గల్లీకో ‘బెల్ట్‌’!

ABN , First Publish Date - 2022-05-24T05:12:24+05:30 IST

గ్రామాల్లో బెల్టుషాపుల జోరు కొనసాగుతోంది.

గల్లీకో ‘బెల్ట్‌’!

  • పల్లెల్లో జోరుగా సాగుతున్న బెల్ట్‌ దుకాణాలు
  • విచ్చలవిడిగా మద్యం అక్రమ అమ్మకాలు 
  • చోద్యం చూస్తున్న అబ్కారీ పోలీసులు


గ్రామాల్లో బెల్టుషాపుల జోరు కొనసాగుతోంది. గల్లీగల్లీలో మందు దొరుకుతుంది. అర్ధరాత్రి వరకు కూడా దుకాణాలు కిటకిటలాడుతున్నాయి. ఎమ్మార్పీ కన్నా రేటు పెంచి మద్యంపై అదనపు లాభాలు ఆర్జిస్తున్నారు. దీంతో మద్యం బాబుల జేబులకు చిల్లులు పడుతున్నాయి.  అప్పులు చేసి తాగడంతో కాపురాలు వీధిపాలవుతున్నాయి. పట్టపగలే బెల్ట్‌ షాపులను నడుపుతున్నా ఎక్సైజ్‌ శాఖ అధికారులు పట్టించుకోవడం లేదు. 


మొయినాబాద్‌ రూరల్‌, మే 23 : మండల పరిధిలోని గ్రామాల్లో బెల్టు షాపుల దందా జోరుగా కొనసాగుతుంది. మద్యం అక్రమ విక్రయాలు విచ్చలవిడిగా సాగుతున్నా ఎక్సైజ్‌ శాఖ చూసీచూడనట్లుగా వ్యవహరిస్తున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కిరాణ దుకాణాల మాటున బెల్టుషాపులు ఏర్పాటు చేసి రాత్రి పగలు అనే తేడా లేకుండా మద్యం అమ్మకాలు సాగిస్తున్నారని పలువురు మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బెల్ట్‌షాపుల్లో అధిక ధరలకు మద్యం విక్రయాలు జరుపుతూ మందుబాబుల జేబులు గుల్ల చేస్తున్నా పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. ఊళ్లల్లో ఎక్కడపడితే అక్కడ మద్యం దొరుకుతుండటంతో యువత పెడదారి పడుతున్నారు. మద్యానికి బానిసై కుటుంబాలను పట్టించుకోకుండా వేధింపులకు గురిచేస్తున్నారు. నగర శివారు మొయినాబాద్‌ మండలంలోని ఏ గ్రామానికి వెళ్లినా వీధివీధినా బెల్టు దుకాణాలు దర్శనమిస్తున్నాయి. బాహాటంగా మద్యం అమ్మకాలు జరుగుతున్నా అబ్కారీ పోలీసులు వారి జోలికి వెళ్లడం లేదని విమర్శలు వస్తున్నాయి. ఎలాంటి అనుమతులు లేకుండా ఇష్టానుసారంగా మద్యాన్ని విక్రయిస్తున్నా.. వారిపై పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంపై పలు అనుమానాలకు తావిస్తోంది. ప్రతి గ్రామంలో కనీసం రెండు నుంచి 10 వరకు బెల్టుషాపులు నడుస్తున్నాయి. విచ్చలవిడిగా జరుగుతున్న మద్యం అమ్మకాలపై మహిళలు ఫిర్యాదు చేసినా స్పందన ఉండటం లేదు. ఎన్నో కుటుంబాల్లో మద్యం చిచ్చు పెడుతున్నా ఆయా గ్రామ ప్రజాప్రతినిధుల అండదండలతో బెల్టు దుకాణాలు జోరుగా నడుస్తున్నాయని పలువురు ఆరోపిస్తున్నారు. 


గ్రామాల బాట

పండగలు, ఎన్నికలు ఇతర సందర్భాల్లో ప్రభుత్వాలు ఆదేశాల మేరకు మద్యం దుకాణాలను మూసివేస్తుంటారు. ఇలాంటి సమయంలో మొయినాబాద్‌ మండలంలోని ఆయా గ్రామాల్లో నడుస్తున్న బెల్టుదుకాణాలకు మందుబాబులు క్యూ కడుతుంటారు. మండలం నుంచే కాకుండా నగరంలోని పలు ప్రాంతాల నుంచి మద్యం కోసం ఈ గ్రామాలకు వస్తుండడం గమనార్హం. ఇదే అదునుగా భావించే బెల్టు షాపుల యాజమానులు ప్రభుత్వ ధరకు రెండింతలు విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. ఇంత జరుగుతున్నా అబ్కారీ శాఖ అధికారులతోపాటు, స్థానిక పోలీసులు ఆ గ్రామాల వైపు కన్నెత్తి  కూడా చూడకపోవడం గమనార్హం. దూర ప్రాంతాల నుంచి మద్యం కోసం వచ్చి కొందరు ప్రాణాలను సైతం కోల్పోతున్నారు. ఇటీవల బాకారంలో మద్యం కోసం వస్తున్న ఎన్కేపల్లి గ్రామానికి చెందిన వ్యక్తిని కారు ఢీ కొనడంతో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. మొయినాబాద్‌ పోలీసులతోపాటు అబ్కారీ పోలీసులు నిద్రమత్తు వీడి బెల్టుదుకాణాలను అరికట్టాలని పలువురు కోరుతున్నారు.


ఎప్పుడువస్తారో.. ఎప్పుడు వెళ్తారో?

చేవెళ్ల నియోజకవర్గ కేంద్రంలో అబ్కారీశాఖ పోలీ్‌సస్టేషన్‌ ఉంది. ఇక్కడ సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌ స్థాయి అధికారితోపాటు ఎస్సై ఇతర సిబ్బంది ఉన్నారు. అయితే వీరు ఎప్పుడు కార్యాలయానికి వస్తారో.. ఎప్పుడు వెళ్తారో తెలియని పరిస్థితి నెలకొంది. గ్రామాల్లో బెల్టుదుకాణాలపై ఎస్‌ఓటీ పోలీసులు వచ్చి దాడులు చేసి మద్యం పట్టుకుంటున్నప్పటికీ స్థానికంగా ఉన్న అబ్కారీపోలీసులు ఆ పని ఎందుకు  చేయడం లేదని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఇకనైనా అబ్కారీ అధికారులు నిద్రమత్తు వీడి గ్రామాల్లో విచ్చలవిడిగా నడుస్తున్న బెల్టుదుకాణాలను మూసివేయించాలని మండల ప్రజలు కోరుతున్నారు. 


ఈ గ్రామాల్లో బెల్టు దుకాణాలు అధికం

మొయినాబాద్‌ మండలంలోని పలు గ్రామాల్లో బెల్టు దుకాణాల వ్యవహారం జోరుగా సాగుతున్నా పట్టించుకోవాల్సిన అబ్కారీ పోలీసులు మామూళ్ల మత్తులో మునిగిపోతున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. మండలంలోని బాకారం జాగీర్‌, చిన్నమంగళారం, సురంగల్‌, కనకమామిడి, మేడిపల్లి, చిలుకూరు, అప్పోజిగూడ, ఎన్కేపల్లి, పెద్దమంగళారం, చందానగర్‌, రెడ్డిపల్లి, మూర్తుగూడ, ఆమ్డాపూర్‌, కాశీంబౌళి, సురంగల్‌, కేతిరెడ్డిపల్లి తదితర గ్రామాల్లో బెల్టుదుకాణాలు విచ్చలవిడిగా నడుస్తున్నాయి. ఏ కారణం చేతనైనా మద్యం దుకాణాలు మూసివేసే ముందు రోజే ఈ గ్రామాల్లోకి అక్రమంగా మద్యాన్ని దుకాణాదారులే తరలిస్తుండడం కొసమెరుపు.


ఎక్సైజ్‌ శాఖకు బెల్ట్‌షాపులు కనిపించడం లేదా?

మొయినాబాద్‌ మండల పరిధిలోని కనకమామిడి గ్రామంలో ఇటీవల ఎస్‌ఓటీ పోలీసులు దాడులు నిర్వహించి రూ.20వేల మద్యం సీసాలను పట్టుకున్నారు. అంతేకాకుండా బాకారం జాగీర్‌ గ్రామంలో సైతం ఎస్‌ఓటీ పోలీసులు దాడులు నిర్వహించి అక్రమంగా బెల్టు దుకాణాలను నిర్వహిస్తున్న వారిపై దాడులు చేసి మద్యం స్వాధీనం చేసుకున్నారు. ఎస్‌ఓటీ పోలీసులు వచ్చి దాడులు నిర్వహిస్తున్నా.. స్థానిక పోలీసులకు మాత్రం ఈ బెల్టుదుకాణాల వ్యవహారం కనిపించడం లేదా అని స్థానికులు ప్రశ్నిస్తున్నారు.


అధికారులు నిద్రమత్తు వీడాలి.. 

గ్రామాల్లో అక్రమంగా మద్యం విక్రయాలు జరుగుతున్నా సంబంధిత అధికారులు చోద్యం చూస్తున్నారు. మద్యానికి బానిసై యువత ఉద్యోగాలకు వెళ్లకపోవడంతో కుటుంబాల్లో ఘర్షణలు చోటుచేసుకుంటున్నాయి. మద్యం కోసం ఆయా గ్రామాల బాటపట్టి యువత రోడ్డు ప్రమాదాలకు గురవుతున్నారు. అధికారులు నిద్రమత్తు వీడి గ్రామాల్లో ఉన్న బెల్టు దుకాణాలను మూసివేయాలి. మద్యానికి బానిస కాకుండా యువతకు ప్రభుత్వం అవగాహన కల్పించాలి.

- గున్నాల గోపాల్‌రెడ్డి, బీజేపీ జిల్లా నేత


Updated Date - 2022-05-24T05:12:24+05:30 IST