Ben Stokes: వన్డేలకు గుడ్‌బై చెప్పేసిన స్టార్ క్రికెటర్

ABN , First Publish Date - 2022-07-18T23:36:14+05:30 IST

ఇంగ్లండ్ స్టార్ ఆల్‌రౌండర్ బెన్‌స్టోక్స్ (Ben Stokes) సంచలన నిర్ణయం తీసుకున్నాడు. వన్డేల నుంచి తప్పుకుంటున్నట్టు

Ben Stokes: వన్డేలకు గుడ్‌బై చెప్పేసిన స్టార్ క్రికెటర్

లండన్: ఇంగ్లండ్ స్టార్ ఆల్‌రౌండర్ బెన్‌స్టోక్స్ (Ben Stokes) సంచలన నిర్ణయం తీసుకున్నాడు. వన్డేల నుంచి తప్పుకుంటున్నట్టు తాజాగా ప్రకటించాడు. మంగళవారం డుర్హమ్‌లో దక్షిణాఫ్రికా (South Africa)తో జరగనున్న వన్డే అతడికి చివరిది కానుంది. ప్రపంచకప్ ట్రోఫీతో నిల్చున్న ఫొటోను షేర్ చేస్తూ తన రిటైర్మెంట్‌ను స్టోక్స్ ప్రకటించాడు.


వన్డేలకు రిటైర్మెంట్ ప్రకటించాలని నిర్ణయించుకున్నానని, మంగళవారం డుర్హమ్‌లో దక్షిణాఫ్రికా(South Africa)తో చివరి వన్డే ఆడతానని పేర్కొన్నాడు. ఇది చాలా కఠిన నిర్ణయమన్నాడు. ఇంగ్లండ్ కోసం సహచరులతో ఆడిన ప్రతి క్షణాన్ని తాను ప్రేమించానని చెప్పుకొచ్చాడు. ఈ మార్గంలో తాము అద్భుతమైన ప్రయాణం చేశామని స్టోక్స్ ఆ ట్వీట్‌లో పేర్కొన్నాడు.


ఇకపై టెస్ట్ క్రికెట్‌కు చేయాల్సిందంతా చేస్తానని, వన్డేల నుంచి తప్పుకోవడం ద్వారా టీ20 ఫార్మాట్‌పై పూర్తిస్థాయిలో దృష్టిసారించగలుగుతానని పేర్కొన్నాడు. జోస్ బట్లర్, మాథ్యూ మోట్ ఇతర ఆటగాళ్లు, సహాయక సిబ్బందికి.. ఇలా ప్రతి ఒక్కరికీ శుభాకాంక్షలు తెలుపుకుంటున్నట్టు చెప్పాడు. వైట్‌బాల్ క్రికెట్‌లో గత ఏడేళ్లుగా గొప్ప పురోగతి సాధించామన్నాడు. భవిష్యత్ మరింత ఉజ్వలంగా కనిపిస్తోందన్నాడు. ఇప్పటి వరకు 104 మ్యాచ్‌లు ఆడానని, ఇప్పుడు ఇంకోటి చేరబోతోందని అన్నాడు. చివరి మ్యాచ్ ఆడబోతున్నానన్న ఫీలింగ్ గొప్పగా ఉందన్నాడు.


స్టోక్స్ ఇప్పటి వరకు 104 వన్డేలు ఆడి 39.44 సగటుతో 2,919 పరుగులు చేశాడు. న్యూజిలాండ్‌ (New Zealand)తో ప్రపంచకప్ ఫైనల్‌లో 84 పరుగులు చేసి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్‌గానూ నిలిచాడు. 2011లో ఐర్లండ్‌తో మ్యాచ్‌లో వన్డేల్లో అరంగేట్రం చేసిన స్టోక్స్ మొత్తంగా 2919 పరుగులు చేశాడు. ఇందులో మూడు సెంచరీలు ఉన్నాయి. 74 వికెట్లు తీసుకున్నాడు. పాకిస్థాన్‌తో జరిగిన రాయల్ లండన్ సిరీస్‌లో ఇంగ్లండ్‌కు కెప్టెన్‌గా వ్యవహరించిన స్టోక్స్ ఆ సిరీస్‌లో జట్టుకు 3-0తో అద్భుత విజయాన్ని అందించిపెట్టాడు. 


ప్రస్తుతం టెస్టు జట్టుకు కెప్టెన్‌గా ఉన్న స్టోక్స్.. న్యూజిలాండ్‌ను చిత్తు చేసి 3-0తో సిరీస్‌ను అందించాడు. అలాగే, ఎడ్జ్‌బాస్టన్ టెస్టులో భారత్‌ను ఓడించాడు. కాగా, 2019 ప్రపంచకప్‌ను ఇంగ్లండ్‌కు అందించిన అప్పటి కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ (Eoin Morgan) కూడా ఇటీవలే అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. 

Updated Date - 2022-07-18T23:36:14+05:30 IST