‘ఇంటింటా’.. ఎదురుచూపు!

ABN , First Publish Date - 2021-02-25T05:23:18+05:30 IST

బియ్యం కార్డుదారులకు ఈ నెల రేషన్‌ సరుకుల కోసం ఎదురుచూపు తప్పడం లేదు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత నాణ్యమైన బియ్యం పంపిణీకి శ్రీకారం చుట్టింది. ఇంటింటికీ వలంటీర్ల ద్వారా బియ్యం సరఫరా చేస్తూ వచ్చింది. తాజాగా డోర్‌ డెలివరీకి ఎండీయూ వాహనాలను అందుబాటులోకి తెచ్చింది.

‘ఇంటింటా’.. ఎదురుచూపు!
డొంకూరులో రేషన్‌ అందలేదని నిరసన తెలుపుతున్న లబ్ధిదారులు

లబ్ధిదారులకు సక్రమంగా అందని ‘రేషన్‌’  

జిల్లాలో ఈ నెల 52 శాతం మాత్రమే  సరుకుల పంపిణీ

ఆందోళన చెందుతున్న కార్డుదారులు 

(శ్రీకాకుళం,ఆంధ్రజ్యోతి/ఇచ్ఛాపురం రూరల్‌)

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇంటి వద్దకే నిత్యావసర సరుకుల పంపిణీ కార్యక్రమం ఆదిలోనే అభాసు పాలవుతోంది. ఓ వైపు పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ఈ నెల మొదటి రెండు వారాల్లో ‘కోడ్‌’ అడ్డంకి ఎదురైంది. పల్లెల్లో సరుకుల పంపిణీకి బ్రేక్‌ పడింది. తర్వాత దీనిపై కోర్టు నుంచి గ్రీన్‌సిగ్నల్‌ వచ్చినా.. నిత్యావసర సరుకుల పంపిణీ ప్రక్రియ నత్తనడకన సాగుతోంది. మరోవైపు వాహనాల ద్వారా రేషన్‌ సరుకుల పంపిణీ పేరిట తమపై ఎంతో భారం పడుతోందని డ్రైవర్లు ఆందోళన చెందుతున్నారు. ఇంటింటికీ రేషన్‌ సరుకులు పంపిణీ చేయడం తమ వల్ల కాదంటూ చేతులెత్తేస్తున్నారు. ఫలితంగా కార్డుదారులు రేషన్‌ సరుకులు కోసం ఎదురుచూస్తున్నారు. ఈ నెల సరుకులు అందుతాయో లేదోనని ఆందోళన చెందుతున్నారు. 


బియ్యం కార్డుదారులకు ఈ నెల రేషన్‌ సరుకుల కోసం ఎదురుచూపు తప్పడం లేదు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత నాణ్యమైన బియ్యం పంపిణీకి శ్రీకారం చుట్టింది. ఇంటింటికీ వలంటీర్ల ద్వారా బియ్యం సరఫరా చేస్తూ వచ్చింది. తాజాగా డోర్‌ డెలివరీకి ఎండీయూ వాహనాలను అందుబాటులోకి తెచ్చింది. ఈ నెల 1 నుంచి ఈ వాహనాల ద్వారా నిత్యావసర సరుకులు పంపిణీ చేయాలని నిర్ణయించింది. ఇంతలో ‘స్థానిక’ ఎన్నికల కోడ్‌ అమల్లోకి రావడం, వాహనాలపై అధికార పార్టీ రంగులు కనిపించడంతో గ్రామాల్లో పంపిణీ ప్రక్రియకు బ్రేక్‌ పడింది. పట్టణ ప్రాంతాల్లోనే దీన్ని ప్రారంభించింది. కోర్టు తీర్పు అనంతరం ఈ నెల 16 నుంచి పల్లెల్లో కూడా వాహనాల ద్వారా సరుకులు పంపిణీ చేపడుతోంది. జిల్లాలో ఇప్పటివరకు 52 శాతం లబ్ధిదారులకు మాత్రమే నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. మరో నాలుగు రోజుల్లో ఫిబ్రవరి ముగియనుంది. ఈ నేపథ్యంలో ఈ నెల తమకు సరుకులు అందుతాయో లేదోనని కార్డుదారులు ఆందోళన చెందుతున్నారు.


అవస్థలెన్నో

జిల్లాలో మొత్తం 8,05,923 బియ్యంకార్డులు ఉన్నవి. 2015 రేషన్‌ షాపుల ద్వారా 530 వాహనాల్లో సరుకులు పంపిణీ చేస్తున్నారు. రోజుకు 90 మంది కార్డుదారులకు సరుకులు అందజేయాలని ప్రభుత్వం వాహనదారులకు సూచించింది. వాహన పరిమాణాన్ని బట్టి ఒక్కో దానిలో 20 నుంచి 22 బస్తాలు మాత్రమే పడతాయి. దీంతో రోజులో 4 నుంచి 5 సార్లు రేషన్‌ దుకాణాల వద్దకు వెళ్లి సరుకుల మూటలను మోసుకుని వాహనంలోకి ఎక్కించుకోవాల్సిన పరిస్థితి వాహనదారులకు నెలకొంది. రేషన్‌ దుకాణం నుంచి మూటలను వాహనాల్లోకి ఎక్కించేందుకు ప్రభుత్వం ఇస్తున్న రూ.3 వేలు సరిపోవంటూ వాహనదారులు ఆందోళన చెందుతున్నారు. దీనికి తోడు సర్వర్‌ సమస్య వెంటాడుతుండటంతో సరుకుల పంపిణీ జాప్యమవుతోంది. తమకు డ్రైవింగ్‌కు మాత్రమే పరిమితం చేయాలని మిగతా పనులు మాకు అప్పగించరాదని పలు మండలాల్లో వాహదారులు ఆందోళన చేస్తున్నారు. 


వీధి చివరికే..

కార్డుదారులు రేషన్‌ సరుకుల కోసం నానా పాట్లు పడుతున్నారు. ఇంటింటికీ వచ్చి రేషన్‌ అందిస్తామన్నారు. కానీ ఎండీయూ వాహనాలను వీధి చివర్లో ఉంచుతున్నారు. కేవలం 90 మందికి మాత్రమే వీఆర్వో లాగిన్‌ ద్వారా పేర్ల ప్రకారం సరుకులను అందిస్తున్నారు. దీంతో మిగతా లబ్ధిదారులకు పడిగాపులు తప్పడం లేదు. ముందుగా లబ్ధిదారుల సెల్‌ఫోన్లకు సమాచారం వచ్చినా.. వాహనాలు వచ్చినప్పుడు సరుకులు తీసుకోకపోతే ఇబ్బందులు తప్పడం లేదు. నెట్‌వర్క్‌ సక్రమంగా లేకపోవడంతో ఇ-పాస్‌ యంత్రాలు సరిగా పనిచేయక లబ్ధిదారులు వాహనాల వద్ద గంటల కొద్దీ నిరీక్షించాల్సి వస్తోంది. ఇ-పాస్‌ యంత్రం పనిచేయడం లేదని.. ఇంటికి వెళ్లిపోతే తిరిగి బియ్యం వాహనం ఎప్పుడో వస్తుందో తెలియదు. ఇ-పాస్‌ పనిచేసే వరకు అక్కడే ఉండాల్సి వస్తోంది. పనులు మానుకోవాల్సి వస్తోందని లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇంటికి వచ్చి ఇస్తామని చెప్పి.. వీధుల్లో నిలబెట్టి ఇవ్వడం బాగోలేదని అసహనం వ్యక్తం చేస్తున్నారు. పాత పద్ధతిలోనే రేషన్‌ పంపిణీ చేస్తే అందరికీ మేలు జరుగుతుందని అభిప్రాయపడుతున్నారు. 


దుకాణం వద్ద నిరీక్షణ

ఇంటింటికీ రేషన్‌ సరఫరా వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఇంతవరకు కొన్ని గ్రామాల్లో సరుకులు అందలేదు. ప్రస్తుతం వాహనాల కోసం డీలర్లందరు దుకాణాల వద్ద నిరీక్షించాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. రోజుకు మూడు, నాలుగు సార్లు లెక్కలు సరిచూడాల్సి వస్తోంది. 

- సుంకరి.సూర్యారావు, రేషన్‌ డీలర్ల జిల్లా కార్యదర్శి


గడువు తేది ప్రకటించలేదు 

ఇంటింటికీ రేషన్‌ సరుకుల పంపిణీలో ప్రభుత్వం ఈ నెలకు సంబంధించి గడువును ఇంకా ప్రకటించలేదు. పంపిణీలో వాహన పరమైన ఇబ్బందులు ఉంటే సంబంధిత కంపెనీ ప్రతినిధులకు సమాచారం ఇచ్చి వెంటనే బాగు చేయిస్తున్నాం. రెండు, మూడు రోజుల్లో అందరికీ సరుకులు అందేలా చర్యలు తీసుకుంటున్నాం. 

- డి.వెంకటరమణ, జిల్లా పౌరసరఫరాలశాఖ అధికారి

Updated Date - 2021-02-25T05:23:18+05:30 IST