బెంగాల్ కుంభకోణం

ABN , First Publish Date - 2022-07-27T06:24:37+05:30 IST

పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ దూకుడుగా తప్ప, ఆత్మరక్షణలో ఉన్నట్టుగా కనిపించడం అరుదు. పశ్చిమబెంగాల్ స్కూల్ సర్వీస్ కమిషన్ రిక్రూట్‌మెంట్ స్కామ్ విషయంలో...

బెంగాల్ కుంభకోణం

పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ దూకుడుగా తప్ప, ఆత్మరక్షణలో ఉన్నట్టుగా కనిపించడం అరుదు. పశ్చిమబెంగాల్ స్కూల్ సర్వీస్ కమిషన్ రిక్రూట్‌మెంట్ స్కామ్ విషయంలో ఒక పార్టీగా తృణమూల్ కాంగ్రెస్ ఏవో రాజకీయ విమర్శలు చేస్తున్నది తప్ప, మమత మాత్రం ఘాటుగా మాట్లాడలేకపోతున్నారు. ఓ కుంభకోణం చిన్నదా పెద్దదా అన్నకంటే, జనం కంటికీ, మీడియా కెమెరాలకు కనిపిస్తున్న దృశ్యాలు ఎటువంటివన్నది చాలా ముఖ్యం. మమతకు అత్యంత సన్నిహితుడు, తాను నోరారా అన్నా అని గౌరవంగా సంబోధించే ఓ మంత్రి అరెస్టు కావడం అటుంచితే, ఆయన దోచుకున్నదంతా దాచిపెట్టింది ఇక్కడేనంటూ ఇద్దరు మహిళలను పదేపదే చూపుతూ, ఆయనతో వారికి గల సాన్నిహిత్యం మీద మీడియా ఇప్పుడు లోతైన, విశ్లేషణాత్మక కథనాలను ప్రసారం చేస్తున్నది. దేశం చూస్తున్న అనేక కుంభకోణాలతో పోల్చితే ఓ ఇరవైకోట్ల రూపాయలు, డెబ్బైలక్షల బంగారం, ఓ పది ఫ్లాట్లు పెద్ద లెక్కలోనివా అని కొందరు తీసిపారేయవచ్చునేమో కానీ, ఆ సొమ్ము కట్టలుకట్టలుగా పోగుబడి మంత్రిగారి సన్నిహితురాలి ఇంట్లో దొరికిన దృశ్యం ప్రాధాన్యత, ప్రభావం వేరు. 


ఈ వ్యవహారాన్ని మమత ఇంతవరకూ ఎందుకు తెచ్చుకున్నారో తెలియదు. ఈ కుంభకోణం గురించి తనకు ఏమాత్రం తెలియదని ఆమె చెప్పడం నిండు అసత్యం. అవినీతిని సహించేది లేదనీ, తప్పుచేసినవారు శిక్షార్హులేనని ప్రకటించడం ద్వారా ఆమె ఈ పాపంతో తనకు సంబంధం లేదని చెప్పదల్చుకున్నారు. కేంద్రప్రభుత్వాన్ని తప్పుబట్టగలిగేందుకు, దీనిని రాజకీయకక్షగా అభివర్ణించేందుకు ఆమె ప్రయాసపడుతున్నప్పటికీ, కేంద్రప్రభుత్వ సంస్థలు రంగంలోకి దిగింది న్యాయస్థానం ఆదేశాలమేరకేనన్నది వాస్తవం. ఆరేళ్ళక్రితం పార్థా చటర్జీ విద్యామంత్రిగా ఉన్నప్పుడు 13వేల గ్రూప్ సీ, డీ పోస్టుల భర్తీకి ఉద్దేశించిన ఉత్తర్వుతో ఈ కుంభకోణం మొదలైంది. అర్హుల జాబితా బహిరంగంగా ప్రకటించకుండా అభ్యర్థులు నేరుగా కంప్యూటర్‌లో లాగిన్ అయి ఫలితం తెలుసుకోవాలన్న నియమం పెట్టి, తక్కువమార్కులు వచ్చిన అభ్యర్థుల నుంచి డబ్బు తీసుకొని ఉద్యోగం ఇచ్చిన విషయం మిగతావారికి తెలియకుండా జాగ్రత్తపడ్డారు. కానీ, ఉద్యోగం దక్కని ఓ నలుగురు అభ్యర్థులు తమకంటే తక్కువ మార్కులు వచ్చిన కొందరిని గుర్తించి న్యాయస్థానాన్ని ఆశ్రయించడంతో ఈ కుంభకోణం బద్దలైంది. న్యాయస్థానంలో ఏళ్ళతరబడి వ్యవహారం కదలనీయకుండా, కొలిక్కిరాకుండా ప్రభుత్వం అడుగడుగునా అడ్డుకుంది. నియామకపు ప్రక్రియకు సంబంధించిన వివరాలు ఇవ్వకపోవడం, విజేతల జాబితా చూపకపోవడం వంటి చర్యలూ, కట్టుకథలూ న్యాయమూర్తిని తీవ్ర ఆగ్రహానికి గురిచేశాయి. ఒక న్యాయమూర్తి పదవీకాలం పూర్తయి, కొత్త న్యాయమూర్తి వచ్చిన తరువాత కూడా కేసు కొనసాగింది. న్యాయస్థానం స్వయంగా విచారణ కమిటీ ఏర్పాటు చేస్తే, వేలాది నియామకాలు అక్రమంగా జరిగాయనీ, ఎప్పటికప్పుడు ర్యాంకులు మార్చేశారనీ, ప్రక్రియను పర్యవేక్షించే ప్యానెల్ కాలపరిమితి ముగిసిన తరువాత కూడా నియామకాలు జరిగాయని తేలింది. కొందరు నిరుద్యోగులు ఆవేదనతో ఆత్మహత్యలు చేసుకున్నప్పుడు, వేలాదిమంది ఉద్యమాలు చేసినప్పుడూ అన్యాయాన్ని సరిదిద్దుతానంటూ హామీల వర్షం కురిపించిన మమత ఈ కుంభకోణం గురించి తనకు తెలియదని ఇప్పుడు అనడం విచిత్రం.


పార్థాఛటర్జీ తన అరెస్టుకు ముందు నాలుగుసార్లు ఫోన్ చేసినా మమత పట్టించుకోలేదని ఇప్పుడు గొప్పగా చెబుతున్నారు కానీ, నియామకాల్లో అక్రమాల వివాదం హైకోర్టు మెట్లు ఎక్కగానే మమత జాగ్రత్తపడివుంటే న్యాయస్థానమే సీబీఐ విచారణకు ఆదేశించడం వరకూ వ్యవహారం వచ్చేది కాదు. ఇప్పుడు ఈడీ వరుసదాడుల్లో ఇద్దరు మహిళల ఇళ్ళలో కట్టలకొద్దీ బయటపడుతున్న అవినీతి సొమ్ముతోపాటు, వారితో ఆయనకున్న సాన్నిహిత్యం, ఆ కారణంగా వారు ఎదిగిన క్రమం వంటి అంశాల చుట్టూ ఈ కుంభకోణం తిరుగుతున్నది. ప్రజల్లో వీటి ప్రభావం కాదనలేనిది. పార్టీ జనరల్ సెక్రటరీ హోదాలో ఉంటూ, తన తరువాత కీలకమైన భూమిక నిర్వహిస్తున్న పార్థాచటర్జీని కాపాడుకురావడం మమతచేసిన పెద్ద తప్పు. ఆయన సంపాదించిన కోట్లాది రూపాయల విలువైన ఆస్తిపాస్తులు వరుసగా బయటపడుతున్న స్థితిలో కేంద్రప్రభుత్వాన్ని రాజకీయంగా విమర్శించినందువల్ల పెద్దగా ప్రయోజనం లేదు.

Updated Date - 2022-07-27T06:24:37+05:30 IST