వంగి వంగి దండాలు పెడుతూ ఓట్లు అడిగావు...

ABN , First Publish Date - 2022-05-20T06:27:41+05:30 IST

‘ఎన్నికల సందర్భంగా వంగి వంగి దండాలు పెడుతూ ఓట్లు అడిగావు.. ఈ రోజు సమస్యలు పరిష్కరించమని అడిగితే పారిపోతావా’ అంటూ కదిరి ఎమ్మెల్యే పీవీ సిద్దారెడ్డిని మహిళలు నిలదీశారు.

వంగి వంగి దండాలు పెడుతూ   ఓట్లు అడిగావు...
సమస్యలపై ఎమ్మెల్యే పీవీ సిద్దారెడ్డిని నిలదీస్తున్న ప్రజలు


సమస్యలు అడిగితే పారిపోతావా..

‘గడప గడపకు..’లో కదిరి ఎమ్మెల్యేను నిలదీసిన ప్రజలు

తలుపుల, మే19: ‘ఎన్నికల సందర్భంగా వంగి వంగి దండాలు పెడుతూ ఓట్లు అడిగావు.. ఈ రోజు సమస్యలు పరిష్కరించమని అడిగితే పారిపోతావా’ అంటూ కదిరి ఎమ్మెల్యే పీవీ సిద్దారెడ్డిని మహిళలు నిలదీశారు. తలుపుల మండలంలోని ఉడమలకుర్తి గ్రామంలో ఎమ్మెల్యే గురువారం ‘గడప గడపకు మన ప్రభుత్వం’ కార్యక్రమం నిర్వహించారు. అదే సమయంలో వర్షం కురుస్తుండడం, రోడ్లపై నీరు చేరి, ఇళ్లలోకి వస్తుండడంతో మహిళలు బాబులమ్మ, నూర్జహాన తదితరులు ఆవేదన చెందారు. కాలనీలోకి వచ్చిన ఎమ్మెల్యేను.. ఏడాదిగా సీసీ రోడ్డు, కాలువ వేయాలని కోరుతున్నా.. పట్టించుకోలేదని అడ్డుకున్నారు. సమాధానం చెప్పకుండా ఎమ్మెల్యే వెళ్లిపోతుండడంతో మహిళలు ‘వంగి వంగి దండాలు పెడుతూ ఓట్లకోసం వచ్చినావు.. ఇప్పుడు సమస్యలు అడిగితే వెళ్లిపోతావా’ అంటూ బిగ్గరగా కేకలు వేశారు. ఎమ్మెల్యే వెంట వెళ్తున్న ఓ నాయకుడు.. ‘సార్‌ మళ్లీ వస్తాడులే’ అంటూ సముదాయించే ప్రయత్నం చేశాడు. అందుకు ఓ మహిళ మాట్లాడుతూ.. ‘సార్‌ మళ్లీ వస్తాడులే.. పోలీసోళ్లను వీపున కట్టుకుని’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది.



Updated Date - 2022-05-20T06:27:41+05:30 IST