మోదీ పాలనలో మార్పులు వచ్చేనా?

ABN , First Publish Date - 2021-04-03T05:51:13+05:30 IST

పరిపాలనలో నవ భావాలు, వినూత్న చొరవలు, కొత్త ప్రయోగాలు కాకుండా మోదీ ఆలోచనలను అనుసరించడమే ఆయన ప్రభుత్వ పాలనా నియమాలు. మరి అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు మోదీ చింతన....

మోదీ పాలనలో మార్పులు వచ్చేనా?

పరిపాలనలో నవ భావాలు, వినూత్న చొరవలు, కొత్త ప్రయోగాలు కాకుండా మోదీ ఆలోచనలను అనుసరించడమే ఆయన ప్రభుత్వ పాలనా నియమాలు. మరి అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు మోదీ చింతన మౌలిక సూత్రాలను దృఢపరుస్తాయా లేక ప్రభుత్వంలోనూ, అధికారపక్షంలోనూ సంపూర్ణ పునర్వ్యవస్థీకరణకు కారణమవుతాయా?


కేరళ, తమిళనాడు, పశ్చిమ బెంగాల్, అస్సాం, కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరి శాసనసభా ఎన్నికల ఫలితాల గురించి నిశ్చితంగా ఏమీ చెప్పలేని పరిస్థితి నెలకొని ఉంది. ముఖ్యంగా కాంగ్రెస్, బీజేపీ కాకుండా ఇతర పార్టీలు - కేరళలో సిపిఎం, బెంగాల్‌లో టిఎంసి, పుదుచ్చేరిలో ఎఐఎన్‌ఆర్‌సి- కీలక శక్తులుగా ఉన్న రాష్ట్రాలలో అది మరింత వాస్తవంగా ఉన్నది. ఈ మూడు ప్రదేశాలలో ప్రజల మద్దతు గల, అయితే వివాదాస్పద వ్యక్తి -కేరళలో పినరాయి విజయన్, బెంగాల్లో మమతా బెనర్జీ, పుదుచ్చేరిలో ఎన్.రంగస్వామి- తమ పార్టీలకు నేతృత్వం వహిస్తున్నారు. వివిధ ఓటర్ల సర్వేల నివేదికల ఆధారంగా తమిళనాడులో డిఎంకె కూటమి, బెంగాల్‌లో టిఎంసి విజయం సాధించవచ్చని నేను భావిస్తున్నాను. అస్సాం, కేరళలో ప్రత్యర్థి కూటములు సమ ఉజ్జీలుగా ఉన్నాయి. జయాపజయాలు విస్మయకరంగా ఉండవచ్చు. పుదుచ్చేరి దృశ్యం అస్పష్టంగా ఉన్నది. 


రాష్ట్రాల హక్కుల పరిరక్షణ, లౌకికవాదం, ఆర్థిక సమస్యల పరిష్కారం మొదలైన ఉమ్మడి లక్ష్యాలతో కాంగ్రెస్ పోరాడుతున్నది. బీజేపీకి ప్రతి రాష్ట్రంలోనూ ఒక నిర్దిష్ట ఎజెండా ఉంది. బెంగాల్లో పౌరసత్వ సవరణ చట్టం గురించి మాట్లాడుతున్న బీజేపీ అస్సాంలో ఆ చట్టం విషయమై మౌనం పాటిస్తోంది.కేరళ, తమిళనాడు, పుదుచ్చేరిలో కుల, మత ఎజెండాపై ఆ పార్టీ ఆధారపడింది. విస్తృత ప్రాతిపదికన పొత్తులు కుదుర్చుకోవడం ద్వారా ‘కాంగ్రెస్ ముక్త్ భారత్’ అనే బీజేపీ లక్ష్యాన్ని కాంగ్రెస్ వమ్ము చేసింది.అయితే బీజేపీ తన లక్ష్య సాధనకు చాలా దూకుడుగా వ్యవహరిస్తోంది. ఒక విధంగా పెద్ద జూదమే ఆడుతుందని చెప్పవచ్చు. 


ఇంతకూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తన పదవీ కాలంలో ఇంకా మిగిలివున్న ఐదు సంవత్సరాల పాటు దేశానికి ఎటువంటి పాలనను అందివ్వనున్నది? ఇదీ, ఇప్పుడు అసలు ప్రశ్న. మోదీ ప్రభుత్వ (నరేంద్ర మోదీయే ప్రభుత్వం, ప్రభుత్వమే నరేంద్ర మోదీ కదా) పాలన మౌలిక సూత్రాలు ప్రతి ఒక్కరికీ స్పష్టమే. అవి: (1) ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎటువంటి అసమ్మతినీ సహించరు. భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేసే ప్రతిపక్ష నేతలు, పార్టీలు తప్పక శిక్షింపబడతాయి. ప్రధాన ప్రత్యర్థి అయిన కాంగ్రెస్‌తో పాటు జమ్ము, కశ్మీర్‌లలో నేషనల్ కాన్ఫరెన్స్, పీడీపీ లు; పశ్చిమ బెంగాల్‌లో తృణమూల్ కాంగ్రెస్; మహారాష్ట్రలో నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ; కేరళలో సిపిఎం; తమిళనాడులో డిఎంకె నాయకులపై వివిధ దర్యాప్తు సంస్థలు తమ దృష్టిని కేంద్రీకరించాయి. ఒడిషాలో బిజూ జనతా దళ్, ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, తెలంగాణలో టిఆర్ఎస్‌ల జోలికి అవి పోవడం లేదు.


బిహార్‌లో జనతాదళ్, తమిళనాడులో అన్నా డిఎంకె ప్రధానమంత్రితోనూ, ఆయన పార్టీతోనూ స్నేహపూరితంగా వ్యవహరిస్తున్నాయి. ఒక రాజకీయ పార్టీ గుత్తాధిపత్యాన్ని పెంపొందించేందుకు కేంద్రప్రభుత్వ అధికారాలను ఇంతకు ముందు ఏ ప్రభుత్వమూ మోదీ సర్కార్‌లా దుర్వినియోగపరచలేదు.(2) లోక్‌సభలో బీజేపీకి పూర్తి మెజారిటీ ఉన్నది. రాజ్యసభలో వివిధ చిన్న పార్టీలను కూడగట్టుకుని సాధారణ మెజారిటీ సాధించగల సామర్థ్యం ఆ పార్టీకి ఉన్నది. ఈ రెండిటి ఆసరాతో రాజ్యాంగ విరుద్ధ, న్యాయ సమ్మతం కాని చట్టాలను బీజేపీ తీసుకువస్తోంది. జమ్మూ కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పిస్తున్న అధికరణ 370 రద్దు, ఢిల్లీ ప్రభుత్వాన్ని ఒక మునిసిపాలిటీ స్థాయికి కుదించిన చట్టమూ అందుకు తాజా ఉదాహరణలు. అంతకు ముందు పౌరసత్వ సవరణ చట్టాన్ని, ఆ తరువాత మూడు కొత్త వ్యవసాయ చట్టాలను మోదీ ప్రభుత్వం ఇలానే తీసుకువచ్చింది. అదే రీతిలో మరిన్ని చట్టాలు పార్లమెంటు ఆమోదం పొందగలవనడంలో సందేహం లేదు. అయితే వివిధ కారణాల వల్ల పౌరసత్వ సవరణ చట్టం, కొత్త సాగుచట్టాల అమలును సుప్రీం కోర్టు తాత్కాకంగా నిలిపివేసింది.

 

(3) పరిపాలనలో నవ భావాలను ప్రవేశపెట్టేందుకు, వినూత్న చొరవలు తీసుకునేందుకు, కొత్త ప్రయోగాలు చేసేందుకు ఎలాంటి ఆస్కారం లేదు. ఒకే ఒక్క ఆలోచన- మోదీ చింతన-కు మాత్రమే తావున్నది. కొవిడ్–-19 వ్యాక్సినేషన్ కార్యక్రమం అమలులో నెలకొన్న గందరగోళమే మోదీ చింతనకు ఒక ఉదాహరణ. కరోనా టీకాల మొదటి దశలో వైద్య సిబ్బంది, ఇతర ఫ్రంట్ లైన్ యోధులకు ప్రాధాన్యమిచ్చారు. ఇది సరైన చర్యే. అయితే ఆ తరువాత చేపట్టిన చర్యలు ఏవీ సక్రమమైనవి కావు. ముఖ్యంగా యాప్, ముందుగా రిజిస్టర్ చేయించుకోవడం మొదలైనవి పూర్తిగా అనుచితమైనవి. వీటికి తోడు విధి నిర్వహణలో ప్రభుత్వాధికారుల అలక్ష్యం, ఉపేక్ష ఉండనే ఉన్నాయి. కొవిడ్ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని పల్స్ పోలియో కార్యక్రమంతో పోల్చి చూడండి. పోలియో మందు చుక్కలు వేసే తేదీని ముందుగా ప్రకటించేవారు.


ఆ తేదీన వేలాది మాతృమూర్తులు తమ బిడ్డలను ఆస్పత్రులకు, ఆరోగ్య కేంద్రాలకు తీసుకువచ్చే వారు. అలా పల్స్ పోలియో కార్యక్రమం సంపూర్ణంగా విజయవంతమయింది. కొవిడ్ వ్యాక్సినేషన్ కార్యక్రమం ఉద్యోగస్వామీకరణ కావడంతో కరోనా టీకాలు వేయించుకోవడంలో తీవ్ర జాప్యం చోటు చేసుకొంటోంది. 2021 జూలై మాసాంతానికి 40 కోట్ల మందికి కరోనా టీకాలు వేసే లక్ష్యం నెరవేరుతుందా? ఈలోగా వేలాది ప్రజలు కరోనా భారిన పడడం, ప్రతిరోజూ వందలాది బాధితులు చనిపోవడం తథ్యం. ‘మోదీ ఆలోచనను అనుసరించండి’ అనే నియమం ప్రధానమంత్రి ఆవాజ్ యోజన నుంచి పంటల బీమా వరకు ప్రతి కార్యక్రమాన్ని ప్రభావితం చేస్తోంది. ప్రస్తావిత రెండు కార్యక్రమాలు ఘోర వైఫల్యాలు కావడంలో ఎంత మాత్రం ఆశ్చర్యం లేదు. 


(4) ఆర్థికవ్యవస్థ పునరుజ్జీవ విధానాలను కార్పొరేట్ ప్రయోజనాలు నిర్ణయిస్తాయి! కనుకనే మోదీ ప్రభుత్వం డిమాండ్ కంటే సరఫరాలను పెంపొందించే వ్యూహాన్ని అనుసరిస్తోంది. ఫలితంగా ఆర్థిక వ్యవస్థ పునరుద్ధరణలో జాప్యం జరుగుతోంది. కరోనా విపత్తుతో ఉద్యోగాలు కోల్పోయిన వారు ఇప్పటికీ నిరుద్యోగులుగా ఉన్నారు. పైగా నిరుద్యోగుల సంఖ్య పెరిగిపోతోంది. కొత్త ఉద్యోగాల సృష్టి జరగడం లేదు. అత్యధికుల ఆదాయాలు తగ్గిపోతున్నాయి. మరింత మంది పేదరికంలోకి, రుణాల ఊబిలోకి జారిపోతున్నారు. పేదలు, మధ్యతరగతి ప్రజల పట్ల పాలకుల్లో దయాళుత్వం పూర్తిగా లోపించింది. ఉంటే పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరలను అదే పనిగా పెంచుతారా? కోటి రూకల ప్రశ్న ఏమిటంటే అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు మోదీ చింతన మౌలిక సూత్రాలను దృఢపరుస్తాయా లేక ప్రభుత్వంలోనూ, అధికారపక్షంలోనూ సంపూర్ణ పునర్వ్యవస్థీకరణకు కారణమవుతాయా?




పి. చిదంబరం

(వ్యాసకర్త కేంద్ర మాజీ మంత్రి కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకులు)

Updated Date - 2021-04-03T05:51:13+05:30 IST