బోగస్‌ ఇంటి పట్టాలపై లబ్ధిదారుల నిరసన

ABN , First Publish Date - 2021-01-26T07:02:55+05:30 IST

నవరత్నాల్లో భాగంగా ప్రభుత్వం ఇటీవల పంపిణీ చేసిన ఇంటి పట్టాల్లో లబ్ధిదారుల పేర్లు, సర్వేనెంబర్లు, తహసీల్దార్‌ సంతకాలు కూడా బోగస్‌ పట్టాలిచ్చారని మండలంలోని బొమ్మగానిపల్లి లబ్ధిదారులు ఆందోళనకు దిగారు.

బోగస్‌ ఇంటి పట్టాలపై లబ్ధిదారుల నిరసన
సర్వే నెంబర్లు లేని పట్టా

బొమ్మగానిపల్లి సచివాలయానికి తాళం 

   

బ్రహ్మసముద్రం, జనవరి 25: నవరత్నాల్లో భాగంగా ప్రభుత్వం ఇటీవల పంపిణీ చేసిన ఇంటి పట్టాల్లో లబ్ధిదారుల పేర్లు, సర్వేనెంబర్లు, తహసీల్దార్‌ సంతకాలు కూడా బోగస్‌ పట్టాలిచ్చారని మండలంలోని బొమ్మగానిపల్లి లబ్ధిదారులు ఆందోళనకు దిగారు. సోమవారం గ్రామ సచివాలయానికి తాళం వేసి బైఠాయించారు. ఈసందర్భంగా లబ్ధిదారులు మాట్లాడుతూ గ్రామ పంచాయతీలో 90 మందికి ఇంటిపట్టాలు పంపిణీ చేశారన్నారు. వాటిలో కొంతమంది పట్టాల్లో పూర్తి వివరాలు లేకుండా వలంటీర్ల ద్వారా రాత్రికి రాత్రే లబ్ధిదారులకు అందజేశారని వాపోయారు.  తప్పుడు పట్టాలు ఇచ్చిన వీఆర్‌ఓపై చర్యలు తీసుకోవాలని మాజీ సర్పంచ తిమ్మప్పచౌదరి, టీడీపీ నాయకులు నాగభూషణచౌదరి డిమాండ్‌ చేశారు. విషయాన్ని తహసీల్దార్‌ రమేష్‌ దృష్టికి తీసుకెళ్లంగా, స్పందించిన ఆయన పిల్లలపల్లి వీఆర్‌ఓ నాగరాజును పంపించారు. వీఆర్‌ఓ లబ్ధిదారులతో చర్చించారు. పట్టాలను పరిశీలించి పొరపాటు జరిగిందని, వాటిని సరిచేసి ఇస్తామని తెలిపినా లబ్ధిదారులు ససేమిరా అన్నారు. ఇళ్ల పట్టాలలో ఉన్న స్థలాలను చూపించాలని పట్టుబట్టారు. పిల్లలపల్లికి సంబంధించిన సర్వేనెంబర్‌కు బొమ్మగానిపల్లిలో పట్టా ఇవ్వడం ఎంతవరకు సమంజసమని నిలదీశారు. అంతలోనే వైసీపీ నాయకులు సచివాలయం వద్దకు చేరుకుని తలుపులు తీసి లోపకి వెళ్లారు. దీంతో టీడీపీ, వైసీపీ నాయకుల మద్య వాగ్వివాదం చోటుచేసుకుంది.  




Updated Date - 2021-01-26T07:02:55+05:30 IST