోని జాదవ్‌పూర్ యూనివర్సిటీ(Jadavpur University)లో కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్‌ చివరి సంవత్సరం చదువుతున్న బిసాఖ్ మండల్‌కి ఈ అవకాశం దక్కింది. జాదవ్‌పూర్ యూనివర్సిటీలో ఈ ఏడాది అత్యధిక ఆఫర్‌తో ఉద్యోగాన్ని పొందిన విద్యార్థి అతడే కావడం గమనార్హం. 


ఈ ఆఫర్‌పై బిసాఖ్ మండల్ స్పందిస్తూ.. ఈ ఏడాది సెప్టెంబర్‌లో ఉద్యోగంలో చేరబోతున్నట్టు చెప్పాడు. లండన్‌లో పనిచేయాల్సి ఉంటుందని వెల్లడించారు. గూగుల్, ఫేస్‌బుక్ నుంచి ఆఫర్ వచ్చినా.. ఎక్కువ మొత్తంలో శాలరీ ఆఫర్ చేసిన ఫేస్‌బుక్‌కే ప్రాధాన్యమిచ్చానని వివరించాడు. సోమవారం రాత్రే ఈ ఆఫర్ వచ్చిందని పేర్కొన్నాడు. కొవిడ్ మహమ్మారి ప్రభావం చూపిన గత రెండేళ్లు వేర్వేరు సంస్థల్లో ఇంటర్న్‌షిప్ చేసేందుకు అవకాశం లభించింది. తన సిలబస్‌లో లేని అంశాలపైన కూడా అవగాహన పొందడం అక్కరకొచ్చిందని, ఇంటర్వ్యూల్లో రాణించానని బైసాఖ్ మండల్ వివరించాడు. 


కాగా బైసాఖ్ మండల్ బెంగాల్‌లోని బిర్భూమ్ జిల్లాలో నివసిస్తున్న సాధారణ కుటుంబానికి చెందినవాడు. అతడి తల్లి షిబానీ అంగన్‌వాడీ కార్యకర్తగా పనిచేస్తున్నారు. తన కొడుకుకి భారీ శాలరీతో ఉద్యోగం దక్కడంపై ఆమె సంతోషం వ్యక్తం చేశారు. తమకు ఎంతో గర్వకారణమని ఆమె  చెప్పింది. ఎల్లప్పుడూ కష్టపడి చదివే తన కొడుకు ఈ ఉద్యోగానికి అర్హుడేనని అమ్మ ప్రేమను చాటుకున్నారామె. ఇక యూనివర్సిటీ ప్లేస్‌మెంట్ ఆఫీసర్ సమితా భట్టాచార్య స్పందిస్తూ... కొవిడ్ తర్వాత ఇంత పెద్ద సంఖ్యలో ఇంటర్నేషనల్ ఆఫర్లు రావడం ఇదే తొలిసారని అన్నారు. 9 మంది విద్యార్థులకు విదేశీ కంపెనీల నుంచి రూ.1 కోటికిపైగా వేతనంతో ఆఫర్లు వచ్చాయని మీడియా రిపోర్టులు పేర్కొన్నాయి.

Updated Date - 2022-06-28T17:21:08+05:30 IST